ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు..
లండన్: న్యూజిలాండ్ కుర్రాడు గ్లెన్ ఫిలిప్స్ ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఫిలిప్స్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు సంధించాడు.
ఇటీవల అరుండెల్లో డూక్ ఆఫ్ నార్ఫోక్ లెవెన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ తరపున ఆడిన ఫిలిప్స్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఫిలిప్స్ డబుల్ సెంచరీ చేశాడు. బ్యాట్స్‌మెన్ ఎలైట్ జాబితాలో అతనికి చోటు దక్కింది.
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు. 2007 వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్లీ గిబ్స్.. నెదర్లాండ్స్‌పై ఈ ఫీట్ నమోదు చేశాడు. అదే ఏడాది జరిగిన టి-20 ప్రపంచ కప్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే కౌంటీ క్రికెట్లో వెస్టిండీస్ గ్రేట్ గార్ఫీల్డ్ సోబర్స్, రంజీల్లో భారత దిగ్గజం రవిశాస్త్రి ఈ ఘనత సాధించారు.