hockey games
-
బంతిని తాకొద్దు... కలిసి సంబరాలు చేసుకోవద్దు
న్యూఢిల్లీ: ఇకపై హాకీ మ్యాచ్‌ల్లో గోల్ కాగానే సహచరులంతా భుజాలపై చేతులేసి చేసుకునే సంబరాలు ఇకపై కనిపించవు. బంతిని పొరపాటున కూడా ముట్టుకోరు. ప్రపంచమే కాదు క్రీడా ప్రపంచం కూడా ‘కరోనాకు ముందు.... కరోనా తర్వాత’ దశలోకి మారుతోంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా 12 మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని దేశాలు ఇకపై ఎఫ్ఐహెచ్ నిబంధనలతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. కరోనా లక్షణాలున్న వారు శిక్షణకు, ఆటకు దూరంగా ఉండాలి. శిక్షణ కోసం ఎవరికి వారు వ్యక్తిగత వాహనాల్లో రావాల్సిందే. సమూహంగా బస్‌లో రావొద్దు. స్క్రీనింగ్ తదితర పరీక్షల కోసం నిర్ణీత సమయానికి ముందే రావాలి. ఒకటిన్నర మీటర్ భౌతిక దూరం తప్పనిసరి. చేతులతో బంతిని ముట్టుకోకూడదు. సహచరులు కలిసి సంబరాలు చేసుకోరాదు. ఎవరి నీళ్ల సీసాలు, ఎనర్జీ డ్రింక్ సీసాలు వారే వాడాలి. ఎవరి క్రీడా సామగ్రి వారే వాడాలి. ఇతరులు వాడినవి ఎట్టిపరిస్థితుల్లో ఇంకొకరు వాడరాదు. శిబిరాలు ముగిశాక నేరుగా ఇంటికే వెళ్లాలి. అలాగే ఎఫ్ఐహెచ్ దశలవారీ ట్రెయినింగ్‌ను సూచించింది. ఒకటో దశలో వ్యక్తిగత శిక్షణ. రెండో దశలో చిన్న చిన్న గ్రూపుల శిక్షణ, మూడో దశలో పోటీ శిక్షణ, ఆఖరి దశలో టీమ్ మొత్తానికి శిక్షణ ఏర్పాటు చేయాలని సూచించింది. -
2 నుంచి రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
ధర్మవరం టౌన్ : ధర్మవరంలోని ధర్మాంబ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ డైమండ్ ఓపెన్ హాకీ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మాంబ హాకీ అసోసియేషన్ ప్రతినిధులు పల్లెం వేణుగోపాల్, బండి వేణుగోపాల్, బంధనాథం సూర్యప్రకాష్, వడ్డె బాలాజీ, ఉడుముల రాము, అశ్వర్థనారాయణ, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో 12 జట్లు పాల్గొంటాయన్నారు. గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి కింద రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి రూ.5 వేలు చొప్పున బహుమతులు అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో హాకీ కోచ్ హుసేన్, సీనియర్ క్రీడాకారులు ఉడుముల కిరణ్, జిన్నే చంద్ర, మధు పాల్గొన్నారు.