ఆటకు ప్రాణం ‘అంకితం’!
మైదానంలో గాయపడి మరణించిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి
క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం
కోల్‌కతా: క్రికెట్ మైదానం మరో కుర్రాడిని బలిగొంది. ఆటను ప్రాణంగా ప్రేమించిన ఒక యువ ఆటగాడు చివరకు ఆ ఆటకే ప్రాణాలు అర్పించాడు. ఈ సారి బలమైన బంతి లేదు... బలహీనమైన హెల్మెట్ లేదు... ‘సబ్‌స్టిట్యూట్’గా వచ్చిన ఒక ప్రతిభావంతుడిని మృత్యువు తీసుకుపోయింది. ఆస్ట్రేలియాలో ఫిల్ హ్యూస్ ఉదంతం మది దాటకముందే భారత్‌లో మరో యువ ఆటగాడు మైదానంలో అసువులు బాసాడు. మూడు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో గాయపడిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి సోమవారం కన్ను మూశాడు. చికిత్స పొందుతూ తీవ్రమైన గుండె నొప్పి రావడంతో అతను మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. 20 ఏళ్ల ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అంకిత్, బెంగాల్ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2014 అండర్-19 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత ప్రాబబుల్స్‌లో కూడా ఉన్న అతను...తాజా సీజన్లో అండర్-23 సీకే నాయుడు ట్రోఫీలో కూడా పాల్గొన్నాడు. ఒకటి, రెండేళ్లలో బెంగాల్ రంజీ జట్టుకు ఎంపిక కాగలడని భావించిన కేసరి, విషాద రీతిలో చిన్న వయసులోనే లోకం వీడాడు.
అసలేం జరిగిందంటే..
బెంగాల్ డివిజన్ 1 నాకౌట్ పోటీల్లో భాగంగా ఈ నెల 17న ఈస్ట్ బెంగాల్, భవానీపూర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈస్ట్ బెంగాల్ తుది జట్టులో కూడా అంకిత్ లేడు. అర్నబ్ నంది స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన అతను...భవానీపూర్ జట్టు ఇన్నింగ్స్ 44వ ఓవర్లో డీప్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ బంతిని గాల్లోకి లేపాడు. అంకిత్‌తో పాటు ఆ బంతిని అందుకునేందుకు బౌలర్ సౌరవ్ మొండల్ కూడా పరుగెత్తుకొచ్చాడు. ఒకరిని గుర్తించని మరొకరు ఒక్కసారిగా ఢీకొన్నారు. పాయింట్ ఫీల్డర్ కథనం ప్రకారం మొండల్ మోకాలు...అంకిత్ తల, మెడ భాగానికి గట్టిగా తగిలింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అంకిత్ ఊపిరి తీసుకోలేకపోగా...అతని నోట్లోంచి రక్తం రావడం మొదలైంది. దాంతో జట్టు సభ్యుడొకరు తన నోటి ద్వారా అతనికి శ్వాస అందించే (సీపీఆర్) ప్రయత్నం చేశాడు. దీంతో స్పృహలోకి వచ్చిన అంకిత్‌ను వెంటనే దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కోలుకున్నట్లు కనిపించినా....
స్థానిక ఆస్పత్రిలో అంకిత్‌కు మూడు రోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఆదివారం కూడా అతని పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)కు సమాచారం అందించారు. సోమవారం దీనిపై స్పెషలిస్ట్‌లతో మాట్లాడాలని కూడా వారు నిర్ణయించారు. అయితే ఒక్కసారిగా ‘కార్డియాక్ అరెస్ట్’తో అంకిత్ సోమవారం తెల్లవారు జామున కన్ను మూశాడు. అయితే వైద్య సేవల్లో నిర్లక్ష్యమే తన కొడుకు ప్రాణం తీసిందని అతని తండ్రి రాజ్‌కుమార్ కేసరి ఆరోపించారు. ‘శుక్రవారం పరీక్షల తర్వాత అంతా బాగుందని డాక్టర్లు చెప్పారు. ఐసీయూనుంచి జనరల్ వార్డుకు మారుస్తామని కూడా చెప్పారు. ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా జ్వరం పెరిగిందని అన్నారు. దాంతో మేం మరో ఆస్పత్రికి మార్పించాం. వారు కూడా చిన్న గాయమేనని, 3-4 రోజుల్లో తగ్గుతుందని చెప్పారు. చికిత్స బాగా జరిగితే నా కొడుకు ప్రాణాలు దక్కేవి’ అని ఆయన ఆవేదనగా చెప్పారు.
క్రికెట్ ప్రపంచం నివాళి
అంకిత్ కేసరి మృతితో అతని సహచరులు, బెంగాల్ క్రికెటర్లంతా విషాదంలో మునిగిపోయారు. సచిన్ టెండూల్కర్ మొదలు మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు అంతా సంతాపం ప్రకటించారు. ‘మైదానంలోని అనూహ్య ఘటన ఒక మంచి కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించింది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ తారలు సంతాపం తెలిపారు.