పన్నుల వసూళ్లలో టాప్
►గీసుకొండ మండలంలో 86 శాతం వసూలు
►ఎనిమిది పంచాయతీల్లో వంద శాతం పూర్తి
►ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఇక్కడే ఎక్కువ..
గీసుకొండ(పరకాల) : ఇంటి పన్నుల వసూళ్ల విషయంలో జిల్లాలో గీసుకొండ మండలం మొదటి స్థానంలో నిలిచింది. మార్చి 6వ తేదీ నాటికి మండలంలో 86 శాతం ఇంటిపన్నులు వసూలయ్యాయి. జిల్లాలో గీసుకొండ మండలం తర్వాత నర్సంపేట, నల్లబెల్లి మండలాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అయితే జిల్లాలో 15 మండలాలు ఉండగా మిగతా మండలాలకు అందనంత ఎక్కువగా ఇక్కడ పన్నులు వసూలు కావడం, ఉమ్మడి వరంగల్ జిల్లా వారీగా చూసినా ఎక్కువ శాతం ఇంటిపన్నులు వసూలు ఇక్కడే కావడం విశేషం.
ముందు చూపే కారణం..
మండలం ఇంటి పన్నుల వసూళ్ల విషయంలో ముందు నిలవడానికి ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు ముందు చూపు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మమూలుగా అయితే నవంబర్, డిసెంబర్ నెలలో పంటలు చేతికి వచ్చే సీజన్లో ఇంటి పన్నులు వసూలు చేస్తుంటారు. అలా కాకుండా మండలంలో ఆగస్టు నుంచే వసూలు చేయడం, బకాయిలు పేరుకుపోయిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అంతే కాకుండా పన్ను వసూలు చేయడానికి వెళ్లే ముందు గ్రామంలోని తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల వంటి సమస్యలను పరిష్కరించడం, లేదంటే ప్రజలు చెప్పిన వెంటనే వాటిని ఏర్పాటు చేయడం చేశారు. దీంతో ప్రజలు పన్నులు చెల్లించడానికి ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఈఓపీఆర్డీ చొరవ మేరకు పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, వాటర్‌మెన్, స్వీపర్లు, సాక్షరభారత్ కోఆర్డినేటర్లు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. ప్రతీ రోజు ఓ గ్రామానికి వెళ్లడంతో మెరుగైన ఫలితాలొచ్చాయి.
గంగదేవిపల్లి ఆదర్శం..
జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి గ్రామపంచాయతీగా ఏర్పాటైన 1995 నుంచి నేటి వరకు ఇంటి పన్నులు వందశాతం వసూలు అవుతుండటం రాష్ట్రంలోనే రికార్డుగా చెబుతున్నారు. ఆ గ్రామ స్పూర్తితో మరియపురం, ఆరెపల్లి, అనంతారం, చంద్రయ్యపల్లి, కోనాయిమాకుల, బొడ్డుచింతలపెల్లి, నందనాయక్‌తండా గ్రామాల్లోనూ వంద శాతం పన్నులను ప్రజలు చెల్లించారు.
31వ తేదీ లోపు వసూళ్లు..
వరంగల్ రూరల్ జిల్లాలో ఈనెల 31వ తేదీ లోపు ఇంటి పన్నులను వసూలు చేయాలని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, డీపీఓ పిండి కుమారస్వామి సిబ్బందిని ఆదేశించారు. తరచూ పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్డీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశిస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన శాయంపేట మండలంలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ఈనెల 14న సస్పెండ్ చేశారు. దీంతో పన్నుల వసూళ్ల విషయంలో పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెరిగింది.