కోటప్పకొండలో గిరిప్రదక్షిణ
శివ నామంతో మార్మోగిన కోటప్పకొండ
నరసరావుపేట రూరల్: పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ వద్ద గిరిప్రదక్షిణ నిర్వహించారు. సెలవురోజు కావడంతో పాటు గిరిప్రదక్షిణ చేసే మార్గాన్ని శుభ్రం చేయడంతో గతంలో కంటే ఎక్కువమంది భక్తులు వచ్చారు. వీరిలో మహిళలే అధికం. తెల్లవారుజామున ఐదు గంటలకు మెట్ల మార్గంలోని వినాయకుడి గుడి వద్ద భక్తులు గిరిప్రదక్షిణను ప్రారంభించారు. నరసరావుపేట, చిలకలూరిపేటతో పాటు పలు గ్రామాల నుంచి వందలాది మంది భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. శివ నామస్మరణతో కోటప్పకొండ మార్మోగింది. కాగా ఆలయ కమిటీ గిరి ప్రదక్షిణ చేసే దారిలో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. రాళ్లు ఉండడంతో చెప్పులు లేకుండా వచ్చిన మహిళలు అవస్థలు పడ్డారు. ఆలయ కమిటీ సభ్యుడు అనుమోలు వెంకయ్య చౌదరి తాగునీరు ఏర్పాట్లు చేశారు. ఇకపై ఆలయ సమాచారాన్ని ముందుగా తెలియజేసేందుకుగాను గిరిప్రదక్షిణ చేసిన భక్తుల ఫోన్ నంబర్లను కమిటీ సభ్యులు సేకరించారు.