జలుబు, దగ్గుతో బాధపడుతున్న గవర్నర్
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. సాధారణంగా నరసింహన్ దంపతులు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. రాజకీయపార్టీల నేతలు, అధికారులను ఆహ్వానించిమరీ రాజ్‌భవన్‌లో హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసారి రాజకీయ నేతలు లేకుండా హోలీ వేడుకలను, ఉగాది పర్వదినాన్ని జరపాలని నిర్ణయించారు. అయితే ఇటీవల ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తరువాత ఆయన జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఆయన మరలా ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆరోగ్యం కుదుట పడ్డాకే వెళ్లాలని గవర్నర్ నిర్ణయించారు.
గవర్నర్ హోలీ శుభాకాంక్షలు: హోలీ పర్వదినం సందర్భంగా గవర్నర్ నరసింహన్ తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ స్నేహం, సోదరభావాన్ని పెంపొందించేందుకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
గవర్నర్‌తో భేటీ కానున్న అనిల్ గోస్వామి: ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన పనుల పురోగతిని తెలుసుకునేందుకు మంగళవారం రాష్ర్ట పర్యటనకు వస్తున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి గవర్నర్‌తో భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన అపెక్స్ కమిటీకి గవర్నర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందున గోస్వామి రాజ్‌భవన్ వెళ్లి నరసింహన్‌తో చర్చించనున్నారు.