చేతికి పెట్టుకుంటే షుగర్ ఎంతుందో చెప్పేస్తుంది!
ఈయనగారి చేతికున్నది వాచీ అనుకుంటున్నారా? కానేకాదు. మధుమేహంతో బాధపడుతున్నవారికి కాసింత ఉపశమనాన్ని ఇచ్చే హైటెక్ గాడ్జెట్. దీన్ని చేతికి బిగించుకుంటే మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సూదులతో గుచ్చుకుని రక్త పరీక్షలు చేసుకునే అవసరాన్ని తప్పించేందుకు డల్లాస్‌లోని టెక్సస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ శాలినీ ప్రసాద్ సిద్ధం చేశారు దీన్ని.
చర్మంపైన స్వేద బిందువుల్లో ఉండే కార్టిసోల్, గ్లూకోజ్, ఇంటర్‌ల్యూకిన్–6 పదార్థాల మోతాదును లెక్కించేందుకు ఇందులో సూక్ష్మమైన సెన్సర్లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను తెలుసుకోవచ్చు. అయితే వారానికి ఒకసారి కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ గాడ్జెట్‌ను మళ్లీమళ్లీ వాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహంతో బాధపడేవారికి దీన్ని చౌకగా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏడాదిలోపు ఇది మార్కెట్లోకి వస్తుందని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్