హోదా కోసం న్యాయవాదుల విధుల బహిష్కరణ
కాకినాడ లీగల్ :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు. రాష్ట్ర న్యాయవాద జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, పిఠాపురం, తుని తదితర కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు రాజేష్ ఆధ్వర్యాన న్యాయవాదులు విధులు బహిష్కరించి, బార్ అసోసియేషన్ కార్యాలయం నుంచి జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనకు అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి రావాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు జవహర్ ఆలీ, మోహన్ మురళీ, అయ్యంగార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.