హెచ్ఐవీని నయం చేసే మెడిసిన్ వస్తోంది..!
హెచ్ఐవీ బాధితులకు శుభవార్త. ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు త్వరలో మందులు వచ్చే అవకాశాలున్నాయి. హెచ్ఐవీ వైరస్ పరిశోధనలో చైనా శాస్త్రవేత్తలు కీలకమైన పురోగతి సాధించారు. హెచ్ఐవీ బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి లేదా వ్యాధిని నయం చేయడానికి కొత్త ఔషధ ప్రయోగాలను అభివృద్దిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ఐవీ వైరస్ వ్యాప్తి సంబంధిత నిర్మాణాత్మకమైన విశ్లేషణలో పురోగతి కనబరిచినట్టు తెలిపారు. దీనిసాయంతో వ్యాధిని అరికట్టడం లేదా దీని ప్రభావం చాలా వరకు తగ్గించవచ్చని చైనాకు చెందిన ఓ వార్త సంస్థ వెల్లడించింది.
పరిశోధనకు సంబంధించిన వ్యాసాన్ని సైన్స్ జర్నల్ వెబ్సైట్లో ప్రచురించారు. పరిశోధకుల బృందానికి ప్రొఫెసర్ హాంగ్ ఝీవీ నేతృత్వం వహిస్తున్నారు. హార్బిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్స్, టెక్నాలజీలో నిర్మాణత్మక అణుజన్యు జీవశాస్త్ర విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. 2012 మార్చిలో చైనా శాస్త్రవేత్తలు పరిశోధనకు శ్రీకారం చుట్టారు. 'ఎయిడ్స్ చికిత్సకు డ్రగ్ ఉత్పత్తిదారులు కొత్త రకమైన మందులు తయారు చేయడానికి పరిశోధక బృందం సహకరిస్తోంది. మెడిసిన్ తయారయ్యాక ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ చికిత్సలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. పూర్తిగా నయం కూడా చేస్తుందని ఆశిస్తున్నా' అని హాంగ్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 3.5 కోట్లమంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులున్నారు.