- ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారు?
- మండిపడ్డ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
మరోసారి దగా చేసిన ‘దేశం, బీజేపీ’
Published Sat, Jul 30 2016 12:16 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
కాకినాడ :
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వరని పార్లమెంట్ సాక్షిగా మరోసారి పరోక్షంగా తేలిపోయిందని ౖవైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు తెలుగు ప్రజలను మరోసారి మోసం చేశాయని ఆయన మండిపడ్డారు. శుక్రవారం రాత్రి ఆయన కాకినాడలో విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పదేళ్ళు ప్రత్యేక హోదా కావాలని ఒకరు, చాలదు 15 ఏళ్ళు కావాలని మరొకరు ప్రజల ముందు మొసలికన్నీరుకార్చి ఇప్పుడు దాటవేత వైఖరి అవలంబిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పరోక్షంగా ప్రత్యేక హోదా ఇవ్వరని దాదాపు తేలిపోయిందన్నారు. హోదా అవసరంలేదని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక నిధులు, గ్రాంట్లతో ఆదుకుంటామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతుండగా, కేంద్రం సహకరించడంలేదంటూ చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, తిరిగి వీరిద్దరూ కలిసి ప్రభుత్వాలను నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలా ఎవరిని మోసం చేసేందుకు ప్రకటనలు చేస్తున్నారో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారన్నారు. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు ఆర్థికపరమైన చేయూత కూడా ఎంతో అవసరమని కన్నబాబు పేర్కొన్నారు. ఆర్థిక లోటును కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మంచి నిర్ణయం వెలువడతుందని ఆశించిన ప్రజలకు ఇరుపార్టీలు కలిసి మొండిచెయ్యి చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఈ రెండు పార్టీలు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.
Advertisement
Advertisement