FAPCCI
-
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సర్టిఫికెట్ కోర్సు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో ఆన్లైన్లో సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ ఎస్కే షహాబుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: పేదల వకీల్ తరిమెల బాలిరెడ్డి కన్నుమూత వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహించడం, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రాజెక్ట్ సమగ్ర నివేదిక (డీపీఆర్), బ్యాంకుల స్కీంలు తదితర అంశాలపై ఆయా రంగాల్లోని నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, మహిళలు, యువతీ యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. వివరాలకు 80085 79624, 93914 22821నంబర్లలో సంప్రదించాలని కోరారు. చదవండి: AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం -
భవిష్యత్ అభివృద్ధికి బాటలు: ఫ్యాప్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర బడ్జెట్ భవిష్యత్ అభివృద్ధికి బాటలు పరిచేలా ఉందని ఫ్యాప్సీ అభిప్రాయపడింది. 10కిగాను 8 మార్కులు ఇస్తున్నట్టు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా శనివారమిక్కడ మీడియాకు తెలిపారు. సంతులిత బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. ఇన్ఫ్రా రంగానికి అదనంగా రూ.70 వేల కోట్లు కేటాయించారు. అలాగే చిన్న వ్యాపారులకు రుణాలిచ్చేందుకు రూ.20 వేల కోట్లతో ముద్ర బ్యాంకు, రూ.3 వేల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ కార్పస్ ఏర్పాటుతో వాణిజ్య, వ్యాపార పరంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. స్టార్టప్‌లను వెన్నుతట్టేలా రూ.1,000 కోట్లు కేటాయించడం ఆహ్వానించతగ్గదని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్ రెడ్డి చెప్పారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తారని ఎదురు చూసిన పరిశ్రమకు నిరాశ కలిగించారని అన్నారు. వ్యవసాయ రుణాలకు రూ.8.5 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి అతిపెద్ద బూస్ట్ అని వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర మోడి తెలిపారు. గార్ అమలు వాయిదా వల్ల భారత్‌కు పెట్టుబడులు పెరుగుతాయని ఫ్యాప్సీ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడిదారుల భయాలను తొలగించడంలో ఇది కీలక నిర్ణయమన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని, కమిటీ రాకతో ఆర్బీఐ గవర్నర్ అధికారాలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. -
మరిన్ని నిధులు కేటాయించాల్సింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశ్రమలకు, ఖనిజ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాల్సిందని ఫ్యాప్సీ అభిప్రాయపడింది. ‘విద్యుత్ రంగానికి స్పల్ప కేటాయింపులు నిరాశ కలిగించాయి. ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుదుత్పాదన లక్ష్యాన్ని ఎలా చేరుకునేది స్పష్టత ఇవ్వలేదు. వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇచ్చారు’ అని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా తెలిపారు. సబ్సిడీల కింద రావాల్సిన బకాయిలకుగాను రూ.638 కోట్లు కేటాయించడం వల్ల చిన్న కంపెనీలకు ఊరట లభించినట్టు అయిందన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని సీఐఐ తెలంగాణ చైర్పర్సన్, ఎలికో ఈడీ వనిత దాట్ల తెలిపారు. దీర్ఘకాలిక దృష్టికోణానికి బడ్జెట్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ సెక్రటరీ గోపాలరావు తెలిపారు. రిసర్చ్, ఇన్నోవేషన్ సర్కి ల్ ఆఫ్ హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తుందని హైసియా ప్రెసిడెంట్ రమేష్ లోగనాథన్ తెలిపారు.స్టార్టప్‌లకు మరిన్ని ప్రోత్సాహకాలిస్తే బాగుండేదని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం అభిప్రాయపడ్డారు. -
తెలంగాణలో పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు నిధులివ్వండి
పధ్నాలుగో ఆర్థిక సంఘానికి ఫ్యాప్సీ విజ్ఞప్తి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మరిన్ని నిధులు కేటాయించాలని పధ్నాలుగో ఆర్థిక సంఘానికి పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం 3,000 మెగావాట్ల మేర ఉంటోండగా.. రాబోయే ఐదేళ్లలో ఇది 14,000 మెగావాట్ల పైచిలుకు పెరిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భారీ స్థాయిలో వ్యవసాయ పంపుసెట్లు, పరిశ్రమలతో పాటు రాజధాని హైదరాబాద్ నగర విద్యుత్ అవసరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్ కుమార్ రుంగ్టా తెలిపారు. మరోవైపు, వెనుకబడిన జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కూడా మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని వివరించారు. అటు, కేంద్ర పన్నుల ఆదాయాల్లో రాష్ట్రాల వాటాను సైతం 45-50%కి పెంచాలన్నారు. వస్తు, సేవల పన్నుల విధానం అమలుకు గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక సంఘాన్ని ఫ్యాప్సీ కోరింది. -
ఫ్యాప్సీ అధ్యక్షులుగా శివకుమార్ రుంగ్టా
సాక్షి, హైదరాబాద్: ఫ్యాప్సీ నూతన అధ్యక్షులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త శివకుమార్ రుంగ్టా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రుంగ్టా గ్లాస్‌టెక్ అధినేతయైన ఆయనకు గత 12 ఏళ్లుగా ఫ్యాప్సీతో అనుబంధం వుంది. గతంలో ఆయన బ్యాంకింగ్, ఫైనాన్స్, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అనేక విభాగాలకు చైర్మన్‌గా పనిచేశారు. ఐఐటీ అహ్మదాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ఖేతాన్ గ్రూపులో చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిన శివకుమార్ రుంగ్టా అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో కెన్యా దేశానికి విదేశీ రాయబారిగా కూడా పనిచేశారు. 2012-13వ సంవత్సరంలో ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడిగా, 2013-14 సీనియర్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. సీనియర్ ఉపాధ్యక్షులుగా వి.అనీల్‌రెడ్డి దశాబ్దానికి పైగా ఫ్యాప్సీతో అనుబంధం ఉన్న వి.అనీల్‌రెడ్డి సీనియర్ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈ పూర్తి చేసిన అనీల్‌రెడ్డి ఫ్యాప్సీ నిపుణుల కమిటీ, ట్రేడ్ కమిటీ, కామర్స్ కమిటీలకు చైర్మన్‌గా పనిచేశారు. 2013-14వ సంవత్సరంలో ఫ్యాప్సీకి ఉపాధ్యక్షులుగా కొనసాగారు. ఇప్పుడాయిన ఫ్యాప్సీ సీనియర్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. -
ఎన్పీఏ నిబంధనలు మార్చలేం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్పీఏ నిర్వచనం, నిబంధనలు మార్చలేమని ఆర్బీఐ స్పష్టం చేసింది. తీసుకున్న రుణంపై 90 రోజుల పాటు ఎటువంటి వడ్డీ, అసలు చెల్లింపులు లేకపోతే ఎన్పీఏగా పరిగణిస్తున్నామని, దీని నుంచి మధ్య, చిన్న తరహా పరిశ్రమలను మినహాయించలేమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షోభం, విద్యుత్ సంక్షోభం వల్ల ఎంఎస్ఎంఈ రంగం వ్యాపారాన్ని నష్టపోయిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర కంపెనీలకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని ఫ్యాఫ్సీ ఆర్బీఐని కోరింది. దీనిపై గాంధీ స్పందిస్తూ వ్యాపారాలు దెబ్బతినడానికి కారణమైన ప్రభుత్వం నుంచి రాయితీలు కోరడం తప్ప వేరే మార్గం లేదన్నారు. వ్యాపార అవకాశాలుండి, ప్రత్యేక పరిస్థితుల వల్ల దెబ్బతిన్న పరిశ్రమల రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నామని, ఇది కూడా ఆర్థికంగా పటిష్టంగా ఉంటేనే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ‘నో యువర్ కస్టమర్’ అనే అంశంపై ఫ్యాప్సీ నిర్వహించిన సదస్సుకు గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ బాగు కోసం వడ్డీపై రాయితీలను, రుణాలు రీ-షెడ్యూల్ చేస్తే పరిశ్రమలు బాగుంటాయేమో కాని, బ్యాంకులు దివాళా తీయడం తథ్యం అన్నారు. అటు డిపాజిట్‌దారులు, ఇటు రుణాలు ఇచ్చిన వారి ప్రయోజనాలను కాపాడుకంటూ వెళ్లడమే బ్యాంకుల ప్రధాన కర్తవ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కేవైసీ నిబంధనలు అమల్లో ఉన్నాయని, నల్లధనం, హవాల మార్గంలో నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఒకవేళ కేవైసీ నిబంధనలకు కావల్సిన పత్రాలు లేకపోయినా అకౌంట్స్‌ను తెరవడానికి అనుమతిస్తున్నామని, కాని వీటి లావాదేవీలపై పరిమితులుంటాయన్నారు. ఇలా ప్రారంభించిన ఖాతాలు ఒక ఏడాదిలోగా కేవైసీ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
పరిశ్రమకు మరిన్ని రాయితీలు: ఫ్యాప్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతమున్న పారిశ్రామిక, ఐటీ పాలసీలను మరో 5-10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కొనసాగిస్తాయని ఆశిస్తున్నట్టు ఫ్యాప్సీ తెలిపింది. అలాగే తయారీ, మౌలిక రంగానికి మరిన్ని రాయితీలు కల్పించాలని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా, వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్ రెడ్డి కోరారు. సహేతుక ధరలో తగినంత విద్యుత్ సరఫరాకు రెండు రాష్ట్రాలూ హామీ ఇవ్వాలని విన్నవించారు. కొత్త ప్రభుత్వాల ముందు సవాళ్లూ ఉన్నాయని గుర్తు చేశారు. పరిశ్రమను, వాణిజ్యాన్ని వృద్ధి చేసేందుకు ఇరు ప్రభుత్వాలతో కలిసి ఫ్యాప్సీ పనిచేస్తుందని అన్నారు. ఇక మోడీ ప్రభుత్వ పారిశ్రామిక విధానం నిలకడగా, స్వేచ్ఛగా ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్ధీపనంగా పనిచేస్తుందని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. పాలసీలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ప్రధానంగా దీర్ఘకాలంగా నిలిచిపోయిన విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర భారీ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని సూచించారు. -
సీఎస్టీ చార్జీలు భరించాల్సిందే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఐదేళ్ల పాటు కేంద్ర సేవా పన్ను (సీఎస్టీ) చార్జీలను రద్దు చేయాలని కోరిన ఫ్యాప్సీ, రెండు రాష్ట్రాల డీలర్లకు నిరాశే మిగిలింది. జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించినా సరే సీఎస్టీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా తేల్చిచెప్పారు. ఫ్యాప్సీ ఆధ్వర్యంలో గురువారమిక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో సహా) పన్ను చెల్లింపుదారుల గుర్తింపు సంఖ్య (టిన్) నంబర్ 36, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37 టిన్ నంబర్‌ను కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఈ కొత్త టిన్ నంబర్లు జూన్ 2 నుంచి అమలులోకి వస్తాయని, అప్పటివరకు ప్రస్తుతం ఉన్న 28 టిన్ నంబరే ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 11 నంబర్లుండే ఈ టిన్ నంబర్లో మొదటి రెండు నంబర్లు రాష్ట్రం యొక్క కోడ్‌ను సూచిస్తుందన్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం మాత్రమే పదేళ్ల పాటు హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంయుక్త రాజధానిగా ఉంటుందే తప్ప వాణిజ్య పన్నుల చెల్లింపు, ఆదాయం కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం ఉండదని సమారియా వివరించారు. ప్రస్తుతం 2.80 లక్షల మంది డీలర్లు ఉండగా.. ఇందులో కేవలం 85 వేల మంది మాత్రమే కొత్త టిన్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కొత్త టిన్ నంబర్, చిరునామా మార్పు, కొత్త వస్తువుల చేర్పు వంటి ఎలాంటి మార్పులున్నా మే 7వ తేదీ లోపు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేసుకోని డీలర్లకు అప్పటివరకు ఎక్కడి నుంచి అయితే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో ఆ రాష్ట్రం యొక్క కొత్త టిన్ నంబర్‌ను కేటాయిస్తామని సమారియా చెప్పుకొచ్చారు. జూన్ 2 తర్వాత జాయింట్ కమిటీ: జూన్ 2 తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ తలెత్తే వాణిజ్య పన్నుల కేటాయింపు, వివిధ రకాల పన్నుల చెల్లింపు వంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తామని సమారియా హామీ ఇచ్చారు. ఈ కమిటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని నిపుణులైన ఎక్సైజ్, ట్యాక్స్ అధికారులు, ఫ్యాప్సీ, ట్రేడ్ మెంబర్లు మెంబర్లుగా ఉంటారని చెప్పారు. జూన్ 2 తర్వాత వ్యాపారస్తులు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు రెండు రాష్ట్రాల వ్యాపారస్తులు కొత్త టిన్ నంబర్లు ఉపయోగించాలని, అదేవిధంగా జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు చేయదలిచే వ్యాపారులు కొత్తగా సీ ఫామ్‌ను తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుందని సమారియా వివరించారు. రెండు రాష్ట్రాల్లో చేసే వ్యాపార కార్యకలాపాలను బట్టి వేర్వేరుగా పన్నులుంటాయన్నారు. జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అమలులోకి వచ్చే సీఎస్టీ, రవాణా చార్జీలు, వ్యాట్, టోల్గేట్ల వంటి అనేక రకాల పన్నుల భారాన్ని ఇరు రాష్ట్రాల వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతో ప్రధానంగా లిక్కర్, టెక్స్టైల్స్ వంటి వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర, రిటైర్డ్ ఐఏఎస్ అశుతోష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.