HIV report
-
ఎయిడ్స్ ఉందని తప్పుడు రిపోర్ట్
అన్నానగర్: ఎయిడ్స్‌పై తప్పుడు సమాచారం ఇచ్చిన ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రికి బుధవారం నామక్కల్ వినియోగదారుల కోర్టు రూ.5 లక్షలు జరిమానా విధించింది. కోయంబత్తూరులోని బీలమెట్‌కు చెందిన కృష్ణస్వామి (71) 2017 డిసెంబర్లో పరీక్షల నిమిత్తం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రికి వెళ్లాడు. కళ్లను పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. అంతకు ముందు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. పరీక్షలు ముగియగా అతనికి ఎయిడ్స్ ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. దీంతో షాక్‌కు గురైన కృష్ణస్వామిని కోయంబత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రితో పాటు మరో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయగా అతనికి ఎయిడ్స్ లేదని వైద్య నివేదికలో తేలింది. దీంతో ఆగ్రహించిన కృష్ణస్వామి కోయంబత్తూరు వినియోగదారుల కోర్టులో ప్రైవేటు కంటి ఆసుపత్రిపై కేసు వేశారు. 2022 జులైలో సత్వర విచారణ కోసం కేసు నామక్కల్ జిల్లా వినియోగదారుల కోర్టుకు బదిలీ చేశారు. బుధవారం కేసును విచారించిన న్యాయమూర్తి డాక్టర్ రామరాజు మాట్లాడుతూ.. ప్రైవేటు కంటి ఆసుపత్రి నిర్లక్ష్యంగా సేవలందించినందున ఫిర్యాదుదారునికి నాలుగు వారాల్లోగా రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
హెచ్ఐవీ లేకున్నా ఉన్నట్లు రిపోర్టు
సాక్షి, రాజమండ్రి : ఓ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఓ గర్భిణీ మహిళకు హెచ్ఐవీ లేకున్నా ఉందంటూ వైద్యులు రిపోర్టు ఇచ్చారు. ఊహించని రిపోర్టు రావడంతో బాధిత కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఐతే వైద్యుల రిపోర్టుపై నమ్మకం లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లో మరోసారి పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో మహిళకు హెచ్ఐవీ లేనట్లు తేలింది. దీంతో ఊపిరి పీల్చుకున్న మహిళ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ బాధిత కుటుంబం ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగింది. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఇలా ఎంతమందికి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారో అంటూ ఆసుపత్రి వర్గాలపై మండిపడుతున్నారు. కాగా ఘటనతో రోగులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనకు గురైతున్నారు. -
హెచ్ఐవీ సోకిందని తప్పుడు నివేదిక
చండూరు: హెచ్ఐవీ సోకిందని ఆస్పత్రిలో రిపోర్ట్ ఇవ్వడంతో ఆ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. రైలు కింద పడి ప్రాణాలు తీసుకునేందుకు వెళ్లగా, బంధువుల కౌన్సెలింగ్‌తో నిర్ణయం మార్చుకున్నారు. మరో ఆస్పత్రిలో పరీక్ష చేయించగా.. అక్కడ హెచ్ఐవీ లేదని వైద్యులు నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వైద్య సిబ్బందిపై చర్య తీసుకోవాలని కోరుతూ బుధవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు చండూరు మండల కేంద్రంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటున్నారు. కాగా, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి భార్య గర్భం దాల్చింది. ఈ నెల 1న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుంది. హెచ్ఐవీ సోకిందని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చూపించుకోవాలని అక్కడికి రెఫర్ చేశారు. దీంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అదే రోజు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లా రు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వారి బందువు పలుమార్లు ఫోన్ చేసి అది తప్పుడు రిపోర్ట్ అంటూ కౌన్సెలింగ్ ఇచ్చాడు. దీంతో వారు నిర్ణయం మార్చుకుని జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ పరీక్షలు చేయించుకోగా, హెచ్ఐవీ లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. వైద్యురాలితో వాగ్వాదం బాధితులు విషయాన్ని వివిధ పార్టీల నాయకులకు వివరించారు. బుధవారం వారితో వెళ్లి పీహెచ్సీ వైద్యురాలిని నిలదీశారు. సిబ్బంది తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని, తన తప్పేమీ లేదని పీహెచ్సీ వైద్యురాలు స్వర్ణలత వివరణ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.