అడవిలో కెమెరాలు వదిలిపెట్టి దౌడో దౌడు..
ఆఫ్రికా: ఈ మధ్య అటవీ జంతువులకు మనుషులంటే తెగ కోపమొచ్చేస్తుంది. సరదాగా వాటిని చూసేందుకు వెళ్లినా.. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించినా వెంటపడి తరుముతున్నాయి. కార్లలో కూర్చున్నప్పటికీ గుండెలు జారీపోయేంత పనిచేస్తున్నాయి. దురదృష్టంకొద్ది కారు ఆగిందో ప్రాణాలుపోవడం తప్పని పరిస్థితి ఎదురవుతుంది. మొన్న ప్రముఖ హాలీవుడ్ నటుడికి గుండెల్లో రైల్లు పరుగెత్తించినట్లుగానే రెండు ఖడ్గమృగాలు ఇద్దరు దంపతులకు చుక్కలు చూపించాయి. బ్రతికితే చాలు అన్నంత వేగంగా ఆ ఇద్దరు, మరికొందరు కార్లలో దౌడు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అది ఆఫ్రికాలోని హుహువి పార్క్.
ఇద్దరు దంపతులు సఫారీకి వెళ్లారు. ఆ ఓపెన్ వన్యప్రాణి క్షేత్రంలో రెండు కెమెరాలతో కనిపించిన ప్రతి జంతువును ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో దుమ్ముకొట్లాడే రోడ్డులో ఓ రెండు ఖడ్గమృగాలు బలంగా కొట్టుకుంటున్నాయి. యుద్ధాన్ని తలపించే రీతిలో వాటి బలమైన పదునైన కొమ్ములతో పోట్లాడుకుంటున్నాయి.
ఆ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరు తమ కార్లలో ఉండి కెమెరాల్లో బందిస్తుండగా.. ఓ దంపతులు మాత్రం ఉత్సాహంతో వాటికి సమీపంగా వెళ్లారు. ఆ సమమంలో హాలీవుడ్ సినిమాలో చూపించినట్లుగా పోట్లాటను ఆపేసిన ఖడ్గమృగాలు.. ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారుకొని స్లోమోషన్లో తలలు ఎత్తి ఏదో మాట్లాడుకున్నట్లుగా తలలు ఊపి వెంటనే ఆ దంపతులవైపు వేగంగా వచ్చాయి. వాటి వేగాన్ని చూసిన ఆ ఇద్దరు కార్లో దూరి దౌడోదౌడు అంటూ పారిపోయారు. ఆ కారును వెంబడించిన తీరు చూస్తే ఒళ్లుగగుర్పొడవాల్సిందే.