'వృద్ధులు, యువతలో ఎయిడ్స్ మరింత ప్రబలుతోంది'
బీజింగ్: గతేడాది చైనాలో లక్షకుపైగా ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ ప్రణాళిక కమిషన్ వైస్ చైర్మన్ శుక్రవారం వెల్లడించారు. గతేడాది నమోదైన ఎయిడ్స్ కేసుల కంటే 14.8 శాతం అధికంగా ఈ ఏడాది నమోదయ్యాయని తెలిపారు. అదే అంతకుమందు ఏడాది 2013తో పోలిస్తే 21.2 శాతం అధికమని పేర్కొన్నారు. గతేడాది దాదాపు 85 వేల మంది ఎయిడ్స్ పేషంట్లకు యాంటీ వైరల్ ట్రీట్మెంట్ అందించినట్లు చెప్పారు.
దేశంలో ఎయిడ్స్ వ్యాధి విస్తరణ ప్రధానంగా లైంగిక చర్యల ద్వారానే అధికమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించడం కూడా చాలా తక్కువగానే ఉందని తెలిపారు. దేశంలోని వృద్ధుల్లో, యువతలో ఎయిడ్స్ వ్యాధి తీవ్రంగా ప్రబలుతుందని అధికారులు గుర్తించారన్నారు. ఎయిడ్స్ వ్యాధి విస్తరణను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని బ్లడ్ బ్యాంక్ కేంద్రాలకు సూచించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నివారించేందకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.