‘రంజాన్’కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ) మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. పండుగ ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. రంజాన్ మాసం ప్రారంభం నుంచి పండుగ రోజు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. రహదారులు పరిశుభ్రంగా చూడాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. మసీదుల వద్ద విద్యుత్ అలంకరణలు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు.
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమైన ప్రాంతాల్లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా దుకాణాల సమయాలను పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నీటిసరఫరా పనులను జూలైలోగా పూర్తి చేస్తామని, మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేందుకు చర్యలు చేపడతామని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. సమావేశంలో మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, అహ్మద్ పాషాఖాద్రీ, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, మోజంఖాన్, కౌసర్ మొహినుద్దీన్, ఎమ్మెల్సీలు జాఫ్రీ, హైదర్ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో రగడ
రంజాన్ ఏర్పాట్ల సమీక్షలో మజ్లిస్ ఎమ్మెల్యేలు రగడ సృష్టించారు. ఇటీవల ఈదురు గాలులతో పాతబస్తీలో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాల ప్రస్తావన తేవడంతో గందరగోళం చోటుచేసుకుంది. సమీక్ష అనంతరం ఇతర అంశాలపై చర్చిద్దామని మంత్రులు పేర్కొనగా, మజ్లీస్ ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఒక దశలో మజ్లిస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా మంత్రులు కలుగ జేసుకొని.. పాతబస్తీలో వెంటనే విద్యుత్, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించడంతో వారు శాంతించారు.