HIV/AIDS
-
2030నాటికి సున్నా శాతానికి ఎయిడ్స్ వ్యాప్తి
సాక్షి, అమరావతి: ఎయిడ్స్ వ్యాప్తిని 2030 నాటికి సున్నా శాతానికి తగ్గించటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీశాక్స్) పీడీ డాక్టర్ ఎ. సిరి తెలిపారు. హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా శాక్స్ ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం 5కె రన్‌ను సిరి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపవద్దని కోరారు. ప్రస్తుతం 10 వేల మందికి పైగా బాధితులున్నారని తెలిపారు. 5కె రన్‌ల్లో విజేతలకు నగదు బహుమతిగా చెక్కులు, మెడల్స్, సరి్టఫికెట్లు అందజేశారు. -
ఈనెల 30న విజయవాడలో రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్ట్ మారథాన్
సాక్షి, అమరావతి: హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు ఈనెల 30న విజయవాడలో రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్ట్ 5కె మారథాన్ (రెడ్ రన్)ను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎపిశాక్స్) అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కోటేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిశాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎస్బీ రాజేంద్రకుమార్ (ఐఆర్‌యస్) నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 30న ఐక్యత మరియు దృఢ సంకల్పం యొక్క ఉల్లాసకరమైన ప్రదర్శనలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆలోచనగా యూత్ ఫెస్ట్ గ్రాండ్ ఫినాలేను నిర్వహించేందుకు విజయవాడ నగరం సిద్ధమవుతోందని ఆమె అన్నారు. ఈ ఈవెంట్ యువత ఆరోగ్యం మరియు అవగాహన దిశగా అద్భుతమైన వేడుకగా నిర్వహించనున్నట్లు డాక్టర్ కోటేశ్వరి తెలిపారు. నేకో(NACO) దూరదృష్టితో కూడిన నాయకత్వంలో కీలకమైన సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు ఒక వినూత్నమైన కార్యక్రమంగా దీన్ని రూపొందించామని అన్నారు. హెచ్ఐవి నివారణ, మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నియంత్రించడం, యువతలో సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన లైంగిక ప్రవర్తనను ప్రోత్సహించడం, హెచ్ఐవి మరియు ఎస్టిఐ సంబంధిత సేవల్ని ప్రోత్సహించడం , ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం వంటి నిర్ధేశించిన లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు డాక్టర్ కోటేశ్వరి తెలిపారు. 26 జిల్లాల నుండి వచ్చిన 17-25 సంవత్సరాల వయస్సు గల 260 ఔత్సాహిక కళాశాల విద్యార్థులు 5K మారథాన్‌లో పాల్గొంటారన్నారు. ఇది ఆరోగ్యకరమైన, మరింత అవగాహన గల భవిష్యత్తు కోసం వారి నిబద్ధతను సూచిస్తుందన్నారు. కళాశాల విద్యార్థులు మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ సభ్యులతో సహా ప్రతి జిల్లా నుంచి పది మంది దీనిలో పాల్గొంటారన్నారు. హెచ్ఐవికి సంబంధించిన మరింత సమాచారం కోసం www.apsacs.ap.gov.in సంప్రదించాలని ఆమె కోరారు. -
ఎయిడ్స్ భూతాన్ని వదిలేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ ప్రక్రియ అటకెక్కింది. వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా చేయా ల్సిన నిర్ధారణ పరీక్షలు, స్క్రీనింగ్ పరీక్షలను అడపాదడపా చేస్తూ చేతులు దులుపుకుంటోంది. శస్త్రచికిత్సల సమయంలో చేసే నిర్ధారణ పరీక్షలు మినహా ప్రత్యేక క్యాంపులతో బాధితుల గుర్తింపు కార్యక్రమాలకు వైద్య,ఆరోగ్య శాఖ దాదాపు మంగళం పాడింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేపడుతున్న నిర్ధారణ పరీక్షల్లో బాధితులను గుర్తించి ప్రభుత్వ కేంద్రాలకు సమాచారం ఇస్తున్నప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 1,55,882 మంది ఎయిడ్స్ బాధితులున్నారు. వీరికి క్రమం తప్పకుండా మందులు పంపిణీ చేస్తూ... అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యపర్చాలి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించిన ఎయిడ్స్ రోగులకు కనీసం మందులు సైతంపంపిణీ చేయలేదు. ఇప్పటివరకు కేవలం 87,217 బాధితులకు మందులు పంపిణీ చేస్తుండగా... మిగతా 68665 మంది జాడ గుర్తించలేకపోవడం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కొత్త కేసుల గుర్తింపు... ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 1272 ఎయిడ్స్ బాధితులను వైద్యులు గుర్తించారు. వీరంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేపట్టిన నిర్ధారణ పరీక్షల్లో వెలుగులోకి వచి్చన వారే. వీరిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 165, రంగారెడ్డి జిల్లాలో 79, నల్లగొండలో 69 చొప్పున నమోదయ్యాయి. శస్త్రచికిత్సల సమయంలో నిర్వహించే పరీక్షల్లోనే ఇంత పెద్ద మొత్తంలో బాధితులు గుర్తించడం కాస్త ఆందోళన కలిగించే విషయమే. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్లస్టర్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఐసీటీసీ(ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్)లున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 187 ఐసీటీసీ, 865 ఎఫ్‌ఐసీటీసీ కేంద్రాలున్నాయి. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి బాధితులను గుర్తించి వారికి అవగాహన కల్పించడం, మందులు పంపిణీ చేయడం ఈ సెంటర్ల ముఖ్య ఉద్దేశం. కానీ ఈ కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ కేంద్రాల్లో ఈ ఏడాది గుర్తించిన బాధితుల సంఖ్య అధికారులు వెల్లడించడం లేదు. ప్రైవేటు కేంద్రాల్లో నమోదవుతున్న బాధితులు ప్రభుత్వ కేంద్రాల్లో మందులు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈక్రమంలో బాధితులు ఎలాంటి మందులు వినియోగించకపోవడం ఆందోళన కలింగించే విషయం. -
దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్
లండన్/ జొహన్నెస్‌బర్గ్: అబ్బో... ఎన్నో వేరియెంట్లను చూసేశాం. అలసిపోయాం... ఇక కరోనాతో సహజీవనం మనకు అలవాటైపోయిందని ఒక రకమైన నిశ్చింతకు వచ్చాం. ఇంతలోనే దక్షిణాఫ్రికా మరో బాంబు పేల్చింది. ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన వేరియెంట్ వెలుగుచూసిందని, పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) ఇది కనపడుతోందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ వైరాలజిస్టు డాక్టర్ టామ్ పీకాక్ వెల్లడించారు. మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని ఏమార్చగలదని, మరింత వేగంగా వ్యాప్తిచెందగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, బోట్స్వనాల్లో ఈ రకానికి చెందిన 100 కేసులను గుర్తించినట్లు తెలిపారు. బి.1.1.529 ఎంతటి ప్రమాదకరం, దీని మూలంగా ఎదురయ్యే విపరిణామాలు ఎలా ఉండనున్నాయనేది అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్తలు గురువారం సమావేశమయ్యారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, హెచ్ఐవీ/ ఎయిడ్స్ సోకి చికిత్స పొందని వ్యక్తి శరీరంలో ఈ మ్యూటెంట్ అభివృద్ధి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏమేరకు వేగంగా వ్యాప్తి చెందగలదు, ఎంతటి హానికరమనేది ప్రస్తుత దశలో ఏమీ చెప్పలేమని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. తమ శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తూ.. దీని పరిణామక్రమాన్ని నిశితంగా గమనిస్తున్నారని పేర్కొంది. హాంగ్‌కాంగ్‌లోనూ ఈ వేరియెంట్ కేసులు బయటపడ్డాయి. ► దీంట్లో ఏకంగా 32 మ్యూటేషన్లు ఉన్నాయి. ► కె417ఎన్– కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను ఏమార్చగలదు ► ఈ484ఏ– యాంటీబాడీలకు చిక్కదు ► ఎన్440కే– యాంటీబాడీలను బొల్తా కొట్టించగలదు ► ఎన్501వై.. వైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తుంది. ► ఈ వైరస్ కొమ్ముల్లో మరే దాంట్లోనూ లేనన్ని మ్యూటేషన్లు ఉన్నాయి. ► ప్రస్తుత వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు ఇప్పటిదాకా వ్యాప్తిలో ఉన్న వేరియెంట్లనే (వైరస్‌పై ఉండే కొమ్ములనే) గుర్తుపట్టగలవు ► కాబట్టి ఇది తేలిగ్గా యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగలదు. అక్కడి నుంచి వచ్చేవారితో జాగ్రత్త కొత్త వేరియెంట్ అనవాళ్లు బయటపడ్డ దక్షిణాఫ్రికా, బోట్వ్సానా, హాంగ్‌కాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షించాలని, టెస్టులు ముమ్మరం చేయాలని భారత ప్రభుత్వం గురువారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రదేశాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ దేశాల మీదుగా (వయా) వస్తున్న వారినీ కఠిన పరీక్షల తర్వాతే అనుమతించాలని సూచించింది. అందరి శాంపిల్స్ తీసుకొని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌లకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు. -
'వృద్ధులు, యువతలో ఎయిడ్స్ మరింత ప్రబలుతోంది'
బీజింగ్: గతేడాది చైనాలో లక్షకుపైగా ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ ప్రణాళిక కమిషన్ వైస్ చైర్మన్ శుక్రవారం వెల్లడించారు. గతేడాది నమోదైన ఎయిడ్స్ కేసుల కంటే 14.8 శాతం అధికంగా ఈ ఏడాది నమోదయ్యాయని తెలిపారు. అదే అంతకుమందు ఏడాది 2013తో పోలిస్తే 21.2 శాతం అధికమని పేర్కొన్నారు. గతేడాది దాదాపు 85 వేల మంది ఎయిడ్స్ పేషంట్లకు యాంటీ వైరల్ ట్రీట్మెంట్ అందించినట్లు చెప్పారు. దేశంలో ఎయిడ్స్ వ్యాధి విస్తరణ ప్రధానంగా లైంగిక చర్యల ద్వారానే అధికమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించడం కూడా చాలా తక్కువగానే ఉందని తెలిపారు. దేశంలోని వృద్ధుల్లో, యువతలో ఎయిడ్స్ వ్యాధి తీవ్రంగా ప్రబలుతుందని అధికారులు గుర్తించారన్నారు. ఎయిడ్స్ వ్యాధి విస్తరణను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని బ్లడ్ బ్యాంక్ కేంద్రాలకు సూచించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నివారించేందకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.