వ్యవసాయం.. పారిశ్రామికం రెండు కళ్లు
► నోట్ల రద్దుతో నల్లధనం వెలుగులోకి వచ్చింది
► భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆన్లైన్లోనే
► కేంద్ర మంత్రి వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పట్టణాల్లో పారిశ్రామిక రంగం దేశానికి రెండు కళ్లు లాంటివని, ఇవి సమానంగా అభివృద్ధి చెందినప్పుడే దేశ పురోగతి వేగం పుంజుకుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పా రు. శనివారం నగరంలో జరిగిన హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్స్‌లెన్స్–2017 అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు.
పారిశ్రామిక, వ్యాపారవేత్తలను శత్రువులుగా భావించటం సరైందికాదని, దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు. నీతిగా, నిజాయితీగా వ్యాపారాలు చేసినపుడే దేశ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేస్తూ, పన్నులను చెల్లించినప్పుడు ఎటువంటి సమస్యలూ ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని వెలుగులోకి తెచ్చిందన్నారు. ప్రధాని దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించినప్పుడు అనేకమంది విమర్శలు చేశారని, వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పుడు అందరికీ తెలిసిందన్నారు.
స్వయంకృషితో ఉన్నత శిఖరాలు...
మీడియా సంచలనాలకు దూరంగా, సత్యానికి దగ్గరగా ఉండాలని, కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం పారిశ్రామిక వృద్ధిలో యువతరం పాత్ర కీలకంగా మారిందని, స్వయంకృషితో పాటుపడితే ఏ స్థాయికైనా ఎదగవచ్చని ప్రధాని మోదీ రుజువు చేశారని అన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ అనుమతులన్నీ ఆన్లైన్లోనే ప్రవేశపెట్టబోతున్నామని, తద్వారా అవినీతిని అరికట్టడంతో పాటు పారదర్శకంగా ప్రజలకు త్వరితగతిన సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు, అమర్‌రాజా గ్రూప్ అధినేత గల్లా రామచంద్రనాయుడుకు జీవిత సాఫల్య అవార్డులు అందించారు. వీటితోపాటు 13 కేటగిరీల్లో 25 అవార్డులను వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తలకు ప్రదా నం చేశారు. కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ న్ వామన్‌రావు, బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావుతో పాటు నాగార్జున కన్స్ట్రక్షన్ వ్య వస్థాపకులు ఏవీఎస్ రాజు, పోకర్న గ్రానైట్స్ వ్యవస్థాపకుడు గౌతమ్‌చంద్ జైన్, కంట్రోల్ ఎస్ ఫౌండర్ శ్రీధర్‌రెడ్డి , కిమ్స్ హాస్పిటల్స్ డైరెక్టర్ భాస్కర్‌రావు పాల్గొన్నారు.
వాణిజ్య కార్మికులది కీలక పాత్ర...
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... వాణిజ్య రంగం దేశాభివృద్ధిలో కీలకమన్నారు. ఒకప్పుడు వ్యాపారస్తులంటే దోచుకునేవారనే అపవాదు ఉండేదని, కానీ మోదీ ప్రధాని అయ్యాక దేశాభివృద్ధిలో వ్యాపారస్తులు కీలకమని భావించి, వారి కోసం మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. వ్యాపార రంగంలో కార్మికులది కీలక పాత్రని, వ్యాపారం అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యాపారులు సమాజ హితం కోసం పాటుపడాలన్నారు.