సెల్..రెవెన్యూ నిల్
అనుమతి లేకుండానే టవర్ల ఏర్పాటు
పట్టించుకోని అధికార యంత్రాంగం
పంచాయతీల ఆదాయానికి గండి
నిధుల కొరతతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. పంచాయతీల పరిధిలోని వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు. పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసే సెల్టవర్ల క్రమబద్దీకరణ, పన్నుల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉన్నా పట్టించుకోకపోతుండడంతో పంచాయతీల ఆదాయానికి గండి పడుతోంది.
కోట: జిల్లాలోని 46 మండలాల పరిధిలో వివిధ కంపెనీలకు సంబంధించి 972 వరకు సెల్‌టవర్లు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు గూడూరు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, కోట, పొదలకూరు వంటి పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్క చోట 5 నుంచి 20 వరకు టవర్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లోనూ అవసరాల మేరకు ఆయా కంపెనీలు టవర్లు ఏర్పాటు చేశాయి. సెల్‌టవర్ ఏర్పాటుకు పంచాయతీల నుంచి రెండువిడతలుగా అనుమతి పొందాలి. ఇందుకు గానూ నిర్ణీత ప్రదేశంలో నేలపై ఏర్పాటు చేస్తే రూ.15వేలు, భవనాలపై ఏర్పాటు చేస్తే రూ.12వేలు వంతున పంచాయతీలకు చెల్లించాలి. ఏటా ఇదే మొత్తాన్ని చెల్లించి అనుమతులను రెన్యువల్ చేయించుకోవాలి. కానీ ఎక్కడా ఇది జరగడం లేదు.
పట్టించుకుంటే ఆదాయమే
పట్టణాల్లో సెల్‌టవర్లకు అనుమతులు పొందుతున్న సెల్‌కంపెనీలు పంచాయతీల్లో తీసుకోవడం లేదు. కోట మేజర్ పంచాయతీ పరిధిలో ఏడు టవర్లు ఉండగా, ఐదేళ్లలో ఒక్క టవర్ నిర్వాహకులు మాత్రమే రెన్యువల్ చేయించుకున్నట్లు సర్పంచ్ రాఘవయ్య తెలిపారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నెలకొని ఉంది. కొన్ని చోట్ల స్థానిక నాయకుల అండదండలతో గ్రామకార్యదర్శులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గూడూరు నియోజకవర్గం పరిధిలో ఏళ్లకు తరబడి అనుమతులు పొందని టవర్ల సంఖ్య అధికంగానే ఉంది. వీటిపై అధికారులు దృష్టి సారిస్తే పంచాయతీలకు లక్షల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
నోటీసులు జారీ చేస్తాం: రమేష్, డీఎల్పీఓ,గూడూరు
గ్రామాల్లో అనుమతులు పొందని సెల్‌టవర్లకు నోటీసులు జారీ చేస్తాం. పంచాయతీల వారీగా పూర్తి సమాచారం సేకరించాలని ఈఓపీఆర్డీ, కార్యదర్శులను ఆదేశించాం. నెల రోజుల్లోగా నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.