నిర్బంధం నిజమే
నిర్బంధం నిజమే
Published Sat, May 20 2017 11:54 PM | Last Updated on Tue, Mar 19 2019 6:15 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇరగవరం ఎస్సై, రైటర్ నిర్బంధం అనంతరం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నడిపిన రాజకీయం రివర్స్ అయ్యింది. ఇరగవరం ఎస్సై కేవీవీ శ్రీనివాస్, రైటర్ ఎస్.ప్రదీప్‌కుమార్‌ను నిర్బంధించి దుర్భాషలాడిన వ్యవహా రంపై తణుకు రూరల్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఇరగవరం ఎస్సై శ్రీనివాస్ తొలుత ఇచ్చిన ఫిర్యాదులో జెడ్పీటీసీ, మరో ఐదుగురు మహిళలు తన విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. ఇదిలావుంటే జిల్లా పోలీసు అధికారుల సంఘం ఎస్సైకు బాసటగా నిలిచింది. తనను నిర్బంధించి.. నేలపై కూర్చోబెట్టి.. దుర్భాషలాడినా కనీసం బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఎస్సై ఉండటం, రాజకీయ జోక్యం ఎక్కువ కావటంతో ఈ వ్యవహారంపై శాసనసభ స్పీకర్‌కు, ఎ«థిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని, రాష్ట్ర హోం మంత్రికి, డీజీపీకి నివేదిక సమర్పించడంతోపాటు సీఎం దృష్టికీ తీసుకువెళ్లాలని పోలీసు అధికారుల సంఘం నిర్ణయించింది. తణుకు ఎమ్మెల్యేను అరె స్ట్ చేయాలని సంఘ నేతలు డిమాండ్ చేయడంతో పోలీసుల్లో కదలిక వచ్చి ంది. ఎట్టకేలకు దీనిపై ఎస్సైతో మరోసారి ఫిర్యాదు చేయించి, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఆయనను ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు.
‘సాక్షి’ కథనంతో వెలుగులోకి..
ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం రాత్రి రెచ్చిపోవడంతోపాటు ఇరగవరం ఎస్సై శ్రీనివాస్‌తోపాటు రైటర్ ప్రదీప్‌కుమార్‌ను తన కార్యాలయంలో నిర్బంధించడాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడి ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనం ఇచ్చారంటూ దుర్బాషలాడారు. అసలు తాను నిర్బంధించలేదని, ప్రశ్నించాను మాత్రమేనని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎస్సైపై ఇరగవరం జెడ్పీటీసీతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే యత్నం చేశారు. అయితే, ఎస్సై ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్టయ్యింది. తొలుత పోలీసులు అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గినట్టు కనపడ్డారు. మీడియా ముందుకు రావడానికీ ఇష్టపడలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో ఏ పోలీసు అధికారీ ఉద్యోగం చేయలేడనే భావనకు రావడంతో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఇదిలావుండగా, ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో ఏం చేయాలనే అంశంపై టీడీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
పేరుకే సాఫ్ట్‌వేర్.. మాట మాత్రం..
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి వచ్చిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట తీరు మాత్రం సాఫ్ట్‌గా ఉండదని, ప్రభుత్వ అధికారులను ఏకవచనంతో అగౌరవంగా మాట్లాడతారని చెబుతున్నారు. మోటార్ సైకిల్‌పై వెళుతున్న కౌన్సిలర్ భర్తకు రూ.130 జరిమానా విధిస్తే.. పోలీసులను ఎమ్మెల్యే తన ఇంటికి పిలిచి పరుష పదజాలంతో తిట్టడమే కాకుండా కుర్చీ విసిరేశారని సమాచారం. తాను చెప్పిన వారు కాకుండా వేరే వారు టెండర్లు వేస్తే వారిని పిలిచి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలున్నాయని తెలిసింది. గతేడాది జనచైతన్య యాత్రల్లో కె.ఇల్లిందలపర్రుకు చెందిన మహిళలు సూరంపూడి వద్ద ఆపి ఇళ్లస్థలాల కో సం అడిగితే వారిని దుర్భాషలాడారు. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి.
గన్‌మన్ సరెండర్
తణుకు : ఇరగవరం ఎస్సై, రైటర్‌లను నిర్భంధించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన తన గన్‌మన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు తెలిసింది. తనపై కేసు నమోదు కావడంతో పోలీసు శాఖపై తీవ్ర అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే ఈ చర్యకు పూనుకున్నట్టు సమాచారం.
Advertisement
Advertisement