చేనేత కార్మికులందరికీ గుర్తింపుకార్డులు
హిరమండలం : జిల్లాలోని చేనేత కార్మికులందరికీ గుర్తింపుకార్డులు అందిస్తామని జిల్లా జౌలు చేనేత సంస్థ ఏడీ జి.రాజారావు తెలిపారు. శనివారం సుభలయి శ్రీ ఏకాంబరే శ్వర చేనేత సంఘం కార్యాలయ ఆవరణలో చేనేత కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 1003 మంది చేనేత కార్మికుల పిల్లలకు(విద్యార్థులకు)ఉపకార వేతనాలు మంజూరయ్యాయన్నారు. ఏకాంబరేశ్వర సంఘం పరిధిలోని విద్యార్థులకు ఇప్పటికే స్కాలర్షిప్లు అందించామన్నారు. అలాగే జిల్లాలో 4380 మంది కార్మికులకు వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నామని, ఇంకా అర్హులైన వారు పూర్తి సమాచారంతో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. హుద్‌హుద్ తుపానుకు నష్టపోయిన 2 వేల చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని చేనేత సంఘం మండల అధ్యక్షుడు గణేష్ కోరారు. శాతవాహన స్పిల్లింగ్ మిల్లు మేనేజర్ కృష్ణారావు, సర్పంచ్ ఎ.సూర్యకుమారి, పీఏసీఎస్ డెరైక్టర్ రామకృష్ణ, మేనేజర్ శంకరరావు పాల్గొన్నారు.