hoda issue
-
హోదా కోసం న్యాయవాదుల విధుల బహిష్కరణ
కాకినాడ లీగల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు. రాష్ట్ర న్యాయవాద జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, పిఠాపురం, తుని తదితర కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు రాజేష్ ఆధ్వర్యాన న్యాయవాదులు విధులు బహిష్కరించి, బార్ అసోసియేషన్ కార్యాలయం నుంచి జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనకు అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి రావాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు జవహర్ ఆలీ, మోహన్ మురళీ, అయ్యంగార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీకీ కాంగ్రెస్ గతే..
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని చెప్పిన బీజేపీకి పడుతుందని రాష్ట్ర టీడీపీ ప్రధానకార్యదర్శి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో కమలనాథులు సీమాంధ్రుల ప్రయోజనాలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని రాజ్యసభలో అన్నారని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం ఇస్తామన్న ప్రత్యేకప్యాకేజీలు, జాతీయప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్రంలో ఉన్న రెండు పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి దగా చేసిన ‘దేశం, బీజేపీ’
ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారు? మండిపడ్డ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వరని పార్లమెంట్ సాక్షిగా మరోసారి పరోక్షంగా తేలిపోయిందని ౖవైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు తెలుగు ప్రజలను మరోసారి మోసం చేశాయని ఆయన మండిపడ్డారు. శుక్రవారం రాత్రి ఆయన కాకినాడలో విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పదేళ్ళు ప్రత్యేక హోదా కావాలని ఒకరు, చాలదు 15 ఏళ్ళు కావాలని మరొకరు ప్రజల ముందు మొసలికన్నీరుకార్చి ఇప్పుడు దాటవేత వైఖరి అవలంబిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పరోక్షంగా ప్రత్యేక హోదా ఇవ్వరని దాదాపు తేలిపోయిందన్నారు. హోదా అవసరంలేదని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక నిధులు, గ్రాంట్లతో ఆదుకుంటామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతుండగా, కేంద్రం సహకరించడంలేదంటూ చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, తిరిగి వీరిద్దరూ కలిసి ప్రభుత్వాలను నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలా ఎవరిని మోసం చేసేందుకు ప్రకటనలు చేస్తున్నారో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారన్నారు. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు ఆర్థికపరమైన చేయూత కూడా ఎంతో అవసరమని కన్నబాబు పేర్కొన్నారు. ఆర్థిక లోటును కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మంచి నిర్ణయం వెలువడతుందని ఆశించిన ప్రజలకు ఇరుపార్టీలు కలిసి మొండిచెయ్యి చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఈ రెండు పార్టీలు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.