హుజూరాబాద్/ఎంజీఎం: ప్రమాదవశాత్తు ఓ యువకుడి దవడ నుంచి తలలోకి ఇనుపచువ్వ గుచ్చుకోవడంతో రెండు గంటలపాటు నరకయాతన అనుభవించి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో శుక్రవారం జరిగింది. హుజూరాబాద్‌లోని బుడగజంగాల కాలనీకి చెందిన మౌటం రాజు(35) సిద్ధార్థ కన్‌స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న డ్రైనేజీ పనుల్లో మూడు నెలల నుంచి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.
శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో క్రాస్‌రోడ్‌లో నిర్మిస్తున్న డ్రైనేజీకి ఉదయం నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి రెయిలింగ్‌పై పడిపోయాడు. రెయిలింగ్‌పై మొనదేలి ఉన్న ఇనుపచువ్వ ఒకటి రాజు దవడ కింది నుంచి దూసుకెళ్లి తల వెలుపలికి వచ్చింది. ఈ హఠాత్పరిణామానికి షాక్‌కు గురైన రాజు ఇనుపచువ్వకు అతుక్కుపోయి ఎటూ కదల్లేక నొప్పితో విలవిల్లాడాడు.
దవడ కదలించలేని దయనీయస్థితిలో సాయం కోసం సైగలు చేస్తున్న రాజును చూసి పలువురు కంటతడి పెట్టారు. వెంటనే అక్కడి సిబ్బంది ఆ ఇనుపచువ్వను కట్టర్‌తో కత్తిరించారు. సైట్ ఇంజనీర్ అశ్వి న్‌కుమార్, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 108 అంబులెన్స్ ఘటనాస్థలానికి చేరుకుని రాజును ఇనుపచువ్వతోపాటు హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
మెరుగైన చికిత్స కోసం రాజును హుజూరాబాద్ నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వెంటనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో రాజు ప్రాణాలు వదిలాడు. ఎంజీఎంకు వచ్చేసరికే రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కృతిమ శ్వాస అందిస్తూ చువ్వను తొలగిస్తున్న క్రమంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చే సమయంలో రాజు కొన ఊపిరితో ఉన్నాడని, దాదాపు 40 నిమిషాలు ప్రాణాలతో పోరాడాడని ఆయన బంధువు రవి ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment