మెడికల్ కళాశాల నిర్మించనున్న స్థలం
మెదక్: మెతుకు సీమగా పేరుగాంచిన మెదక్ జిల్లా త్వరలో వైద్య విద్యకు కేరాఫ్‌గా మారనుంది. స్పెషలిస్ట్‌లు లేక అత్యవసర వైద్యం కోసం ఇంతకాలం ఇతర ప్రాంతాలకు పరుగులు తీసిన ప్రజల కష్టాలు తప్పనున్నాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో పాటు త్వరలో మెరుగైన వైద్యం స్థానికంగా అందనుంది.
గత నెలలో సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనలో మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జీఓ విడుదల కావటంతో ఈ నెల 5న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా కళాశాల పనులు ప్రారంభించేందుకు జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అందుబాటులో 400 బెడ్స్
ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, బెడ్స్, వైద్యుల నియామకం చేపట్టి ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరిచేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం.. వైద్యశాలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తోంది. ప్రస్తుతం మెదక్‌లోఉన్న మాతా, శిశు ఆస్పత్రి పక్కనే 30 ఎకరాల్లో వైద్య కళాశాలను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
ఇప్పటికే నర్సింగ్ కళాశాలకు స్థలం కేటాయించిన అధికారులు మెడికల్ కళాశాలతో పాటు వసతి గృహం పనులు వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిబంధన ప్రకారం మెడికల్ కళాశాలకు భవనంతో పాటు 400 బెడ్స్ అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఎంసీహెచ్‌లో 150 బెడ్స్ ఉండగా క్రిటికల్ కేర్ కోసం మరో 100 పడకల ఆస్పత్రితో పాటు జిల్లా ఆస్పత్రిలో 250 బెడ్స్‌తో ఉండాలి.
ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో 200 పడకలకు అప్‌గ్రేడ్ చేసినా మరో 50 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సి ఉంది. మెడికల్ కళాశాల ఏర్పాటైతే అన్నిరకాల స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాల ఫలితంగా ఏర్పాటవుతున్న మెడికల్ కళాశాలతో జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.
సీఎం కేసీఆర్ కృషితో..
సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కృషితో మెడికల్ కళాశాల మంజూరైంది. వచ్చే ఏడాదిలో 100 మంది మెడికోలతో తరగతులు ప్రారంభిస్తాం. కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. – పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్
అన్ని రకాల వైద్యసేవలు..
మెడికల్ కాళాశాల ఏర్పాటుతో అన్నిరకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. అన్ని రకాల వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుతాయి. వైద్యం రంగంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. – చందూనాయక్, డీఎంహెచ్‌ఓ, మెదక్
Comments
Please login to add a commentAdd a comment