వారం రోజుల్లో కొత్త టిన్ నంబర్లు! | within one week new tin numbers | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో కొత్త టిన్ నంబర్లు!

Published Wed, Mar 26 2014 2:26 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

within one week new tin numbers

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో సహా) వ్యాపారస్తులకు పన్ను చెల్లింపుదారుల గుర్తింపు సంఖ్య (టిన్) కొత్త నంబర్లను ఇస్తామని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా చెప్పారు. తొలి విడతగా 2 లక్షల మంది డీలర్లకు కొత్త టిన్ నంబర్లను కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేటాయించిన కొత్త టిన్ నంబర్లు జూన్ 2వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఫ్యాప్సీ ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ జరిగిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ- వాణిజ్య పన్నులు’ అనే సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరాలాల్ మాట్లాడుతూ.. ‘మొత్తం 11 నంబర్లుండే టిన్ నంబర్‌లో మొదటి రెండు నంబర్లు రాష్ట్రం యొక్క కోడ్‌ను సూచిస్తుంది. మిగిలిన 9 నంబర్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని డీలర్లకు కేటాయించే టిన్ నంబర్ల విషయంలో.. ఇప్పుడున్న టిన్ నంబర్ల ముందు కొత్తగా కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొదటి రెండు నంబర్లు పెట్టాలా లేక పూర్తిగా 11 నంబర్ల కొత్త టిన్ నంబర్‌ను ఇవ్వాలా అనే విషయంలో కేంద్రానికి లేఖ రాశామని’ ఆయన వివరించారు. వారం రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందని ఆ తర్వాతే కొత్త టిన్ నంబర్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. జూన్ 2 తర్వాత వ్యాపారస్తులు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు రెండు రాష్ట్రాల ప్రత్యేక టిన్ నంబర్లు ఉపయోగించాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లో చేసే వ్యాపార కార్యకలాపాలను బట్టి వేర్వేరుగా పన్నులుంటాయని చెప్పారు. ఆయా పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 53 శాతం తెలంగాణకు, 47 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కేటాయింపులుంటాయని వివరించారు.


 రూ.50 వేల కోట్ల ఆదాయం: గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.50 వేల కోట్లను వసూలు చేసిందని చెప్పారు. దేశంలోనే ఇంత మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించింది మన రాష్ట్రమే అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాణిజ్య పన్నుల బ కాయిలు రూ.12 వేల కోట్లుగా ఉన్నాయని, రీఫండ్ అయితే రూ.5 వేల కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం మాత్రమే పదేళ్ల పాటు హైదరాబాద్ సంయుక్త రాజధానిగా ఉంటుందని వాణిజ్య పన్నులు చెల్లింపు, ఆదాయం కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎలాంటి సంబంధం ఉండదని సమారియా వివరించారు. జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకాలు చేయదలిస్తే సీ ఫామ్‌ను తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా 2 శాతం సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. సీఎస్టీ, వ్యాట్, రవాణా చార్జీలు, టోల్‌గేట్ల అనేక రకాల పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటున్నందున ధరలు కూడా పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement