మరిన్ని నిధులు కేటాయించాల్సింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశ్రమలకు, ఖనిజ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాల్సిందని ఫ్యాప్సీ అభిప్రాయపడింది. ‘విద్యుత్ రంగానికి స్పల్ప కేటాయింపులు నిరాశ కలిగించాయి. ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుదుత్పాదన లక్ష్యాన్ని ఎలా చేరుకునేది స్పష్టత ఇవ్వలేదు. వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇచ్చారు’ అని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా తెలిపారు.
సబ్సిడీల కింద రావాల్సిన బకాయిలకుగాను రూ.638 కోట్లు కేటాయించడం వల్ల చిన్న కంపెనీలకు ఊరట లభించినట్టు అయిందన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని సీఐఐ తెలంగాణ చైర్‌పర్సన్, ఎలికో ఈడీ వనిత దాట్ల తెలిపారు. దీర్ఘకాలిక దృష్టికోణానికి బడ్జెట్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ సెక్రటరీ గోపాలరావు తెలిపారు. రిసర్చ్, ఇన్నోవేషన్ సర్కి ల్ ఆఫ్ హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తుందని హైసియా ప్రెసిడెంట్ రమేష్ లోగనాథన్ తెలిపారు.స్టార్టప్‌లకు మరిన్ని ప్రోత్సాహకాలిస్తే బాగుండేదని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం అభిప్రాయపడ్డారు.