అన్నానగర్: ఎయిడ్స్‌పై తప్పుడు సమాచారం ఇచ్చిన ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రికి బుధవారం నామక్కల్ వినియోగదారుల కోర్టు రూ.5 లక్షలు జరిమానా విధించింది. కోయంబత్తూరులోని బీలమెట్‌కు చెందిన కృష్ణస్వామి (71) 2017 డిసెంబర్‌లో పరీక్షల నిమిత్తం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రికి వెళ్లాడు. కళ్లను పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు.
అంతకు ముందు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. పరీక్షలు ముగియగా అతనికి ఎయిడ్స్ ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. దీంతో షాక్‌కు గురైన కృష్ణస్వామిని కోయంబత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రితో పాటు మరో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయగా అతనికి ఎయిడ్స్ లేదని వైద్య నివేదికలో తేలింది.
దీంతో ఆగ్రహించిన కృష్ణస్వామి కోయంబత్తూరు వినియోగదారుల కోర్టులో ప్రైవేటు కంటి ఆసుపత్రిపై కేసు వేశారు. 2022 జులైలో సత్వర విచారణ కోసం కేసు నామక్కల్ జిల్లా వినియోగదారుల కోర్టుకు బదిలీ చేశారు. బుధవారం కేసును విచారించిన న్యాయమూర్తి డాక్టర్ రామరాజు మాట్లాడుతూ.. ప్రైవేటు కంటి ఆసుపత్రి నిర్లక్ష్యంగా సేవలందించినందున ఫిర్యాదుదారునికి నాలుగు వారాల్లోగా రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment