భారీగా పడిపోతున్న టెకీ నియామకాలు
సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఈ ఏడాది 6,000 ఉద్యోగాలకు కోత పెట్టనుందన్న వార్త టెకీ ప్రపంచంలో ఆందోళన రేకెత్తించింది. అయితే మిగిలిన టెక్నాలజీసంస్థలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని నిపుణులు లు భావిస్తున్నారు. ఒకవైపు ఉన్న ఉద్యోగులకు ఉద్వాసనతో పాటు, కొత్త నియమాకలు కూడా భారీగా పడిపోవడం పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులకు నిదర్శనమంటున్నారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పెరుగుతున్నా గత మూడేళ్లుగా టెకీ నియామకాలు తగ్గుముఖ్యం పట్టాయని స్టాఫింగ్ ఏజెన్సీ టీమ్ లీజ్, సహ-స్థాపకులు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, రీతూపర్ణ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం బాగా ఉందని మరికొన్ని ఐటీ సంస్థలు మధ్య స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన పలికి, ఫ్రెషర్స్‌కు లేటెస్ట్ టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయన్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు కనీసం 40శాతం పడిపోయాయని ఐటి ప్రత్యేక నియామక ఏజెన్సీ హెడ్ హంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ , ఛైర్మన్ క్రిస్ లక్ష్మీకాంత్ తెలిపారు. అయితే ఐటీ, ఐటీయేతర రంగంలో మొత్తం ఉద్యోగాల కల్పనలో 5 శాతం వృద్ధి సాధించినట్టు నాస్స్కాం గతనెలలో చెప్పింది.
అలాగే దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఈ ఏడాది మొదటి తొమ్మిదినెలల కాలంలో కేవలం 5వేల మంది ఉద్యోగులను నియమించుకున్నట్టు థర్డ్క్వార్టర్ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలోఈ సంఖ్య 17 వేలుగా ఉన్నట్టు తెలిపింది.
కాగా డిజిటల్ సర్వీసులవైపు టెక్నాలజీలు వేగంగా మారుతుండటం.. హెచ్1బీ వీసా నిబంధనలు కఠినతరం, రూపాయి మారకపు విలువ పుంజుకోవడం వంటి అంశాలు కంపెనీ పనితీరుపై ప్రభావాన్ని చూపనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. కొత్త డిజిటల్ సర్వీసులోకి మరలే క్రమంలో ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభంతో కంపెనీలు ఉద్యోగులకు గుడ్ బై చెబుతున్న విషయం తెలిసిందే.