హోంగార్డుల వీడియో కలకలం
బికనీర్: లంచమిస్తేనే డ్యూటీ కేటాయిస్తామని ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారని కొందరు హోంగార్డులు విడుదల చేసిన వీడియో సంచలనమైంది. రాజస్తాన్‌లోని బికనీర్, శ్రీగంగానగర్, హనుమాన్‌ఘర్, చురు ప్రాంతాలకు చెందిన జవాన్లు వీడియోలో ఉన్నారు. పొకర్ రామ్ అనే జవాన్ వీడియోలో మాట్లాడుతూ ఉన్నతాధికారులు, వారి ఏజెంట్లు మాలాంటి వాళ్లకు డ్యూటీ కేటాయించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మార్చి 31 లోగా ప్రధాని మోదీ ఈ సమస్యను పరిష్కరించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో హోంగార్డు సుభాష్ బిష్ణోయ్ మాట్లాడుతూ, తమకు డ్యూటీలు కేటాయించడానికి అధికారుల ఏజెంట్లు రూ.5–6 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తాను విధుల్లో చేరినప్పటి నుంచి ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉందన్నారు. కమాండర్ వీర్ సింగ్‌ను రాజస్తాన్ ఏసీబీ ఇటీవల రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నట్లు చాలామంది జవాన్లు తమకు ఫిర్యాదు చేస్తున్నారని ఏసీబీ అదనపు ఎస్పీ రాజేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు.