భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి
⇒ హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
⇒ భవన నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ సంఘం (బీఎన్ఆర్‌కేఎస్) 7వ రాష్ట్ర మహాసభ
కీసర: రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని లలిత ఫంక్షన్ హాల్‌లో జరిగిన భవన నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ సంఘం (బీఎన్ఆర్‌కేఎస్) 7వ రాష్ట్ర మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రణాళికబద్దంగా ముందుకెళ్తుందని తెలిపారు. భవన నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులంతా మొదటగా సంఘంలో గుర్తింపు కోసం సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం ఉంటే కార్మికులందరికి లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో పథకాలకు అర్హులవుతారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతిచెం దితే వారికి గతంలో రూ. 2 లక్షల ఆర్థిక సాయం వచ్చేదని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దానిని రూ. 6 లక్షలకు పెంచి నట్లు తెలిపారు. అదే విధంగా శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ. 5 లక్షలు,. పాక్షికమైతే రూ. 2 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు సహజమరణానికి గురైతే రూ. 60 వేలు, అంత్యక్రియలకు రూ. 20 వేలు అందిస్తున్నామన్నారు. ఆస్పత్రి ఖర్చుల కోసం లేబర్ కమిషన్ నుంచి కొంతమొత్తాన్ని కార్మికులకు ఇస్తున్నామన్నారు.తెల్లరేషన్ కార్డులున్న వారి కుటుంబాల్లో ఆడపిల్లల పిల్లల పెళ్లిలకు కల్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు.ఈ పథకానికి భవననిర్మాణ కార్మికులు కూడా అర్హులేనన్నారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్, ఫించన్ల విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈఎస్‌ఎస్ సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలో త్వరలోనే భవననిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ సౌకర్యం వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఇక కార్మికులంతా ఐక్యంగా ముందుకెళ్లి తమ సంఘాన్ని మరింత పట్టిష్టపరచుకోవాలన్నారు.బంగారు తెలంగాణ నిర్మాణానికి అకుంఠితదీక్షతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కార్మికులంతా అండగా నిలవాలన్నారు. త్వరలో జిల్లాల వారి గా సమావేశాలు నిర్వహించి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.
శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులు
కార్యక్రమంలో బీఎన్ఆర్‌కేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా భవననిర్మాణ రంగ కార్మికులు శ్రమ దోపిడీకి గురతున్నారని చెప్పారు. వారికి పనికి తగినట్లుగా వేతనాలు అందేలా చట్టాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. సంఘాన్ని పటిష్టం చేసేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతామన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు హోంమంత్రి చేతుల మీదుగా ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సంఘం రాష్ట్ర నేతలు ఎల్లయ్య, సూర్యం, దశరథం, రాజన్న, హన్మంత్, లక్ష్మయ్య. మల్లేశం. టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మొరుగు యాదగిరి, వివిధ జిల్లాల అధ్యక్షులు గంగాధర్, లక్ష్మినారాయణ, హరిచంద్ర, వెంకటయ్య, రాజయ్య, మన్నష్ణ, మంచాల పాపయ్య, మహేందర్, శ్రీనివాస్, ఎంపీపీ సుజాత, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోర రవికాంత్, సర్పంచ్‌లు గణేష్, చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ రాయిల శ్రావణ్‌కుమార్ గుప్తా, ఎంపీటీసీ సభ్యులు రమేష్‌గుప్తా, జంగయ్యయాదవ్ తదితరులు ఉన్నారు.