సీఎస్‌టీ చార్జీలు భరించాల్సిందే! | TINs to fix commercial tax in divided AP | Sakshi
Sakshi News home page

సీఎస్‌టీ చార్జీలు భరించాల్సిందే!

Published Fri, Apr 25 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM

సీఎస్‌టీ చార్జీలు భరించాల్సిందే!

సీఎస్‌టీ చార్జీలు భరించాల్సిందే!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఐదేళ్ల పాటు కేంద్ర సేవా పన్ను (సీఎస్టీ) చార్జీలను రద్దు చేయాలని కోరిన ఫ్యాప్సీ, రెండు రాష్ట్రాల డీలర్లకు నిరాశే మిగిలింది. జూన్ 2  తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించినా సరే సీఎస్టీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా తేల్చిచెప్పారు. ఫ్యాప్సీ ఆధ్వర్యంలో గురువారమిక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

 తెలంగాణ రాష్ట్రానికి (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో సహా) పన్ను చెల్లింపుదారుల గుర్తింపు సంఖ్య (టిన్) నంబర్ 36, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37 టిన్ నంబర్‌ను కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఈ కొత్త టిన్ నంబర్లు జూన్ 2 నుంచి అమలులోకి వస్తాయని, అప్పటివరకు ప్రస్తుతం ఉన్న 28 టిన్ నంబరే ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 11 నంబర్లుండే ఈ టిన్ నంబర్‌లో మొదటి రెండు నంబర్లు రాష్ట్రం యొక్క కోడ్‌ను సూచిస్తుందన్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం మాత్రమే పదేళ్ల పాటు హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంయుక్త రాజధానిగా ఉంటుందే తప్ప వాణిజ్య పన్నుల చెల్లింపు, ఆదాయం కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం ఉండదని సమారియా వివరించారు.

 ప్రస్తుతం 2.80 లక్షల మంది డీలర్లు ఉండగా.. ఇందులో కేవలం 85 వేల మంది మాత్రమే కొత్త టిన్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కొత్త టిన్ నంబర్, చిరునామా మార్పు, కొత్త వస్తువుల చేర్పు వంటి ఎలాంటి మార్పులున్నా మే 7వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేసుకోని డీలర్లకు అప్పటివరకు ఎక్కడి నుంచి అయితే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో ఆ రాష్ట్రం యొక్క కొత్త టిన్ నంబర్‌ను కేటాయిస్తామని సమారియా చెప్పుకొచ్చారు.

 జూన్ 2 తర్వాత జాయింట్ కమిటీ: జూన్ 2 తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ తలెత్తే వాణిజ్య పన్నుల కేటాయింపు, వివిధ రకాల పన్నుల చెల్లింపు వంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తామని సమారియా హామీ ఇచ్చారు. ఈ కమిటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని నిపుణులైన ఎక్సైజ్, ట్యాక్స్ అధికారులు, ఫ్యాప్సీ, ట్రేడ్ మెంబర్లు మెంబర్లుగా ఉంటారని చెప్పారు.

జూన్ 2 తర్వాత వ్యాపారస్తులు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు రెండు రాష్ట్రాల వ్యాపారస్తులు కొత్త టిన్ నంబర్లు ఉపయోగించాలని, అదేవిధంగా జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు చేయదలిచే వ్యాపారులు కొత్తగా సీ ఫామ్‌ను తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుందని సమారియా వివరించారు. రెండు రాష్ట్రాల్లో చేసే వ్యాపార కార్యకలాపాలను బట్టి వేర్వేరుగా పన్నులుంటాయన్నారు. జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అమలులోకి వచ్చే సీఎస్టీ, రవాణా చార్జీలు, వ్యాట్, టోల్‌గేట్ల వంటి అనేక రకాల పన్నుల భారాన్ని ఇరు రాష్ట్రాల వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతో ప్రధానంగా లిక్కర్, టెక్స్‌టైల్స్ వంటి వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర, రిటైర్డ్ ఐఏఎస్ అశుతోష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement