home gard
-
ఆదివాసీ మహిళను వంచించిన హోంగార్డు
సాక్షి. ఆసిఫాబాద్ : కుమురం భీం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహితుడైన ఒక హోంగార్డు అవివాహితను పెళ్లి చేసుకుంటానని మోసగించి గర్భవతిని చేసి ఆమె మరణానికి కారణమైన సంఘటన కుమురం భీం జిల్లాలో ఆదివారం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్ మండలంలోని దంపూర్ గ్రామానికి చెందిన దుర్వా అరుణ (28) అనే గిరిజన మహిళను ఆసిఫాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలోని లచ్చిరాం కుమారుడైన జాదవ్ సజన్ లాల్ ప్రేమ పేరుతో వివాహం చేసుకుంటానని మాయ మాటాలు చెప్పి నమ్మించాడు. అతనికి పెళ్లి జరిగిన విషయం, కుమారుడు ఉన్న విషయాన్ని అరుణ దగ్గర చెప్పకుండా పెళ్లి కాక ముందే గర్భవతిని చేశాడు. ఎంత కాలం గడిచిన సజన్ లాల్ ఆమెను వివాహం చేసుకోకపోవడంతో బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు అధికారులు అతన్ని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించగా అరుణను పెళ్లి చేసుకుంటానని, డెలివరీ ఖర్చులు సైతం తానే భరిస్తానని ఒప్పుకున్నాడు. ఇదీ జరిగింది.. ఈ నెల 4వ తేదిన బాధిత మహిళకు పురిటి నొప్పులు రాగా ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ ఆసిఫాబాద్ వైద్యులు మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. యువతి పరిస్థితి ఉందోళనకరంగా ఉందని హైదరాబాద్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ సజల్ లాల్ ఆమెను ఆసిఫాబాద్ తీసుకుని వచ్చి ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు. బాధిత కుటుంబీకులు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ఆసిఫాబాద్ వైద్యులు, డీఎస్పీ సహాయంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు అరుణను తరలించారు. అక్కడే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు కడుపులో మంటలు రావడంతో హైదారాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కాని కొద్ది సేపటికే ఆమె మరణించింది. పోలీసులు మృతదేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఇది తెలుసుకున్న యువతి బంధువులు ఆస్పత్రికి చేరుకుని హోంగార్డును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు సహకరించడం లేదని బాధితురాలి బంధువుల ఆవేదన.. గత తొమ్మిది నెలల నుంచి తమకు న్యాయం చేయాలని గతంలో పని చేసిన సీఐని కలిసినట్లు బాధితురాలి తండ్రి నాందేవ్, సోదరీమణులు మాత శ్రీ, సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మోసం చేసిన వ్యక్తి పోలీస్ శాఖకు చెందిన వాడు కావడంతో తమకు పోలీసులు సహకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పకోవాలో తెలియక అరుణను కోల్పోవాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరయ్యారు. ఎమెల్యే హామీతో ఆందోళన విరమణ.. సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీఎస్పీ సత్యనారాయణ, ఎంపీపీ మల్లికార్జున్ ఆస్పత్రికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనకు కారణమైన హోంగార్డుపై చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఆందోళన విరమించారు. శిశు సంరక్షణ కేంద్రానికి చేరిన శిశువు.. హోంగార్డు మోసానికి బలైపోయిన యువతి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి మరణించడంతో ఆ శిశువును జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సావిత్రికి అప్పగించారు. ఆమె శిశువును ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆదివాసీ మహిళకు జరిగిన అన్యాయానికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలికి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఇలాంటి ఘటన జరగడం బాధకరమని వాపోతున్నారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు
– సదరన్ రేంజ్ కమాండెంట్ చంద్ర మౌళి ఆదోని టౌన్: విధుల పట్ల నిర్లక్ష్యం వద్దని హోంగార్డ్స్ సదరన్ రేంజ్ కమాండెంట్(రాయలసీమ రేంజ్)చంద్రమౌళి అన్నారు. బుధవారం ఆదోనిలో హోం గార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 880 మంది రెగ్యులర్, 220 మంది ఆన్ పెయిడ్హోం గార్డులు ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలను హోం గార్డులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ నెల 23 నుంచి జిల్లాలో మూడు టీంలుగా విభజించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. స్త్రీలు, విద్యార్థులు, చిన్న పిల్లలు, మీడియా పట్ల ఎలా వ్యవహరించుకోవాలో శిక్షణలో వివరించనున్నామన్నారు. నంద్యాల, ఆదోని, కర్నూలు పట్టణాల్లో ట్రాఫిక్‌లో విధులు నిర్వహించే సమయంలో సమయ పాలన, స్నేహభావం కలిగి ఉండాలన్నారు. -
'హోం' గడవటమూ కష్టమే!
పని జాస్తి.. వేతనం తక్కువ – అమలుకు నోచుకోని ఉద్యోగ భద్రత డిమాండ్ – నేడు హోంగార్డుల 54వ వ్యవస్థాపక దినోత్సవం కర్నూలు : సమాజ సేవ, శాంతిభద్రతలను పరిరక్షించడంలో హోంగార్డులు పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తూ ప్రజల దృష్టిలో పోలీసులుగానే గుర్తింపును సొంతం చేసుకున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు తదితర అత్యవసర పరిస్థితుల్లో వారి సేవలు ఎనలేనివి. మతసామరస్యాన్ని కాపాడటం, ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం హోంగార్డు విధుల్లో భాగమయింది. నేర నియంత్రణతో పాటు పోలీసు అంతర్గత భద్రత, పోలీసు వాహన డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు టెక్నికల్ కేటగిరీల్లో హోంగార్డులు విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సుమారు 16 సంస్థల్లో 350 మందికి పైగా డిప్యూటేషన్‌పై సేవలందిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో హోంగార్డుల జీవనం హోంగార్డులు రోజంతా విధులు నిర్వహించినా కుటుంబ పోషణ కష్టమవుతోంది. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారి జీవితాల్లో మాత్రం వెలుగు కరువైంది. హోంగార్డులకు నెలకు రూ.12 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారు. అనారోగ్యంతో విధులకు హాజరు కాకుంటే ఆ రోజు వేతనం ఇవ్వరు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కొన్నేళ్లుగా డిమాండ్ ఉన్నప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. పోలీసు శాఖలో కానిస్టేబుళ్లతో సమానంగా 60 సంవత్సరాల సర్వీసు చేసినప్పటికీ ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పదవీ విరమణ పొందుతుండటంతో ఆ కుటుంబాలు వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. హోంగార్డు వ్యవస్థ 1963 డిసెంబర్ 6న ఏర్పాటయింది. పోలీసులకు సహాయంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. కర్నూలు జిల్లాలో 1,130 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 80 మంది మహిళలు ఉన్నారు. పోలీసు విధులే కాకుండా ట్రాఫిక్, రాత్రివేళల్లో పెట్రోలింగ్, ఆర్టీఓ, ఆర్టీసీ, ఐసీడీఎస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫైర్, జైళ్లు, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ తదితర విభాగాల్లో సేవలందిస్తున్నారు. పోలీసులతో సమానంగా సౌకర్యాలకు ఎస్పీ ప్రతిపాదన పోలీసులతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలను హోంగార్డులకు కల్పించాలనే సంకల్పంతో ఎస్పీ ఆకె రవికృష్ణ అనేక ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. చనిపోయిన కుటుంబాలకు వెంటనే ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాది 9 మందికి ఇలా ఉద్యోగం లభించింది. ఐదు జిల్లాల హోంగార్డులకు కర్నూలులోనే వర్క్‌షాప్ నిర్వహించి వారి కష్టసుఖాలపై ఆరా తీశారు. ప్రతి నెలా డ్యూటీ అలవెన్స్ అందేలా చర్యలు చేపట్టారు. బయటి డ్యూటీలకు వెళ్తే ఫీడింగ్ అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అలాగే పిల్లలకు వివాహ రుణం, ఎడ్యుకేషనల్ లోన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని కోరారు. కొన్ని ఆసుపత్రుల్లో రూ.50 వేల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ పథకంలో అందరినీ సభ్యులుగా చేర్పించారు. హోం ఫర్ ఆల్ కింద కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో పనిచేసే హోంగార్డులకు డబుల్ బెడ్ రూమ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. – ఎన్.చంద్రమౌళి, హోంగార్డ్స్ సదరన్ రీజియన్ కమాండెంట్