హోంగార్డుల పాత్ర కీలకం: నాయిని
హైదరాబాద్: పోలీసు శాఖలో హోంగార్డుల పాత్ర కీలమైనదని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. హోంగార్డులకు ముందుగా కావాల్సింది ఇళ్లు కాదని, ఉద్యోగ భద్రతని అన్నారు. పోలీసు శాఖ సంక్షేమం కోసం రూ.300 కోట్లు మంజూరు చేశామన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతల పరిరక్షణ బాగుండాలని ఆకాంక్షించారు. హైదరాబాదు బాగుంటే తెలంగాణ బాగుంటుందని అన్నారు. గుండెకాయ వంటి హైదరాబాదులో బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి డిపార్ట్మెంట్లో కొన్ని మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే పది నిమిషాల్లో పోలీసులు ఉండేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.
ఎక్కడా రౌడీయిజం, గుండాయిజం కనిపించకూడదని అన్నారు. కార్లు, ఉద్యోగ భద్రత కల్పించాకే మిగతా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రూ. తొమ్మిది వేలు వేతనం ఇస్తున్నామని, ఈ వేతనంతో ఇళ్లు గడవడం కష్టమని అన్నారు. హోంగార్డులకు పోలీసులతో సమానంగా మున్ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డులు లేనిదే పోలీసు శాఖ లేదని, మీకు ఈ సారి బడ్జెట్లో కాకుంటే వచ్చే బడ్జెట్లో న్యాయం చేస్తామని పేర్కొన్నారు. న్యాయమైన బస్పాస్లను ఇస్తామని అన్నారు.
గవర్నర్కు అధికారాలపై కోర్టుకెళ్తాం: నాయిని
గవర్నర్కు అధికారాలు కల్పించడంపై ఈ నెల 18న కేంద్రం ఏం చెబుతుందో వేచి చూస్తామని.. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హోంమంత్రి స్పష్టంచేశారు. సచివాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం తగదని పేర్కొన్నారు. గవర్నర్కు అధికారాలు కల్పిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. టీ డీపీని పట్టుకొని బీజేపీ వేలాడుతోందని విమర్శించారు. చంద్రబాబు, వెంకయ్య చెప్పే విషయాలను కేంద్రం పక్కన పెట్టాలని సూచించారు. గవర్నర్కు అధికారాల విషయంలో కేంద్ర నిర్ణయాన్ని అమలుచేయబోమన్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ స్నేహం చేస్తుందా అన్న ప్రశ్నకు.. బీజేపీ వారు, కమ్యూనిస్టులు ఇలా అందరూ తమకు స్నేహితులేనని నాయిని బదులిచ్చారు.