నాగాలతో కేంద్రం శాంతి ఒప్పందం
1948 నుంచి నాగాలు చేస్తున్న పోరాటానికి తెర పడింది. ఎన్ఎస్సీఎన్ (నేషనలిస్టు సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్) లోని రెండు ప్రధాన వర్గాల్లో అతి బలీయమైన టి. ముయివా వర్గంతో కేంద్రం నాగా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఎస్సీఎన్లోని రెండో వర్గమైన ఖప్లాంగ్ వర్గం మీద ఇటీవలే బర్మాలో భారత సైన్యం దాడి చేసి, ఆ వర్గాన్ని దాదాపుగా నిర్మూలించింది. దాంతో ముయివా వర్గంతో ఒప్పందం సాధ్యమైంది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి రవికుమార్ ఈ మేరకు టి.ముయివాతో ఒప్పంద పత్రాలు పంచుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో చర్చలు మొదలయ్యాయని ఈ సందర్భంగా టి. ముయివా పేర్కొన్నారు. తర్వాత మాజీ ప్రధాని వాజ్పేయి పరిపాలనా దక్షత కూడా కొంతవరకు ఈ చర్చల ప్రక్రియకు మేలు చేసిందన్నారు.
కాగా, పీవీ హయాంలో జరిగిన చర్చల్లో.. ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి, హోం శాఖ మాజీ కార్యదర్శి టి.పద్మనాభయ్య పాల్గొని.. ఈ సమస్య ఓ పరిష్కారానికి వచ్చేందుకు పునాదులు వేశారు. చివరకు ప్రధాని నరేంద్రమోదీ హయాంలో.. ఈ ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దొవాల్ కూడా పాల్గొన్నారు. నాగాలకు, భారతీయులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో ప్రభుత్వం చూపిన చొరవను టి.ముయివా ఈ సందర్భంగా ప్రశంసించారు. 'కుక్ నాలిం' (అంటే గాడ్ బ్లెస్ యు) అంటూ తన ప్రసంగాన్ని ఆయన ముగించారు. తర్వాత నాగా ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీకి తమ సంప్రదాయ జాకెట్ తొడిగి, శాలువ బహూకరించారు.