పరిశ్రమకు మరిన్ని రాయితీలు: ఫ్యాప్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతమున్న పారిశ్రామిక, ఐటీ పాలసీలను మరో 5-10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కొనసాగిస్తాయని ఆశిస్తున్నట్టు ఫ్యాప్సీ తెలిపింది. అలాగే తయారీ, మౌలిక రంగానికి మరిన్ని రాయితీలు కల్పించాలని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా, వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్ రెడ్డి కోరారు. సహేతుక ధరలో తగినంత విద్యుత్ సరఫరాకు రెండు రాష్ట్రాలూ హామీ ఇవ్వాలని విన్నవించారు.
కొత్త ప్రభుత్వాల ముందు సవాళ్లూ ఉన్నాయని గుర్తు చేశారు. పరిశ్రమను, వాణిజ్యాన్ని వృద్ధి చేసేందుకు ఇరు ప్రభుత్వాలతో కలిసి ఫ్యాప్సీ పనిచేస్తుందని అన్నారు. ఇక మోడీ ప్రభుత్వ పారిశ్రామిక విధానం నిలకడగా, స్వేచ్ఛగా ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్ధీపనంగా పనిచేస్తుందని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. పాలసీలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ప్రధానంగా దీర్ఘకాలంగా నిలిచిపోయిన విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర భారీ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని సూచించారు.