hiralal samariya
-
సీఐసీ చీఫ్ కమిషనర్‌గా హీరాలాల్ సమారియా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్ (సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్) ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపదీ ముర్ము సమక్షంలో హీరాలాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వైకే సిన్హా పదవీ కాలం అక్టోబర్ 3న ముగియడంతో.. సమాచార కమిషన్ నియామకాలను చేపట్టాలంటూ కేంద్రానికి ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌కు చెందిన హీరాలాల్ సమారియాను సీఐసీ చీఫ్ కమిషనర్‌గా రెండేళ్ల కాలానికి గాను కేంద్రం నియమించింది. ఈ పదవిని దళిత వర్గానికి చెందిన అధికారి చేపట్టడం ఇదే మొదటిసారి. 1985వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా గతంలో కేంద్ర కారి్మక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు విభాగాల్లో కూడా ఆయన సేవలందించారు. -
సీఎస్టీ చార్జీలు భరించాల్సిందే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఐదేళ్ల పాటు కేంద్ర సేవా పన్ను (సీఎస్టీ) చార్జీలను రద్దు చేయాలని కోరిన ఫ్యాప్సీ, రెండు రాష్ట్రాల డీలర్లకు నిరాశే మిగిలింది. జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించినా సరే సీఎస్టీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా తేల్చిచెప్పారు. ఫ్యాప్సీ ఆధ్వర్యంలో గురువారమిక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో సహా) పన్ను చెల్లింపుదారుల గుర్తింపు సంఖ్య (టిన్) నంబర్ 36, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37 టిన్ నంబర్‌ను కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఈ కొత్త టిన్ నంబర్లు జూన్ 2 నుంచి అమలులోకి వస్తాయని, అప్పటివరకు ప్రస్తుతం ఉన్న 28 టిన్ నంబరే ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 11 నంబర్లుండే ఈ టిన్ నంబర్లో మొదటి రెండు నంబర్లు రాష్ట్రం యొక్క కోడ్‌ను సూచిస్తుందన్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం మాత్రమే పదేళ్ల పాటు హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంయుక్త రాజధానిగా ఉంటుందే తప్ప వాణిజ్య పన్నుల చెల్లింపు, ఆదాయం కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం ఉండదని సమారియా వివరించారు. ప్రస్తుతం 2.80 లక్షల మంది డీలర్లు ఉండగా.. ఇందులో కేవలం 85 వేల మంది మాత్రమే కొత్త టిన్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కొత్త టిన్ నంబర్, చిరునామా మార్పు, కొత్త వస్తువుల చేర్పు వంటి ఎలాంటి మార్పులున్నా మే 7వ తేదీ లోపు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేసుకోని డీలర్లకు అప్పటివరకు ఎక్కడి నుంచి అయితే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో ఆ రాష్ట్రం యొక్క కొత్త టిన్ నంబర్‌ను కేటాయిస్తామని సమారియా చెప్పుకొచ్చారు. జూన్ 2 తర్వాత జాయింట్ కమిటీ: జూన్ 2 తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ తలెత్తే వాణిజ్య పన్నుల కేటాయింపు, వివిధ రకాల పన్నుల చెల్లింపు వంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తామని సమారియా హామీ ఇచ్చారు. ఈ కమిటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని నిపుణులైన ఎక్సైజ్, ట్యాక్స్ అధికారులు, ఫ్యాప్సీ, ట్రేడ్ మెంబర్లు మెంబర్లుగా ఉంటారని చెప్పారు. జూన్ 2 తర్వాత వ్యాపారస్తులు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు రెండు రాష్ట్రాల వ్యాపారస్తులు కొత్త టిన్ నంబర్లు ఉపయోగించాలని, అదేవిధంగా జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు చేయదలిచే వ్యాపారులు కొత్తగా సీ ఫామ్‌ను తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుందని సమారియా వివరించారు. రెండు రాష్ట్రాల్లో చేసే వ్యాపార కార్యకలాపాలను బట్టి వేర్వేరుగా పన్నులుంటాయన్నారు. జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అమలులోకి వచ్చే సీఎస్టీ, రవాణా చార్జీలు, వ్యాట్, టోల్గేట్ల వంటి అనేక రకాల పన్నుల భారాన్ని ఇరు రాష్ట్రాల వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతో ప్రధానంగా లిక్కర్, టెక్స్టైల్స్ వంటి వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర, రిటైర్డ్ ఐఏఎస్ అశుతోష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో కొత్త టిన్ నంబర్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో సహా) వ్యాపారస్తులకు పన్ను చెల్లింపుదారుల గుర్తింపు సంఖ్య (టిన్) కొత్త నంబర్లను ఇస్తామని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా చెప్పారు. తొలి విడతగా 2 లక్షల మంది డీలర్లకు కొత్త టిన్ నంబర్లను కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేటాయించిన కొత్త టిన్ నంబర్లు జూన్ 2వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఫ్యాప్సీ ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ జరిగిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ- వాణిజ్య పన్నులు’ అనే సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరాలాల్ మాట్లాడుతూ.. ‘మొత్తం 11 నంబర్లుండే టిన్ నంబర్లో మొదటి రెండు నంబర్లు రాష్ట్రం యొక్క కోడ్‌ను సూచిస్తుంది. మిగిలిన 9 నంబర్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని డీలర్లకు కేటాయించే టిన్ నంబర్ల విషయంలో.. ఇప్పుడున్న టిన్ నంబర్ల ముందు కొత్తగా కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొదటి రెండు నంబర్లు పెట్టాలా లేక పూర్తిగా 11 నంబర్ల కొత్త టిన్ నంబర్‌ను ఇవ్వాలా అనే విషయంలో కేంద్రానికి లేఖ రాశామని’ ఆయన వివరించారు. వారం రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందని ఆ తర్వాతే కొత్త టిన్ నంబర్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. జూన్ 2 తర్వాత వ్యాపారస్తులు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు రెండు రాష్ట్రాల ప్రత్యేక టిన్ నంబర్లు ఉపయోగించాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లో చేసే వ్యాపార కార్యకలాపాలను బట్టి వేర్వేరుగా పన్నులుంటాయని చెప్పారు. ఆయా పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 53 శాతం తెలంగాణకు, 47 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కేటాయింపులుంటాయని వివరించారు. రూ.50 వేల కోట్ల ఆదాయం: గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.50 వేల కోట్లను వసూలు చేసిందని చెప్పారు. దేశంలోనే ఇంత మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించింది మన రాష్ట్రమే అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాణిజ్య పన్నుల బ కాయిలు రూ.12 వేల కోట్లుగా ఉన్నాయని, రీఫండ్ అయితే రూ.5 వేల కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం మాత్రమే పదేళ్ల పాటు హైదరాబాద్ సంయుక్త రాజధానిగా ఉంటుందని వాణిజ్య పన్నులు చెల్లింపు, ఆదాయం కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎలాంటి సంబంధం ఉండదని సమారియా వివరించారు. జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకాలు చేయదలిస్తే సీ ఫామ్‌ను తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా 2 శాతం సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. సీఎస్టీ, వ్యాట్, రవాణా చార్జీలు, టోల్గేట్ల అనేక రకాల పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటున్నందున ధరలు కూడా పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.