దురాచారాలు కొనసాగడం దారుణం
తాండూరు, న్యూస్‌లైన్:
హైటెక్ యుగంలో జోగిని వంటి దురాచారాలు కొనసాగడం దారుణం అని ఎస్పీ రాజకుమారి అన్నారు. పెద్దేముల్లో ‘బాలికను జోగిని’గా మార్చినట్లు భావిస్తున్న ఘటనపై సమగ్రంగా విచారణ జరుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఎస్పీ సోమవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న నేడు ఇంకా గ్రామాల్లో జోగిని, బాణామతి, తదితర సాంఘిక దురాచారాలు కొనసాగడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఆదివారం పెద్దేముల్లో 12 ఏళ్ల బాలికను 60 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబీకుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
స్థానిక పోలీసులకు ఈ విషయమై సమాచారం అందగానే సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారన్నారు. స్థానిక వీఆర్వో ద్వారా ‘జోగిని’ఘటనపై వివరాలు సేకరించి విచారణ జరుపుతామన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో త్వరలో గ్రామాల్లో దురాచారాల నివారణకు కళాబృందాల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారు. తాండూరు పట్టణంలో ఆదివారం దంత వైద్యం కోసం వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు శెట్టి బస్వరాజ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వైద్యుడిపై అదనంగా నిర్భయ చట్టంతో పాటు 323 సెక్షన్‌ను జతచేస్తామని ఎస్పీ చెప్పారు. వారం, పది రోజుల్లో జిల్లాలో ఎస్ఐల బదిలీలు ఉంటాయన్నారు. బాలికలకు సంబంధించిన ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకే విలేకరులు వార్తలు రాయాలని, ఊహజనిత కథనాలు రాస్తే సంబంధీకులపై కేసు నమోదు చేసేందుకు చట్టాలు ఉన్నాయని ఎస్పీ రాజకుమారి తెలిపారు.
పాస్టర్ హంతకులను గుర్తించాం..
వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు హత్య కేసులో నిందితులతోపాటు ఘటనకు సంబంధించిన సూత్రదారులను గుర్తించామని ఎస్పీ రాజకుమారి చెప్పారు. త్వరలోనే నిందితుల్ని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తామన్నారు. యాలాలలోని జిన్నింగ్ ఫ్యాక్టరీలో రైతులకు నకిలీ నోట్ల పంపిణీ వ్యవహారంపై విచారణ జరపాలని తాండూ రు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్‌ను ఎస్పీ ఆదేశించారు. ఫ్యాక్టరీ సంబంధీకుల ఇళ్లలో సోదాలు జరపాలని చెప్పారు.