న్యూఢిల్లీ: ఇకపై హాకీ మ్యాచ్‌ల్లో గోల్ కాగానే సహచరులంతా భుజాలపై చేతులేసి చేసుకునే సంబరాలు ఇకపై కనిపించవు. బంతిని పొరపాటున కూడా ముట్టుకోరు. ప్రపంచమే కాదు క్రీడా ప్రపంచం కూడా ‘కరోనాకు ముందు.... కరోనా తర్వాత’ దశలోకి మారుతోంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా 12 మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని దేశాలు ఇకపై ఎఫ్‌ఐహెచ్ నిబంధనలతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. కరోనా లక్షణాలున్న వారు శిక్షణకు, ఆటకు దూరంగా ఉండాలి.
శిక్షణ కోసం ఎవరికి వారు వ్యక్తిగత వాహనాల్లో రావాల్సిందే. సమూహంగా బస్‌లో రావొద్దు. స్క్రీనింగ్ తదితర పరీక్షల కోసం నిర్ణీత సమయానికి ముందే రావాలి. ఒకటిన్నర మీటర్ భౌతిక దూరం తప్పనిసరి. చేతులతో బంతిని ముట్టుకోకూడదు. సహచరులు కలిసి సంబరాలు చేసుకోరాదు. ఎవరి నీళ్ల సీసాలు, ఎనర్జీ డ్రింక్ సీసాలు వారే వాడాలి. ఎవరి క్రీడా సామగ్రి వారే వాడాలి. ఇతరులు వాడినవి ఎట్టిపరిస్థితుల్లో ఇంకొకరు వాడరాదు. శిబిరాలు ముగిశాక నేరుగా ఇంటికే వెళ్లాలి. అలాగే ఎఫ్‌ఐహెచ్ దశలవారీ ట్రెయినింగ్‌ను సూచించింది. ఒకటో దశలో వ్యక్తిగత శిక్షణ. రెండో దశలో చిన్న చిన్న గ్రూపుల శిక్షణ, మూడో దశలో పోటీ శిక్షణ, ఆఖరి దశలో టీమ్ మొత్తానికి శిక్షణ ఏర్పాటు చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment