ప్రేమ మాయం.. నరకం ఆరంభం
సాక్షి ప్రతినిధి, కడప: ఆమె ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్. సహచర హోంగార్డు సోదరుడితో పరిచయం పెంచుకుంది. మాటలు కలిసి ప్రేమికులుగా మారారు. వివాహం చేసుకుందామనుకున్నారు. కులాలు అడ్డు కానున్నాయని యువతి అభ్యంతరం పెట్టింది. ‘కులాలతో నిమిత్తం లేదు, అండగా ఉంటా, జీవితాంతం తోడు నీడగా ఉంటాన’ని అతడు భరోసా ఇచ్చాడు. కుటుంబ పెద్దలను కాదని వివాహం చేసుకుంది. నాలుగు నెలలు తిరక్కమునుపే భర్త నుంచి వేధింపులు తీవ్రమయ్యాయి. అనుమానపు అలోచనలు అధికమయ్యాయి. భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నా చూ స్తుండడం మినహా అత్తమామ జోక్యం చేసుకోలేదు. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి దీన గాథ ఇది.
పోరుమామిళ్లకు చెందిన డి.శిల్ప ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా మైదుకూరులో విధులు నిర్వహిస్తోంది. మైదుకూరులో పని చేస్తోన్న ఓ హోంగార్డు సోదరుడు ఆమెకు పరిచయం అయ్యాడు. తన అన్న వద్దకు వస్తూ వెళ్తూ శిల్ప పట్ల ఆ యువకుడు ఆకర్షితుడయ్యాడు. శిల్పకు ఇష్టమైతే వివాహం చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. కులాలు అడ్డుకానున్నాయి.. ఇరువర్గాలు పట్టింపులకు పోయే అస్కారం ఉందని శిల్ప వివరించింది. తుదకు ఇద్దరూ ఇష్టపడి గత అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులు వీరి దాంపత్య జీవితం సవ్వంగా సాగింది. తర్వాత జీతం మొ త్తం ఇవ్వాల్సిందిగా భర్త అజామాయిషీ చేశాడు. నెల జీతం ఇస్తున్నా.. పైమామూళ్లు ఇవ్వలేదేమిటని ప్రశ్నించాడు. పురుష హోం గార్డులకు మామాళ్లు వస్తున్నప్పుడు నీ కెందుకు రావంటూ నిలదీశాడు. విధుల్లో ఉందా? డ్యూటీకి ఎన్ని గంటలకు వచ్చింది? ఎక్కడికెళ్లింది? ఇలాంటి వాటిపై ఆరా మొదలైంది.
ప్రత్యక్షంగా వాకబు చేయడం, ఫలానా వారితో మాట్లాడుతున్నావేమిటని ప్రశ్నిస్తూ వేధించడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రులను కాదని కులాంతర వివాహం చేసుకున్నందుకు వారికి చెప్పుకోలేని దీన స్థితిలో శిల్ప కొట్టుమిట్టాడుతోంది. సర్వీసు రిజిస్టర్లో నామినీ పేరు తండ్రి కాకుండా భర్త పేరు చేర్చాలని తీవ్రమైన ఒత్తిడి ఆరంభమైంది. ఇంతటి క్షోభ అనుభవిస్తూ.. మరోవైపు డ్యూటీకీ సక్రమంగా హాజరు కావడం లేదని పై అధికారుల నుంచి చీవాట్లు, మందలింపులు షరామామూలయ్యాయి. అటు భర్త చిత్రహింసలు, డ్యూటీ పరంగా ఉన్న ఒత్తిడి భరించలేక మానసిక వేదనకు గురవుతోంది. ఈక్రమంలో గురువారం పోలీసు అధికారులను కలిసి తన వేదనను విన్నవించుకునేందుకు ఆమె సిద్ధమైంది. అండగా నిలవాలని ప్రజా సంఘాలు, మహిళ సంఘాలను అభ్యర్థిస్తోంది. ఆ మేరకు తన ఆవేదనను ఆమె ‘సాక్షి’కి వివరించింది.