క్రైమ్: దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. న్యూమోనియాకు చికిత్స పేరుతో మూడు నెలల పసికందుపై అనాగరిక చర్యకు దిగారు గిరిజన పెద్దలు. దీంతో సకాలంలో చికిత్స అందక.. ఆ చిన్నారి పదిహేను రోజులు పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడింది.
షాహ్‌దోల్ జిల్లా పరిధిలోని ఓ గిరిజన తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆ చిన్నారికి.. నాటు వైద్యం పేరుతో 51 సార్లు కాల్చిన కడ్డీతో కడుపు మీద వాతలు పెట్టారు తండా పెద్దలు. అయితే అది వికటించి.. బిడ్డ ప్రాణం మీదకు వచ్చింది. దీంతో స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు చికిత్స పొందుతూ ఆ చిన్నారి కన్నుమూసింది.
ఇదిలా ఉంటే.. చిన్నారి కన్నుమూసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని బంధువులు ఖననం చేశారు. అయితే విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. చిన్నారి మృతదేహాన్ని బయటకు వెలికి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సకాలంలో న్యూమోనియాకు చికిత్స అందకపోవడం, పైగా కడ్డీ కాల్చిన గాయాల ప్రభావంతో బిడ్డ మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనపై స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది స్పందించారు. ఆ బిడ్డ తల్లికి వద్దని చెప్పినా పట్టించుకోకుండా.. ఆ చర్యకు దిగిందని వెల్లడించారు. మధ్యప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో ఇలా జబ్బులకు కడ్డీలను కాల్చి వాతలు పెట్టడం కొందరు ఆచారంగా భావిస్తారు. అయితే ఈ విధానం జబ్బును నయం చేయకపోగా, గాయాలకు కారణం అవుతోందని.. ఒక్కోసారి ఉన్న సమస్యలే ఆరోగ్యాన్ని క్షీణింపజేసి మరణాలకు సైతం దారి తీస్తోందని స్థానిక వైద్య సిబ్బంది చెబుతున్నారు. అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. వాళ్లు మాత్రం ఆచారాలు కొనసాగిస్తున్నారని జిల్లా కలెక్టర్ వందనా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment