Home Minister Nayani narasimha Reddy
-
నిరుద్యోగులకు వరం.. జాబ్‌మేళా
యాదగిరిగుట్ట (ఆలేరు) : నిరుద్యోగ సమస్యను అధిగమించే దిశగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని వ్యవసాయం, ఇతర పనులు చేస్తూ, ఇంట్లోనే ఖాళీగా గడుపుతున్న నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో వివిధ పరిశ్రమలతో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చర్చలు జరిపి, నిరుద్యోగులకు ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి ఆలేరులో జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తిప్పలుండవ్.. ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, మోటకొండూర్, తుర్కపల్లి, ఆత్మకూర్(ఎం), బొమ్మలరామారం మండలాల్లో ఉన్నత చదువులు అభ్యసించిన నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రతి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగ వేట చేసి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు. దీంతో ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయం, ఉపాధి కూలీ, తదితర పనులు చేసుకుంటున్నారు. గమనించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సహకారంతో డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అధికారులతో కలిసి ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో జాబ్‌మేళ నిర్వహించడానికి సిద్దమయ్యారు. ఈనెల 25న జాబ్ మేళా... నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 25వ తేదీన ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 9.30గంటల నుంచి మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. సుమారు 30 ప్రైవేట్ పరిశ్రమలతో అగ్రిమెంట్ చేసుకొని, 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఈ జాబ్‌మేళా చేపడుతున్నారు. ఈ మెగా జాబ్‌మేళాకు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించనున్నారు. విద్యార్హత ఇదే.. 8, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ, నర్సింగ్, ఐటిఐ తదితర అర్హతలతో కూడిన నిరుద్యోగులు జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులు. www. employment.telangana.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. జాబ్‌మేళాకు వచ్చే వారు 3 సెట్లు విద్యార్హత జిరాక్స్ పత్రులు, సర్టిఫికెట్లు తీసుకురావాలి. సద్వినియోగం చేసుకోవాలి ఈనెల25వ తేదీన ఆలేరు పట్టణంలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. నియోజకవర్గంలోని నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని 30 ప్రైవేట్ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి, 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ జాబ్‌మేళాకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. -గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఉద్యోగం సంపాదిస్తా ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకొని, ఉద్యోగం సంపాదిస్తాను. అంతే కాకుండా ఇతర నిరుద్యోగులను సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కృషి చేస్తాను. -శ్రీకాంత్, నిరుద్యోగి, యాదగిరిగుట్ట -
హరితహారం చారిత్రాత్మకం
మేడ్చల్: తెలంగాణలో చేపట్టిన తెలంగాణకు హరితహారం దేశ చరిత్రలో చారిత్రాత్మకమైన విషయమని రాష్ర్ట హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలోని అత్వెల్లిలో మేడ్చల్ పోలీసులు నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ దుర్బిక్ష పరిస్థితులను శాశ్వతంగా దూరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి అశోక చక్రవర్తిలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాడని అన్నారు.ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.గత ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలను విస్మరించడం వల్లే నేడు తెలంగాణలో కరువు పరిస్ధితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం మొక్కలు నాటి అడవుల శాతం పెంచడానికే హరితహారంపై ప్రత్యేక శ్రధ్ద వహిస్తుందని అన్నారు.రాష్ర్టంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు దేశంలోనే గోప్ప ప్రశంసలు పొందాయని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపించిందని తెలిపారు. పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఇప్పటికి 40లక్షల మొక్కలు నాటామని సైబరాబాద్ వెస్ట్ జోన్‌లోని బాలానగర్ డివిజన్లో 50వేల మొక్కలు నాటామని రెండుమూడు రోజుల్లో 3వేల మొక్కలు నాటుతామని తెలిపారు. కార్మిక శాఖ ఆద్వర్యంలో 4లక్షల మొక్కలు నాటామని మరో 10లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.తాను హరితహారంలో రాష్ర్టమంతటా పర్యటించి మొక్కలు నాటుతున్నానని ఇలాంటి కార్యక్రమంలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. నగర పంచాయతీ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు ఇంటింటి వద్ద మొక్కలు నాటాలని మొక్కలు సరఫరా చేశారు.కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతీ నాయకుడు మొక్కలు నాటే విధంగా చేసి ఆయన మొక్కలు నాటారు.విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహికంగా మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలోని దుర్గమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సాయిశేఖర్, పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్,మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ సత్యనారాయణ, ఎంపీపీ విజయలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాస్కర్‌యాదవ్, మాజీ చైర్మెన్ నందారెడ్డి,నాయకులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటిన హోంమంత్రి
⇒ గత పాలకులు చెట్లు నాటకపోవడం వల్లె రాష్ట్రంలో దుర్భిక్షం ⇒ మొక్కలు నాటని వారు సమాజ వ్యతిరేకులు ⇒ హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి మేడ్చల్: గత పాలకులు రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటకపోవడం వల్లే నేడు తెలంగాణ దుర్భిక్ష పరిస్థితులు నెలకున్నాయని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. ఆయన పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ, కండ్లకోయలోని మేడ్చల్ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో బుధవారం హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. ఈసంధర్భంగా ఐటిఐలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు చెట్లను నరికారె గాని నాటలేదని ఆరోపణలు చేశాడు.ముఖ్యమంత్రి కేసీఆర్ దూర ఆలోచనలు చేసి నాటి చక్రవర్తి అశోకుడి లా రాష్ట్రంలో మొక్కలు నాటడానికి ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నాడు.ఇంటికోక మొక్క తప్పనిసరిగా నాటాలని మొక్క నాటని వారు సమాజవ్యతిరేకులని అన్నారు.అందరు భాగస్వాములై మొక్కలు నాటితే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని అన్నాడు. రాష్ట్రంలో చేడుతున్న పనుల వల్ల ప్రపంచం తెలంగాణ వైపు చూస్తుందని త్వరలో హరితహారం కార్యక్రమం గిన్నిస్ బుక్కులో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.మిషన్ భగీరధ కార్యక్రమాన్ని ప్రధాని మోడి అగస్టు 7న గజ్వెల్లో ప్రారంబిస్తారని ఆయన చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 40 వేల మొక్కలు నాటారని, ఐటిఐలలో లక్ష మొక్కలు, కార్మిక శాకలో మూడు లక్షల మొక్కలు నాటాలని అన్నారు. మేడ్చల్ ఐటిఐ తీరు పై నాయిని ఆగ్రహం.. మేడ్చల్ ఐటిఐ తీరుపై హోం,కార్మిక ఉపాది కల్పన శాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లాలు ను చూసి ఇళ్ళు ను చూడు అన్న చందంతో ఐటిఐ ప్రిన్సిపాల్ శైలజను పోల్చారు. ఐటిఐ ప్రధాన గేటు నుండి భవనం వరకు కంకర తేలిన రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో రోడ్డె బాగు చేయలేని అధికారులు పిల్లలకు చదువులు ఏం చెబుతారంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రూ.4 లక్షల మంజూరీ కోసం అర్జి పెట్టకున్నామని శైలజ వివరిస్తుండగా 4లక్షల నిధులు సమకూర్చకోకపోతే ఎలా అంటూ అక్కడే ఉన్న ఉపాధికల్పన డైరక్టర్ నాయక్‌ను ప్రశ్నించారు.వెంటనే నిధులు విడుదల చేసి రోడ్డు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐటిఐలో ఖాళీగా ఉన్న 22 పోస్టులను మంజూరీ చేస్తామని హమీ ఇచ్చారు. పీఎస్‌కు ఐటిఐలో ఎకరం స్థలం కేటాయించా మేడ్చల్ పోలీస్‌స్టేషన్ ఇరుకైన ప్రదేశంలో శిధిల భవనంలో కోనసాగుతుందని హోంమంత్రి దృష్టి సారించి నూతన భవనానికి నిధులు మంజూరీ చేసి భవనాన్ని నిర్మించడానికి ఆయన చూస్తున్న ఉపాధి కల్పన శాఖ ఆధీనంలో ఉన్న ఐటిఐ స్థలంలో ఎకరం ను పోలీస్‌స్టేషన్‌కు కేటాయించాలని కోరారు.చూస్తానని హోమంత్రి చెప్పారు. మేడ్చల్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలంతా మంత్రులయ్యారని సుధీర్‌రెడ్డి సైతం మంత్రి అవుతారమె అంటూ సెటర్లు వేశారు.ఎమ్మెల్యే లు ఎంతబాగా హరితహారంలో పాల్గొని అధిక చెట్లు పెడితే అన్ని అధిక నిధులు ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని అంటూ విషయాన్ని గుర్తు చేశారు.కార్యక్రమంలో ఎల్టీఎఫ్ ప్రిన్స్‌పల్ సెక్రటరీ అహ్మద్ నవీద్, ఉపాధి కల్పన శాఖా డైరక్టర్ కె.వై నాయక్, ఎంపీపీ విజయలక్ష్మీ, జెడ్పీటీసీ జెకె శైలజ, మార్కెట్ కమిటీ చైర్మెన్ సత్యనారయణ, ఎంపీడీఓ దేవసహయం,తహసిల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, నగరపంచాయతీ కమిషనర్ రాంరెడ్డి,టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి
⇒ హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ⇒ భవన నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ సంఘం (బీఎన్ఆర్కేఎస్) 7వ రాష్ట్ర మహాసభ కీసర: రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని లలిత ఫంక్షన్ హాల్లో జరిగిన భవన నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ సంఘం (బీఎన్ఆర్కేఎస్) 7వ రాష్ట్ర మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికబద్దంగా ముందుకెళ్తుందని తెలిపారు. భవన నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులంతా మొదటగా సంఘంలో గుర్తింపు కోసం సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం ఉంటే కార్మికులందరికి లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో పథకాలకు అర్హులవుతారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతిచెం దితే వారికి గతంలో రూ. 2 లక్షల ఆర్థిక సాయం వచ్చేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దానిని రూ. 6 లక్షలకు పెంచి నట్లు తెలిపారు. అదే విధంగా శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ. 5 లక్షలు,. పాక్షికమైతే రూ. 2 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు సహజమరణానికి గురైతే రూ. 60 వేలు, అంత్యక్రియలకు రూ. 20 వేలు అందిస్తున్నామన్నారు. ఆస్పత్రి ఖర్చుల కోసం లేబర్ కమిషన్ నుంచి కొంతమొత్తాన్ని కార్మికులకు ఇస్తున్నామన్నారు.తెల్లరేషన్ కార్డులున్న వారి కుటుంబాల్లో ఆడపిల్లల పిల్లల పెళ్లిలకు కల్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు.ఈ పథకానికి భవననిర్మాణ కార్మికులు కూడా అర్హులేనన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, ఫించన్ల విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈఎస్ఎస్ సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలో త్వరలోనే భవననిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఇక కార్మికులంతా ఐక్యంగా ముందుకెళ్లి తమ సంఘాన్ని మరింత పట్టిష్టపరచుకోవాలన్నారు.బంగారు తెలంగాణ నిర్మాణానికి అకుంఠితదీక్షతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మికులంతా అండగా నిలవాలన్నారు. త్వరలో జిల్లాల వారి గా సమావేశాలు నిర్వహించి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులు కార్యక్రమంలో బీఎన్ఆర్కేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా భవననిర్మాణ రంగ కార్మికులు శ్రమ దోపిడీకి గురతున్నారని చెప్పారు. వారికి పనికి తగినట్లుగా వేతనాలు అందేలా చట్టాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. సంఘాన్ని పటిష్టం చేసేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతామన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు హోంమంత్రి చేతుల మీదుగా ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సంఘం రాష్ట్ర నేతలు ఎల్లయ్య, సూర్యం, దశరథం, రాజన్న, హన్మంత్, లక్ష్మయ్య. మల్లేశం. టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మొరుగు యాదగిరి, వివిధ జిల్లాల అధ్యక్షులు గంగాధర్, లక్ష్మినారాయణ, హరిచంద్ర, వెంకటయ్య, రాజయ్య, మన్నష్ణ, మంచాల పాపయ్య, మహేందర్, శ్రీనివాస్, ఎంపీపీ సుజాత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోర రవికాంత్, సర్పంచ్‌లు గణేష్, చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ రాయిల శ్రావణ్‌కుమార్ గుప్తా, ఎంపీటీసీ సభ్యులు రమేష్‌గుప్తా, జంగయ్యయాదవ్ తదితరులు ఉన్నారు. -
‘రంజాన్’కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ) మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. పండుగ ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. రంజాన్ మాసం ప్రారంభం నుంచి పండుగ రోజు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. రహదారులు పరిశుభ్రంగా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. మసీదుల వద్ద విద్యుత్ అలంకరణలు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమైన ప్రాంతాల్లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా దుకాణాల సమయాలను పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నీటిసరఫరా పనులను జూలైలోగా పూర్తి చేస్తామని, మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేందుకు చర్యలు చేపడతామని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. సమావేశంలో మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, అహ్మద్ పాషాఖాద్రీ, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, మోజంఖాన్, కౌసర్ మొహినుద్దీన్, ఎమ్మెల్సీలు జాఫ్రీ, హైదర్ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో రగడ రంజాన్ ఏర్పాట్ల సమీక్షలో మజ్లిస్ ఎమ్మెల్యేలు రగడ సృష్టించారు. ఇటీవల ఈదురు గాలులతో పాతబస్తీలో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాల ప్రస్తావన తేవడంతో గందరగోళం చోటుచేసుకుంది. సమీక్ష అనంతరం ఇతర అంశాలపై చర్చిద్దామని మంత్రులు పేర్కొనగా, మజ్లీస్ ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఒక దశలో మజ్లిస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా మంత్రులు కలుగ జేసుకొని.. పాతబస్తీలో వెంటనే విద్యుత్, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించడంతో వారు శాంతించారు.