hindupur mp
-
కిష్టప్పా.. ఇదేందప్ప!
అభివృద్ధి చేస్తానంటూ ఊరిని దత్తతకు తీసుకుంటివి చుట్టపు చూపుగా కూడా రాకపోతివి గ్రామ రూపురేఖలు మారుస్తానంటివి రెండేళ్లుగా కనిపించకుండా పోతివి సోమఘట్ట వాసుల ఆవేదన హిందూపురం అర్బన్: ‘ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరిందంట’ అన్న చందంగా మారింది హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తీరు. తాను పుట్టి పెరిగిన మండలాన్ని అభివృద్ధి చేయలేని ఆయన.. దత్తత పేరుతో తీసుకున్న గ్రామాభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో గోరంట్ల మండల వాసుల దాహార్తిని తీర్చలేకపోయారు. మండలాధ్యక్షుడిగాను, ఎమ్మెల్యేగాను, ఎంపీగాను బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. తాను రైతు బిడ్డగా చెప్పుకుంటున్న నిమ్మల కిష్టప్పకు గ్రామీణ ప్రాంతాల దుస్థితిపై పూర్తి అవగాహన ఉంది. ఆయన అనుకుంటే గ్రామీణ ప్రాంత రూపురేఖలు మార్చగలరు. తన కోటా నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెంచేందుకు అవకాశముంది. అయినా ఆయనకు అవేమీ పట్టవు. ఆఖరుకు చిలమత్తూరు మండలం సోమఘట్ట గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ రెండేళ్ల క్రితం దత్తతకు తీసుకున్న ఆయన.. తర్వాత ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మలంగా ఉండిపోయారు. లోకసభ నియోజకవర్గం: హిందూపురం పార్లమెంట్ సభ్యుడు : నిమ్మల కిష్టప్ప దత్తతకు తీసుకున్న గ్రామం : సోమఘట్ట, చిలమత్తూరు మండలం గ్రామంలోని గడపలు : 470 గ్రామ జనాభా : 1,200 హిందూపురం లోకసభ నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం సోమఘట్ట గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ రెండేళ్ల క్రితం ఎంపీ నిమ్మల కిష్టప్ప దత్తతకు తీసుకున్నారు. గ్రామ రూపురేఖలు మార్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానంటూ గ్రామస్తులకు అప్పట్లో ఆయన నమ్మబలికారు. అయితే ఈ రెండేళ్లలో ఆ గ్రామం ఇసుమంతైనా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేదు. అసలు గ్రామానికి రహదారి కూడా సక్రమంగా లేదు. గ్రామంలోకి నేటికీ ఎర్రబస్సు వెళ్లదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణమంటే ఆటోలే దిక్కు. డ్రెయినేజీ వ్యవస్థ లేదు. గ్రామం మధ్యలోనే మురుగు నీటి నిల్వలు పేరుకుపోయాయి. దోమలు, పందుల బెడదతో రోగాలు ప్రబలుతున్నాయి. ఇక తాగునీటి కోసం గ్రామీణులు పడే ఇక్కట్లు చెప్పనలవి కాదు. ఉపాధి పనులు లేవు. వ్యవసాయం అంతంత మాత్రమే. పాడి పోషణకు ప్రోత్సాహం కరువైంది.. ప్రభుత్వం మంజూరు చేస్తున్న సొంతిల్లు కలగానే మిగిలిపోయింది. గ్రామంలోని ప్రధాన సమస్యలివే – సోమఘట్టలోని బీసీ, ఎస్సీ ఇతర కాలనీలకు కనీస రోడ్డు సదుపాయం లేదు. – గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ లేదు. ఎక్కడిపడితే అక్కడ మురుగునీరు నిలిచిపోయింది. దుర్గంధం వ్యాపిస్తోంది. – తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం స్థానికులు వ్యవసాయ బోరు బావులపై ఆధారపడ్డారు. – పశు ఉపవైద్యశాల లేకపోవడంతో పాడి రైతులు పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతంలోని పశువైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. – గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేదు. – పంచాయతీ కార్యాలయం పక్కన మరుగుదొడ్డి నిర్మాణం కోసం వేసిన పునాది దీర్ఘకాలంగా అలాగే ఉండిపోయింది. – పెద్ద చెరువు, చిన్న చెరువులకు వెళ్లే దారులు సరిగా లేకపోవడంతో అటుగా ఉన్న పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి సమస్య తీరలేదు గ్రామంలో బోలెడు సమస్యలు ఉన్నాయి. తాగునీరు అందడం లేదు. నీటి కోసం పాలాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. - డి.చిన్నప్ప, సోమఘట్ట, చిలమత్తూరు మండలం మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే వచ్చారు మా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంపీ నిమ్మల కిష్టప్ప దత్తతకు తీసుకున్నారు. రోడ్లు వేస్తానన్నారు. మురికి కాలులు ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇంకా అదీ చేస్తాను.. ఇది చేస్తాను అని చెప్పారు. ఇయన్నీ చెప్పినాయన ఇటుగా వచ్చింది లేదు. ఎంపీ గెలిచిన ఈ మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్లారు. మా ఊరిని పట్టించుకునే వారే కరువయ్యారు. - శ్రీనివాసులు, సోమఘట్ట, చిలమత్తూరు మండలం. -
ఎంపీ కుమారుల భూమి రిజిస్ట్రేషన్ రద్దు
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ శశిధర్ స్పందించారు. రికార్డులు తారుమారు చేసిన బూదిలి గ్రామ వీఆర్ఓ నరసింహమూర్తిని సస్పెండ్ చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారులు చేయించిన భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులకే భూములు అప్పగిస్తూ కలెక్టర్ శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. (చదవండి - నిమ్మల భూ కిరికిరి) బాధిత రైతు మల్లేశప్ప జిల్లా కలెక్టర్, ఎస్పీని మీ కోసం కార్యక్రమంలో కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 18న స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 2011లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు బాధిత రైతు మల్లేశప్ప తహశీల్దార్ ఎదుట హాజరై తన వాంగ్మూలంతో పాటు భూములకు సంబంధించిన పక్కా రికార్డులను సమర్పించారు. -
నిమ్మల భూ కిరికిరి
– పేద రైతుకు చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు – అన్ని విధాలా సహకరించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు – లబోదిబోమంటున్న బాధితుడు –––––––––––––––––––––––––– ఈ భూమి గోరంట్ల మండలం బూదిలి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 476లో ఉంది. మొత్తం విస్తీర్ణం 13.30 ఎకరాలు. 44వ జాతీయ రహదారికి ఆనుకునే ఉంది. దీంతో ఎకరా ఎంతలేదన్నా రూ.25 లక్షలకు పైమాటే. గతంలో ఈ భూమితో పాటు మిగిలిన భూములనూ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) కోసం సేకరించారు. అయితే.. పట్టా భూమి అని తేలడంతో రెవెన్యూ అధికారులు సెజ్ పరిధి నుంచి తప్పించారు. ఆ తర్వాత లొసుగులను ఆధారంగా చేసుకుని అధికార పార్టీకి చెందిన హిందూపురం లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప తనయులు నిమ్మల శిరీష్, అంబరీష్ తమ వశం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారుల సహకారంతో భూముల రికార్డులనే మార్చి.. ఇందులోని 4.66 ఎకరాలను రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నం: 3761/16) చేయించుకున్నారు. గోరంట్ల : గోరంట్ల మండలంలో ఇటీవల భూ అక్రమాలు పెరిగిపోతున్నాయి. పేదల అమాయకత్వాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు కూడా సహకరిస్తున్నారు. ఈ అక్రమాల్లో ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్లు తేలడం గమనార్హం. గోరంట్ల మండలం బూదిలి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 476లో ఉన్న 13.30 ఎకరాల భూమిని 1920వ సంవత్సరంలో తమ్మినాయనిపల్లికి చెందిన వడ్డే సుంకుడు అనే వ్యక్తికి ప్రభుత్వం పంపిణీ చేసింది. తదనంతరం అతని కుమారుడైన వడ్డే సుంకన్న అలియాస్ ఎద్దుల ఆయప్పకు సంక్రమించింది. అతను అదే గ్రామానికి చెందిన∙కుమ్మర మల్లయ్య, కుమ్మర ఈరన్నలకు విక్రయించాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు నంబర్లు 263/1973, 264/1973. అప్పటి నుంచి వారే సాగు చేసుకుంటూ ఉండేవారు. అయితే.. 2011లో ఇందులోని 8.64 ఎకరాల భూమిని గోరంట్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు చెన్నకష్ణారెడ్డి, ధర్మవరం పట్టణానికి చెందిన కదిరప్ప కలిసి కొనుగోలు చేశారు. మరో 1.33 ఎకరాలను కదిరప్ప ఒక్కరే కొన్నారు. మిగిలిన 3.33 ఎకరాలను కుమ్మర మల్లయ్య రెండో భార్య మల్లక్క కుమారుడు మల్లేశప్ప సాగు చేస్తున్నాడు. 2013లో పట్టాదారు పాసుపుస్తకాన్ని (1బీ నంబర్ 2579) కూడా పొందారు. ఆ తర్వాత వెబ్‌ల్యాండ్‌లోనూ నమోదు చేయించుకున్నారు. ఆర్డీఓ కోర్టు తీర్పూ వారి పక్షమే.. బూదిలి, వడిగేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 5,733.60 ఎకరాల ప్రభుత్వ, డీకేటీ భూములను ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) కోసం సేకరించాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ (కర్నూలు) కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌కు 2008 మే 30న లేఖ (ఆర్సీ నంబర్ : జెడ్ఓ/ఏపీఐఐసీ–కేఎన్ఎల్/ఐపీ 2277/08) వచ్చింది. 476 సర్వేనంబర్‌లోని 13.30 ఎకరాలు పట్టా భూమిగా గుర్తించి..భూసేకరణ నుంచి మినహాయించారు. అయితే.. 2014లో అప్పటి తహశీల్దార్ ఈ భూమి కూడా ప్రభుత్వానిదేనని, స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. దీనిపై భూమిని కొనుగోలు చేసిన చెన్నకష్ణారెడ్డి, కదిరప్పతో పాటు అనుభవంలో ఉన్న మల్లేశప్ప ఆర్డీఓ కోర్టులో అప్పీలు చేశారు. ఈ భూమి వారికే చెందుతుందని ఆర్డీఓ కోర్టు 2015 జూలై 22న తీర్పు ఇచ్చింది. ‘నిమ్మల’ంగా ఏమార్చారు! కదిరప్ప కొన్న 1.33 ఎకరాలు, మల్లేశప్ప ఆధీనంలోని 3.33 ఎకరాలు కలిపి మొత్తం 4.66 ఎకరాల భూమి చుట్టూ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు రాళ్లు పాతించారు. దీన్ని గమనించిన బాధిత రైతుతో పాటు భూమిని కొన్న వ్యక్తులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. గత నెల 30న వెబ్‌ల్యాండ్‌ను పరిశీలించగా సుంకన్న అలియాస్ ఎద్దుల ఆయప్ప భార్య అంజినమ్మ పేరిట వివరాలు నమోదై ఉన్నాయి. అలాగే ఈ నెల ఒకటిన ఎంపీ తనయులు నిమ్మల శిరీష్ , అంబరీష్ చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబర్ 3761/2016) పొందారు. ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా సెక్షన్ 22(ఏ) అనెగ్జర్ 5 కిందకు వచ్చే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే కలెక్టర్ ఎన్ఓసీ అవసరం. అయినప్పటికీ చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేశారు. తహశీల్దార్ ఏమంటున్నారంటే.. రిజిస్ట్రేషన్ విషయం తన దష్టికి రాలేదని గోరంట్ల తహసీల్దార్ హసీనా సుల్తాన్ చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం సంబంధిత వీఆర్ఓ నమోదు చేశారని, అతనిపై శాఖ పరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేశామని తెలిపారు. మరి డిజిటల్ కీ మీరేలా ఇచ్చారని అడగ్గా.. ఆమె సమాధానం దాటవేశారు. న్యాయం చేయాలి భూములను కాపాడాల్సిన అధికారులే ప్రజాప్రతినిధులకు అనుకూలంగా వ్యవహరించడంతో నాకు అన్యాయం జరిగింది. నా 3.33 ఎకరాల భూమిని మరొకరి పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి..వారి నుంచి ఎంపీ తనయులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎంపీ స్థాయి వారితో సామాన్యుణ్ని ఏవిధంగా పోరాడగలను?! అధికారుల నిర్వాకం వల్ల మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. – మల్లేశప్ప, బాధిత రైతు