ramjan festivel
-
పవిత్రమాసం.. నగరానికి పోటేత్తిన ఖర్జూరాలు!
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ అనగానే గుర్తుకుచ్చేది ఖర్జూరం. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ప్రతిరోజూ ఈ పండు తిననివారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలు.. ఖర్జూరం పండుతోనే దీక్ష విరమణ చేస్తారు. అలాంటి ఈ పండ్లకు నగరం కేరాఫ్‌గా నిలుస్తోంది. మరో వారం రోజుల్లో రంజాన్ సీజన్ మొదలు కానుండటంతో ఖర్జూరం పండ్ల స్టాక్ నగరానికి పోటెత్తింది. విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ పండ్ల వ్యాపారం కేవలం వారం రోజుల్లో నగరంలోనే సుమారు రూ.500 కోట్ల మేర సాగిందంటే ఈ పండ్లకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. గతేడాది కరోనా, లాక్‌డౌన్‌తో ఖర్జూరం విక్రయాలు అంతగా సాగలేదు. ఈ ఏడాది పండ్ల వ్యాపారం ఊపందుకుంటుందని భావిస్తున్న తరుణంలో మరోసారి కరోనా పంజా విసురుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తున్నా.. మునుపటిలా వ్యాపారం పడిపోదనే ధీమా వ్యాపార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతి అరబ్బు దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, తూనిషీయా, అల్‌జిరీయా తదితర దేశాల ఖర్జూరాలకు డిమాండ్ ఉంటుంది. ఇరానీ కప్‌కప్, ఇరానీ ఫనాకజర్, బాందా ఖర్జూర్ ప్రసుత్తం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఖర్జూరం కిలో రూ.150 నుంచి రూ.650 వరకు విలువ చేసే రకాలు మార్కెట్లో ఉన్నాయి. ధరలు అందుబాటులో.. కరోనా కాలంలో దాదాపు అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగినా పదేళ్ల నుంచి ఖర్జూరం ధరలు పెరగలేదు. ఇతర ఆహార, ఎండు పండ్ల రేట్లను పరిశీస్తే వాటి ధరలు పదేళ్లలో 50–70 శాతం పెరిగాయి. – రాజ్‌కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ నిర్వాహకుడు, బేగంబజార్ -
సల్మాన్ వర్సెస్ జాన్
సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్’ రంజాన్ సందర్భంగా మే 13న విడుదల కానున్న విషయం తెలిసిందే. అదే రోజు రావడానికి జాన్ అబ్రహామ్ రెడీ అయ్యారు. మూడేళ్ల క్రితం జాన్ అబ్రహామ్ హీరోగా మిలాప్ ఝవేరీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సత్యమేవ జయతే’. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘సత్యమేవ జయతే 2’ రంజాన్ రిలీజ్‌కి రెడీ అయింది. మే 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో జాన్ అబ్రహామ్ రెండు పాత్రలు చేశారు. సినిమాలో జాన్ వర్సెస్ జాన్ అయితే బాక్సాఫీస్ దగ్గర సల్మాన్ ఖాన్ వర్సెస్ జాన్ అనాలి. రంజాన్ సల్మాన్‌కి కలిసొచ్చే పండగ. ఈ సీజన్లో విడుదలైన సల్మాన్ సినిమాలు ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’, ‘కిక్’, ‘బజరంగీ భాయీజాన్’, ‘సుల్తాన్’ వంటివి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించాయి. ‘రాధే’ కూడా ఈ హిట్ లిస్ట్‌లో చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ‘సత్యమేవ జయతే 2’ని కూడా తక్కువ చేయడానికి లేదు. తొలి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు సినిమాలూ హిట్టవ్వాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక అభిమానులంటారా? తమ అభిమాన హీరో సినిమానే హిట్టవ్వాలని కోరుకోవడం సహజం. ఏది ఏమైనా ‘సల్మాన్ వర్సెస్ జాన్’ అనేది ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
అలాంటి వారిని ఉపేక్షించొద్దన్నారు: అంజాద్ బాషా
సాక్షి, తాడేపల్లి: అన్ని జిల్లాల ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి పరిస్థితుల్లో రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాల్సి రావడం బాధాకరం. శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి పండుగలూ ఇదే సమయంలో జరుపుకోవాల్సి వచ్చింది. అందరూ ఇళ్లకే పరిమితమై ప్రార్థనలు చేసుకోవాలని మత పెద్దలను సీఎం కోరారని’ ఆయన వెల్లడించారు. (ఏపీ ప్రభుత్వ బాటలో కేంద్ర ప్రభుత్వం) మత పెద్దలు ఈ విషయాన్ని సీఎం మాటగా ప్రతి సోదరుడికి తెలపాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కరోనా సమయంలో మనకున్న ఒకే ఒక్క ఆయుధం భౌతిక దురమేనని సీఎం చెప్పారని.. ఈ నియమాన్ని పాటిస్తూ అందరూ రంజాన్ మాసాన్ని జరుపుకోవాలని సీఎం సూచించారని ఆయన తెలిపారు. ఫేక్ మెసేజ్ ద్వారా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కొంతమంది మత పెద్దలు సీఎం దృష్టికి తీసుకువచ్చారని.. అటువంటి వారిని ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ డీజీపీకి ఆదేశాలిచ్చారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
భూపాలపల్లి అర్బన్: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం కేంద్రంలోని బాంబులగడ్డ సమీపంలోని ఈద్గాలో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈద్గాలో ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. వేడుకలకు హాజరైన ముస్లింపెద్దలు, మత గురువులు, సోదరులతో ఆయన అలాయ్–బలాయ్ తీసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో మత సామరస్యానికి ప్రతికగా నిలిచే పండుగ రంజాన్ అని, ప్రతీ ఒక్కరూ నియమనిష్టలతో పండుగను జరుపుకోవడం అభినందనీయమన్నారు. కులమతాలకతీతంగా పండుగను హిందూ, ముస్లింలు ఐక్యతతో నిర్వహించుకోవడం మంచి తనానికి నిదర్శనమన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టి నిత్యం ప్రార్థనలు చేస్తారనిని, కఠినమైన ఈ దీక్ష ముస్లింలకు ఎంతో సహకరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. పలువురు హాజరు.. ఈద్గలో జరిగిన వేడుకలకు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు గండ్ర సత్యనారాయణరావు, నాయకులు పాల్గొని నమాజ్ చేశారు. ముస్లిం సోదరులతో అలాయ్–బలాయ్ తీసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు సాంబమూర్తి, బండారి రవి, బుర్ర రమేష్, కుమార్‌రెడ్డి, శేషాల వెంకన్న, ఆకుల మల్లేష్‌గౌడ్, బాబర్‌పాషా, ఖాలిద్, అన్వర్‌పాషా, ఫాజిల్, మసీదు కమిటీ పెద్దలు అబ్ధుల్ ఫాజిల్, షాబీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా రంజాన్
సప్తగిరికాలనీ(కరీంనగర్): నెల రోజులుగా ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు సౌభ్రాతృత్వం, ఆనందం వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫీతర్(రంజాన్) పండుగను భక్తి శ్రద్ధలతో బుధవారం ఘనంగా నిర్వహించారు. కొత్తబట్టలు ధరించి చింతకుంట, సాలేహ్‌నగర్ ఈద్గాల వద్దకు వాహనాలు, కాలినడకన పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఇచ్చిన సందేశాన్ని ఆలకించారు. అల్లాహ్ సందేశాన్ని జీవితంలో ఆచరించే స్ఫూర్తిని అందించాలని ప్రార్థించారు. అటవీ కార్యాలయం ఎదురుగా, ఇతర ప్రాంతాల్లో ఉన్న సమాధులపై పూలు చల్లి తమ పూర్వీకులకు నివాళులు అర్పించారు. బంధువులు, స్నేహితులను ఆలింగనాలు చేసుకుని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇళ్లల్లో బంధుమిత్రులకు విందులు ఏర్పాటు చేసి మైత్రీ భావాన్ని చాటుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సీవీఆర్‌ఎన్ రోడ్డు నుంచి జగిత్యాల వెళ్లే దారిలో రాకపోకలను మళ్లించి, పోలీస్‌లు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాలెహ్‌నగర్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్.. వివిధ పార్టీల రాజకీయ నాయకులు వివిధ ఈద్గాల వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాలెహ్నగర్లోని ఈద్గా వద్ద కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్ పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అని మతాల వారికి సమాన ప్రాతినిధ్యం ఇస్తోందని, హిందుముస్లింలు కలిసి మెలిసి ఉండాలని అన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్పొరేటర్ ఎండీ.ఆరీఫ్, దళిత, ముస్లిం నాయకుడు చంద్రశేఖర్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపిన సీపీ.. సాలెహ్ నగర్ ఈద్గా వద్ద జిల్లా పోలీస్ యంత్రాంగం, పీసీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి ముస్లింకు రోజా పూలు, చాక్లెట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు చిన్నారులు, యువకులు సీపీతో సెల్ఫీలు తీసుకొన్నారు. ఏసీపీ ఉషారాణితోపాటు పీసీ కమిటీ బాధ్యులు బుర్ర మధుసూదన్‌రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఘన్‌శ్యామ్ పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు.. రంజాన్ పండుగను పురస్కరించుకొని నగరంలోని పలు ఈద్గాల వద్ద పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించారు. సాలెహ్నగర్ వద్ద బందోబస్తును సీపీ కమలాసన్‌రెడ్డి, ఏసిపీ ఉషారాణి పర్యవేక్షించారు. నగరంలోని ఈద్గాల వద్ద సాలెహ్‌నగర్‌లో జరిగిన ప్రార్థనలో ముస్లిం మత పెద్ద ముఫ్తీ గయాస్ ముషియొద్దీన్ ప్రసంగం చేశారు. దానధర్మాల ద్వారానే పుణ్యాన్ని సంపాదించుకోవాలని సూచించారు. పురానీ ఈద్గా, చింతకుంట ఈద్గా వద్ద ముప్తీ ఎత్తె మాదుల్ హాక్ నమాజ్‌తోపాటు ప్రసంగం చేశారు. బైపాస్‌రోడ్డులోని ఈద్గా అహ్మద్ వద్ద మౌలానా మహ్మద్ యూనుస్, నమాజ్ చేయించారు. అనంతరం ప్రసంగం చేశారు. వెల్లివిరిసిన మత సామరస్యం... నమాజ్ అనంతరం ముస్లింలు హిందువులను కూడా తమ ఇళ్లకు విందులకు ఆహ్వానించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసి విందు ఆరగించారు. విదేశాలలోని బంధువులు, మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. -
మత సామరస్యానికి ప్రతీక ‘రంజాన్’
బాన్సువాడ/కామారెడ్డి టౌన్: 29 రోజుల ఉపవాసాలు ముగిశాయి. ఇక పండుగే మిగిలింది. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండుగ రంజాన్. రంజాన్ మాసం మంగళవారం నాటితో ముగియగా, షవ్వాల్ మాసంలోని మొదటి రోజు జరుపుకొనే పండుగే ఈద్–ఉల్–ఫితర్. మంగళవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో బుధవారం రంజాన్ పండుగను జరుపుకోవాలని మత గురువులు ప్రకటించారు. ఈ పండుగ ఉమ్మడి జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈద్–ఉల్–ఫితర్ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోని ఈద్గా‹లలో ప్రార్థనలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. దివ్య ఖుర్ ఆన్ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చింది. ఈ నెలలో ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేçయడం ద్వా రా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా కామ, క్రో ధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అదుపు లో ఉంటాయి. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షను ఆచరించిన విధితమే. ఉదయాన్నే అన్న పానాదులను సేవించడాన్ని సహరి అంటా రు. తిరిగి సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి భోజనాన్ని సేవించడాన్ని ఇఫ్తార్ అంటారు. ఈద్–ఉల్–ఫితర్ అంటే.. నెల రోజులపాటు రంజాన్ దీక్షలు పాటించిన ముస్లింలు మాసం అనంతరం షవ్వాల్ మాసపు మొదటి రోజు జరుపుకొనే పండుగే ఈద్–ఉల్–ఫితర్. ఈ రోజు ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి, కొత్త బట్టలను ధరించి, ఇతర్ పూసుకొని ఊరి చివరన ఉండే ఈద్గాహ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ‘ఈద్–ముబారక్’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకొంటారు. రంజాన్ పండగ రోజు షీర్ ఖుర్మా అనే తీపి వంటకం అందరినీ నోరూరిస్తుంది. వాతావరణమంతా దైవ విశ్వాసం, దైవ భీతి, దైవ విధేయతా భావాలతో, ఉన్నత నైతిక పోకడలతో, సత్క్రియా, సదాచారాలతో అలరారుతుంది. ఈ వాతావరణంలో చెడు అన్నది అణగిపోతుంది. మంచి అన్నది పెరుగుతుంది. సజ్జనులు సత్కార్యాల్లో సహకరించుకొంటారు. ధనికులు, పేదలు అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అందరూ ఒకే విధమైన దిన చర్యను పాటిస్తారు. తామంతా ఒకే భావన, ప్రేమాభిమానాలు, సమైక్యతా సామరస్యాలు నెలకొల్పడంలో ఈ పండుగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ పండుగ తర్వాత మరో 6 రోజులపాటు షవ్వాల్ దీక్షలను పాటిస్తారు. జకాత్: ఇస్లాం నిర్దేశించిన సిద్ధాంతాల్లో జకాత్ నాలుగోది. జకాత్ అనగా దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దానిలోనే అవసరమున్న వారికి ఇంత ఇచ్చి ఆదుకోవాలి. తమ వద్ద ఉన్న బంగారం, వెండి, రొక్కం, ఆ సంవత్సరం పండిన పంట, వ్యాపారం కోసం నిర్దేశించబడి ఉన్న సరుకులు, చివరకి తమ వద్ద ఉన్న పశువుల వెల కట్టి అందులో నుంచి 2.5శాతం విధిగా దానం చేయాల్సి ఉంటుంది. నిరుపేదలు సైతం ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలనేదే జకాత్, ఫిత్రాల ముఖ్య ఉద్దేశం. అనేక విషయాలు అవగతం: రంజాన్‌తో అనేక విషయాలు అవగమవుతాయి. మనో నిగ్రహం అలవడుతుంది. ఆకలి, దప్పుల విలువ తెలుస్తుంది. దాన గుణం అలవడుతుంది. చెడు అలవాట్లు, కోరికలు దహించబడుతాయి. ప్రేమ, అభిమానం, క్రమశిక్షణ, రుజువర్తన, కర్తవ్య పారాయరణత, సర్వ మానవ సౌబ్రాతత్వం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి. సృష్టికర్త, సహృదయంతో మానవాళికి రంజాన్ మాసం అందించారు. ఈ మాసంలో ఒక సత్కార్యం చేస్తే ఇతర మాసాల్లో లభించే పుణ్య ఫలం కంటే అత్యధికంగా లభిస్తుంది. ప్రతి రోజు రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ప్రత్యేకంగా తరావీ నమాజ్ చేస్తారు. దివ్య ఖుర్ ఆన్‌ను రోజుకు 20 రకాతుల చొప్పున తరావీ నమాజులో 27 రోజులపాటు హాఫీజ్లు పఠిస్తారు. రంజాన్‌లో రాత్రి పూట ఇషా నమాజ్ అనంతరం తరావీ నమాజ్ జరుగుతుంది. ఇలా 27 రోజులు తరావీ నమాజ్ జరిపిన తర్వాత షబ్–ఎ–ఖదర్ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. 30 రోజులపాటు ఉపవాస దీక్ష పాటించలేని వారు 27 రోజుల తర్వాత వచ్చే షబ్–ఎ–ఖదర్ రాత్రి నుంచి ఈద్–ఉల్–ఫితర్ వరకు మూడు రోజులపాటు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇహ లోకంలో ఆచరించే ఇటువంటి కఠో ర దీక్షలు మనల్ని పరలోకంలో రక్షణగా ఉండి కా పాడుతాయని ముస్లింల ప్రగా«ఢ విశ్వాసం. రంజా న్ నెలలో ఉపవాసాలతో, దాన ధర్మాలతో గడిపిన వారి ప్రార్థనలను అల్లాహ్ ఆలకిస్తాడని, వారి పాపాలు పరిహారమై అగ్ని సంస్కారం పొందిన బంగారం మాదిరి వారి మోము దివ్య కాంతిలో వెలుగొందుతుందని ముస్లింలు విశ్వసిస్తారు. ఫిత్రాదానం: షవ్వాల్ నెల మొదటి తేదీ ఈద్–ఉల్–ఫితర్ çపండుగనాడు నమాజ్ ప్రార్థనకు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండుగను ఈద్–ఉల్–ఫిత్ర్ అని పేరు వచ్చింది. షరియత్ పరిభాషలో ఫిత్రా అంటే ఉపవాసాల పాటింపులో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఆ లోపాల పరిహారార్థం చేసేదే ఫిత్రా దానం. సమాజంలోని నిరుపేదలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు కూడా ఇతరులతో పాటు పండుగల్లో మంచి వస్త్రాలు ధరించి మంచి వంటకాలు ఆరగించే వీలు కల్పిస్తుంది. పావు తక్కువ రెండు సేర్ల గోదుమల తూకానికి సరిపడా పైకాన్ని కడు నిరుపేదలకు దైవం పేరిట ప్రతి ముస్లిం దానం చేయాలి. -
రంజాన్ తోఫా రెడీ
మెదక్ రూరల్: నిరుపేదలు సైతం అందరితో సమానంగా పండుగలను జరుపుకోవాలనే ఆలోచనతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు వారివారి ముఖ్యమైన పండుగలకు ప్రభుత్వం కానుకలను పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుత రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు కానుకలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కేంద్రంలో రంజాన్ కానుకలను పంపిణీ చేసేం దుకు సిద్ధంగా ఉంచారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు, 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానుకలను పంపిణీ చేసేందుకు మెదక్ నియోజకవర్గంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మూడు మెదక్ పట్టణంలో, ఒకటి పాపన్నపేట, మరొకటి రామాయంపేటలో ఉన్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నర్సాపూర్, కౌడిపల్లి, దౌల్తాబాద్ ఉన్నాయి. మొత్తం రెండు నియోజకవర్గాల్లో కలిపి ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కోసం ఒక్కో సెంటర్‌కు లక్ష రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది సెంటర్లకు రూ.8లక్షలు అందజేయనున్నారు. పండుగకు వారం రోజుల ముందు ప్రతి సెంటర్లో 500 మంది పేదలను గుర్తించి వారికి దుస్తులతో ఉన్న గిఫ్ట్ ప్యాకెట్లను అందజేయనున్నారు. ఎనిమిది సెంటర్లకు కలిపి మొత్తం 4 వేల గిఫ్ట్ ప్యాకెట్లు జిల్లాకు చేరుకున్నాయి. రంజాన్ పండుగకు వారం రోజుల ముందు వీటిని అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి సెంటర్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ప్రభుత్వం ఇఫ్తార్ విందు కోసం అందించిన డబ్బులను సైతం ఆ కమిటీ సభ్యుల ఖాతాలోనే వేయడం జరుగుతుంది. కమిటీ సభ్యులు వారి సాంప్రదాయం ప్రకారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తారు. తమ ప్రాంతంలోని పేద ముస్లింలను ఆధార్‌కార్డు, ఆధాయ ధ్రువీకరణ పత్రం ద్వారా నిర్ధారిస్తారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన మత పెద్దలతో సమావేశం నిర్వహించిన తర్వాత ఆర్డీఓల పర్యవేక్షణలో కానుకల పంపిణీ చేపట్టనున్నారు. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి రంజాన్ కానుకలను మెదక్ కలెక్టరేట్లో, నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో భద్రపరిచారు. కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లోపంతో ఇఫ్తార్ విందు కోసం వచ్చిన డబ్బులను ఎవరి ఖాతాలో వేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నట్లు సమాచారం. -
గల్ఫ్‌లో రంజాన్ వరాలు
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా గల్ఫ్ దేశాల్లోని ప్రభుత్వాలు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా కార్మికుల పనివేళలను తగ్గించడం, వారికి ఎక్కువ వేతనం చెల్లించడం తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఖైదీలకు క్షమాభిక్ష కూడా అమలు చేస్తున్నాయి. గత సంవత్సరం ఖైదీలకు క్షమాభిక్షను గల్ఫ్‌లోని ఏ దేశమూ ప్రకటించలేదు. వివిధ కారణాల వల్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన వారు సాధారణ జీవితం కొనసాగించడానికి అనుమతి లభించనుంది. తెలియక నేరారోపణలపై జైలు శిక్షకు గురైన వారిలో మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారికి క్షమాభిక్ష లభించనుంది. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడు, షార్జా రూలర్(పాలకుడు) వేర్వేరుగా ఖైదీల విడుదలకు ప్రకటనలు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ ఖలీఫా తమ దేశంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో 3,005 మందికి క్షమాభిక్షను ప్రసాదించనున్నట్లు వెల్లడించారు. అలాగే షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ కాసిమి కూడా షార్జాలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిలో మంచి నడవడిక కలిగిన 377 మందికి క్షమాభిక్షను ప్రసాదించారు. అయితే షార్జా రాజ్యం యూఏఈలో ఒక భాగం కాబట్టి యూఏఈ అధ్యక్షుడు ప్రకటించిన 3,005 మంది ఖైదీల్లో షార్జా రూలర్ ప్రకటించిన ఖైదీలు 377 మంది ఉన్నారా.. లేక వేర్వేరుగా ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించనున్నారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈసారి క్షమాభిక్ష పొందిన వారి సంఖ్యను పరిశీలిస్తే గతంలో కంటే ఎక్కువ ఉందని గల్ఫ్ దేశాల వ్యవహారాల పరిశీలకులు పేర్కొంటున్నారు. క్షమాభిక్ష పొందనున్న ఖైదీల్లో మన దేశానికి చెందిన వారు, ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. ఉపాధి కోసం యూఏఈ పరిధిలోని వివిధ రాజ్యాలకు వలస వెళ్లిన కార్మికులు కొందరు వీసా వర్క్ పర్మిట్ లేకుండా చట్ట విరుద్ధంగా ఉంటూ పోలీసులకు పట్టుబడ్డారు. సొంత ప్రాంతానికి వెళ్లడానికి జరిమానా కట్టే పరిస్థితి లేక పోవడంతో జైలు పాలుకావడం, గల్ఫ్ చట్టాలపై అవగాహన లేకుండా కేసుల్లో ఇరుక్కుని నేరారోపణలపై జైలు శిక్షకు గురైన వారూ ఉన్నారు. అలాగే యూఏఈలో నిషేధించిన మన మందులను రవాణా చేయడం లేదా తమ వద్ద కలిగి ఉండి పోలీసులకు పట్టుబడి జైలు పాలైన వారు కూడా ఉన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో చట్ట విరుద్ధంగా ఉంటూ జరిమానా చెల్లించలేని వారు తక్కువ మంది ఉండగా, నిషేధిత మందులతో పట్టుబడిన వారే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. రంజాన్ సందర్భంగా ఖైదీల విడుదలకు ప్రకటన చేసిన పాలకులు క్షమాభిక్షను అమలు చేసిన తరువాత.. ఏ తరహా నేరాలకు పాల్పడిన ఖైదీలు విడుదలయ్యారో వెల్లడయ్యే అవకాశం ఉంది. పనివేళల్లో మార్పులు.. సాధారణ రోజుల్లో ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనివేళలు ఉంటాయి. ఇందులో ఎనిమిది గంటల పనికి బేసిక్ వేతనం చెల్లిస్తుండగా.. అదనపు నాలుగు గంటల పనికి ఓటీ(ఓవర్ టైం)ను వర్తింపచేసి అదనపు వేతనం చెల్లిస్తారు. రంజాన్ మాసంలో మాత్రం పనివేళలు ఆరు గంటలు ఉంటాయి. అదనపు వేళలు పనిచేస్తే ఓటీ వర్తింపజేస్తారు. తాజాగా ఖతార్ ప్రభుత్వం వెల్లడించిన సర్క్యులర్ ప్రకారం మినిస్ట్రీస్ గవర్నమెంట్ ఏజెన్సీస్, పబ్లిక్ రంగ కంపెనీలు, వివిధ రంగాల సంస్థలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఉంది. అన్ని రంగాల్లోని కార్మికులకు ఈ పని వేళలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. కంపెనీల తీరును బట్టి పనివేళల్లో మార్పులు చేశారు. కొన్ని కంపెనీల్లో ఉదయం ఐదు గంటల నుంచి 11 గంటల వరకు, మరికొన్ని కంపెనీల్లో ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనివేళలను నిర్ణయించారు. ఇందులో ఆరు గంటలు మాత్రం సాధారణ పనివేళలుగా.. మిగిలిన సమయం ఓటీగా పరిగణిస్తున్నారు. ఖతార్‌లో పనివేళలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉండగా.. సౌదీ అరేబియాలో మాత్రం రాత్రిపూటనే కార్మికులకు పనులు కల్పిస్తున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉపవాస దీక్షలు పాటించే కార్మికులతో పాటు సాధారణ కార్మికులకు ఒకే విధమైన పని వేళలను సౌదీలో వర్తింపజేస్తున్నారు. కువైట్, యూఏఈ, ఒమాన్ తదితర దేశాల్లోనూ మార్పులు చేశారు. పాఠశాలల వేళల్లోనూ మార్పు రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఖతార్‌లో పాఠశాలల సమయాల్లో అక్కడి ప్రభుత్వం మార్పులు చేసింది. ఈమేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలకు పని వేళలను కుదించింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనివేళలు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇదే విధంగా పనివేళలు వర్తించనున్నాయి. సాధారణ రోజుల్లో ఒంటి గంట వరకు పాఠశాలలు నడుస్తాయి. కాగా, మిగతా గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. రంజాన్ మాసంలో కార్మికులకు ఎంతో ప్రయోజనం గల్ఫ్‌లో సాధారణ రోజుల్లో కార్మికులకు పని భారం అధికంగానే ఉంటుంది. కానీ, రంజాన్ మాసంలో వెసులుబాటు కలుగుతుందని పలువురు కార్మికులు తెలిపారు. సాధారణ పని వేళలు తగ్గిపోవడంతో పాటు ఓటీ ద్వారా ఎక్కువ వేతనం పొందడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కంపెనీల్లో ముస్లిం కార్మికులు సాధారణ పనివేళల్లో పనిచేసి వారి క్యాంపులకు వెళ్లిపోతుంటారు. దీంతో ఇతర మతాల కార్మికులకు ఓవర్ టైం పని చేయడానికి అవకాశం లభిస్తుంది. ఓటీ వర్తించడం వల్ల సాధారణ పనివేళల్లో లభించే వేతనం కంటే.. ఎక్కువ వేతనం లభిస్తుంది. గల్ఫ్ దేశాల్లోని కొందరు షేక్‌లు రంజాన్ మాసంలో కార్మికులకు బోనస్‌లను ప్రకటించడం, సాధారణ సమయంలో ఇచ్చే వేతనం కంటే ఎక్కువ వేతనం చెల్లించడం, బహుమతులు ఇవ్వడం కూడా సంప్రదాయంగా వస్తోంది. అందువల్ల రంజాన్ మాసంలో తెలుగు కార్మికులు సెలవులపై ఇంటికి రాకుండా కంపెనీల్లో, యజమానుల వద్ద పనిచేస్తూనే ఉంటారు. సౌదీలో రాత్రిపూటనే పనిచేస్తున్నాం సౌదీలో రాత్రిపూటనే పనిచేస్తున్నాం. ఉపవాస దీక్షలు పాటిస్తుండటం వల్ల కంపెనీ యాజమాన్యాలు అన్నీ రాత్రి పూటనే పనిచేయించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని కల్పిస్తున్నాయి. సాధారణ రోజులకు రంజాన్ మాసంలో పనికి ఎంతో తేడా ఉంది. – అజీమ్, రియాద్ (కమ్మర్పల్లి వాసి) రంజాన్ మాసంలో కార్మికులకు లాభమే రంజాన్ మాసంలో గల్ఫ్‌కు సంబంధించి ఏ దేశంలో పనిచేసినా కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. పనివేళలు కుదించినా బేసిక్ వేతనం చెల్లిస్తారు. అంతేకాక ఓవర్ టైం పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. అందువల్ల కార్మికులు రంజాన్ మాసంలో సెలవులు తీసుకోరు. – ముత్యాల గంగాధర్, ఖతార్ (వడ్యాట్ వాసి) -
నెలంతా రోజా పరిమళాలు
సాయంత్రాలు ఇఫ్తార్ విందులతో వీధులన్నీ ఘుమఘుమలాడ బోతున్నాయి. పిల్లలూ పెద్దల హడావిడితో వాతావరణమంతా సందడిగా మారనుంది. మసీదు మినార్లనుండి సైరన్ మోతలు వీనులవిందు చేయనున్నాయి. మండువేసవిలోనూ నిండు వసంతం కుండపోతలా వర్షించనుంది. మానవాళి పాపాలను తొలగించి, పునీతం చేసే పవిత్రరమజాన్ నెల ప్రారంభం కాబోతున్నది. మనిషిలోని దుర్లక్షణాలను హరింప చేసి, ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి వంటి సానుకూల భావనలను పెంపొందింపచేసే పవిత్ర రమజాన్ మానవాళికి సరైన జీవన సూత్రాలను ప్రబోధించే మార్గదర్శి. రమజాన్ ఒక అలౌకిక భావన. తేజోమయ ఆధ్యాత్మిక తరంగం. సత్కార్యాల సమాహారం. వరాల వసంతం. మండువేసవిలో నిండువసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికీ, జీవనసాఫల్యానికి అవసరమైన సమస్తమూ దీనితో ముడివడి ఉన్నాయి. రమజాన్ లో పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. సమస్త మానవాళికీ ఇది ఆదర్శ ప్రబోధిని. కారుణ్య సంజీవిని. మార్గప్రదాయిని. రమజాన్‌లో ఉపవాసాలు విధిగా నిర్ణయించ బడ్డాయి. ఇవి మానవుల్లో దైవభక్తినీ, దైవభీతిని ప్రోదిచేస్తాయి. స్వర్గానికి బాటలు వేస్తాయి. వెయ్యి నెలలకన్నా విలువైన రాత్రి ‘షబేఖద్ర్’ కూడా రమజాన్ లోనే ఉంది. ఈ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యినెలల ఆరాధనకన్నా మేలైనది.రమజాన్‌లో సత్కార్యాల ఆచరణ ఎక్కువగా కనబడుతుంది. దుష్కార్యాలు ఆగిపోతాయి. సమాజంలో ఒక చక్కని అహ్లాదకరమైన మార్పు కనిపిస్తుంది. ఐదుపూటల నమాజుతోపాటు, అదనంగా తరావీహ్ నమాజులు ఆచరించబడతాయి. సాధారణ దానధర్మాలతోపాటు, ఫిత్రా’అనబడే ప్రత్యేక దానం కూడా రమజాన్ లోనే చెల్లిస్తారు. దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చాలామంది ‘జకాత్ ’ కూడా రమజాన్ లోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదల అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. అంతేకాదు, రమజాన్ నెలతో అనుసంధానమై ఉన్న విషయాలు అనేకం ఉన్నాయి. ప్రధాన ఆరాధన, ప్రత్యేక ఆరాధన ‘రోజా’ (ఉపవాసవ్రతం) యే. దేవుడు ఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందే ప్రయత్నం చెయ్యాలి.నిజానికి ఉపవాస వ్రతమన్నది కేవలం ముహమ్మద్ ప్రవక్త అనుచరులకు మాత్రమే, అంటే ముస్లింలకు మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలికమైన, సార్వజనీనమైన ఆరాధన. దీనికి చాలా ఘనమైన, ప్రాచీన సామాజిక నేపథ్యం ఉంది. ఇది అనాదిగా అన్నికాలాల్లో. అన్ని సమాజాల్లో చెలామణిలోఉన్నట్లు దైవగ్రంథం పవిత్రఖురాన్ చెబుతోంది.‘విశ్వాసులారా..! పూర్వప్రవక్తల అనుయాయులకు ఏవిధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా విధిగా ఉపవాసాలు పాటించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’అంటే, ఉపవాస వ్రతం కేవలం ఈనాటి ముస్లిం సముదాయానికి మాత్రమే ప్రత్యేకమైనది, పరిమితమైనది కాదని, పూర్వకాలం నుండీ ఆచరణలో ఉన్న సనాతన ధర్మాచారమని మనకు అర్ధమవుతోంది. ఈ రోజు కూడా ప్రపంచంలోని అన్నిదేశాల్లో అన్నిజాతులు, అన్ని మతాల వారిలో ఏదో ఒక రూపంలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. మానవ సమాజంలో మంచి, మానవీయత, భయభక్తుల వాతావరణాన్ని జనింపజేయడం, విస్తరింపజేయడమే ఈ ఉపవాసాల ఆచరణలోని అసలు ఉద్దేశ్యం. అందుకే దేవుడు సృష్టిలో ఏ జీవరాసికీ ఇవ్వనటువంటి ప్రత్యేకత, బుధ్ధికుశలత, విచక్షణా జ్ఞానం ఒక్కమానవుడికే ప్రసాదించాడు. కాని మనిషి తనస్థాయిని గుర్తించక, దేవుడు ప్రసాదించిన బుద్ధీజ్ఞానాలను, శక్తియుక్తులను దుర్వినియోగ పరుస్తూ, ఇష్టానుసారం జీవితం గడుపుతూ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఎలా బతికినా ఇహలోక జీవితం సుఖంగా, సాఫీగా గడిచిపోతున్నదంటే ఇక ఏం చేసినా చెల్లిపోతుందని కాదు. ఏదో ఒకనాడు వీటన్నిటికీ దైవం ముందు హాజరై సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది, ఫలితం అనుభవించవలసి ఉంటుంది.అందుకని మానవుడు తన స్థాయిని గుర్తించాలి. మానవ సహజ బలహీనతలవల్ల జరిగిన తప్పుల్ని తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో దైవం వైపుకు మరలి సత్కార్యాల్లో లీనమై పోవాలి. దానికోసం పవిత్ర రమజాన్‌కు మించిన అవకాశం మరొకటి లేదు. ఈ నెలలో సత్కార్యాల పుణ్యం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. గోరంతచేసి కొండంత పొందవచ్చు. ఒక నఫిల్కు సున్నత్‌తో సమానంగా, సున్నత్‌కు ఫర్జ్‌తో సమానంగా, ఒక పర్జ్కు 70 ఫరజ్లతో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. మానవుడి ప్రతి ఆచరణకు పదినుండి ఏడు వందల రెట్లవరకు పుణ్యఫలం పెరిగిపోతుంది. అయితే ఒక్క ఉపవాసం మాత్రం వీటన్నిటికంటే అతీతం, ప్రత్యేకం. దీనికి ఒక పరిమితి అంటూ లేదు. ఉపవాసం ప్రతిఫలం అనంతం. అనూహ్యం. విశ్వప్రభువైన అల్లాహ్ తన అనంత ఖజానాలోంచి ఉపవాస ప్రతిఫలాన్ని స్వయంగా తానే అనుగ్రహిస్తానంటున్నాడు. అల్లాహు అక్బర్! కనుక అత్యంత భక్తిశ్రద్ధలతో రోజా పాటించి పరమ ప్రభువైన అల్లాహ్ నుండి నేరుగా ప్రతిఫలాన్ని అందుకొనే ప్రయత్నం చెయ్యాలి.మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధితో ఉపవాసాలు పాటించేవారి అంతర్గతంతో పాటు, బాహ్య శరీరంలోని పవిత్రాత్మనిత్యం జాగృతమై ఉంటుంది. అనుక్షణం వారు అప్రమత్తంగా ఉంటూ, అన్నిరకాల దోషాలనుండి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవ సహజ బలహీనతవల్ల ఏవో చిన్న చిన్న పొరపాట్లు దొర్లిపోవచ్చు. ఇలాంటి చిన్నా చితకా పొరపాట్లనుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి ముహమ్మద్ ప్రవక్త(స)ఫిత్రాలు చెల్లించమని ఉపదేశించారు. వీటివల్ల మరో గొప్ప సామాజిక ప్రయోజనం కూడా ఉంది. సమాజంలోని పేదసాదలకు ఈ ఫిత్రాల ద్వారా కాస్తంత ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. అందుకే ప్రవక్తమహనీయులు ఫిత్రాదానాన్ని ‘దీనులు, నిరుపేదల భృతి’ అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో, సుఖసంతోషాలతో జీవితం గడుపుతూ, పరలోక సాఫల్యం పొందాలన్నది ఇస్లామ్ ఆశయం. అందుకే జకాత్ , ఫిత్రాద్ ఖ, ఖైరాత్ అంటూ రకరకాల దానధర్మాలను ప్రోత్సహిస్తూ, సమాజంలో పేదరిక నిర్మూలనకు నిర్దిష్టమైన కార్యాచరణను ప్రతిపాదించింది. పవిత్రఖురాన్ మార్గదర్శకంలో, ప్రవక్తవారి ఉపదేశానుసారం మనం మన జీవితాలను సమీక్షించుకుంటే, సంస్కరణ ఎక్కడ అవసరమో గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా ఆచరణకు మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి స్వీయసమీక్షకు, సింహావలోకనానికి రమజాన్ కంటే మంచి తరుణం మరొకటి ఉండబోదు. అల్లాహ్ అందరికీ రమజాన్ శుభాలను సొంతం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించమని వినమ్రంగా వేడుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కశ్మీర్లో మళ్లీ ‘ఆపరేషన్లు’
న్యూఢిల్లీ/శ్రీనగర్: రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వాటిని పునరుద్ధరించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అన్ని అత్యవసర చర్యలు తీసుకోవాలని, ఉగ్ర దాడులు, హత్యాకాండ వంటి వాటిని నిలువరించాలని భద్రతా దళాలను ఆదేశించామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, హింస లేని వాతావరణం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. శాంతి కోరుకునే వారంతా ఏకతాటిపైకి రావాలని, తప్పు దారిలో వెళుతున్న వారిని శాంతి మార్గంలోకి తీసుకురావాలని కోరారు.∙రంజాన్ మాసం సందర్భంగా మే 17 నుంచి కశ్మీర్లో సైనిక ఆపరేషన్లను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. రంజాన్ మాసం ప్రశాంతంగా సాగేందుకు ఆపరేషన్లను నిలుపుదల చేసి సహకరించిన భద్రతా బలగాలను రాజ్‌నాథ్ అభినందించారు. అధికారిక సమాచారం ప్రకారం ఏప్రిల్ 17 నుంచి మే 17 మధ్య 18 ఉగ్ర దాడుల సంఘటనలు నమోదైతే.. ఆపరేషన్ల నిలుపుదల తర్వాత ఆ సంఖ్య 50కిపైగా పెరిగింది. నిరాశ కలిగించింది: రాజకీయ పార్టీలు ‘కేంద్రం ప్రకటన అసంతృప్తి కలిగించింది. ఇది అనూహ్య పరిణామం’ అని ప్రధాన ప్రతిపక్షం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధికార ప్రతినిధి జునైద్ మట్టు అన్నారు. భద్రతా దళాల కార్యకలాపాల విరమణను సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. కేంద్రం నిర్ణయం నిరాశ కలిగించిందనీ, ప్రస్తుత పరిస్థితుల్లో విరమణ పొడిగింపు సాధ్యం కాదని అధికార పీడీపీ ప్రధాన కార్యదర్శి పీర్జాదా మన్సూర్ అన్నారు. ‘శాంతి ప్రక్రియ టూ వే ట్రాఫిక్ లాంటిది. మా తరఫున చేయాల్సిందంతా చేశాం. విశ్వాసం కలిగించే చర్యలన్నిటినీ తీసుకున్నాం. కానీ బుఖారీకి ఏం జరిగింది? ఆయన్ను నిర్దాక్షిణ్యంగా చంపేశారు’ అని పీర్జాదా అన్నారు. కశ్మీర్ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టమైన విధానం లేదని జమ్మూ కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీఏ మిర్ విమర్శించారు. -
ఈద్ రోజూ హింసే!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో రంజాన్ పండుగరోజైన శనివారం కూడా కాల్పుల మోత మోగింది. రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై పాకిస్తానీ సైనికులు జరిపిన కాల్పుల్లో మణిపూర్‌కు చెందిన వికాస్ గురుంగ్ (21) అనే ఆర్మీ జవాన్ మరణించాడు. నియంత్రణ రేఖకు 700 మీటర్ల దూరంలో నౌషెరా సెక్టార్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాకిస్తాన్ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులకు దిగింది. అనంతనాగ్ జిల్లాలోని బ్రకపొరా గ్రామంలో నిరసన కారులకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణ జరుగుతుండగా గ్రెనేడ్ పేలి ఓ వ్యక్తి చనిపోయాడు. శ్రీనగర్ శివారు ప్రాంతంలోనూ దుండగులు జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ దినేశ్ పాశ్వాన్ గాయపడగా సైనిక వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. శ్రీనగర్ నగరంలోని సఫకదల్ ప్రాంతంలో ఘర్షణల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్, కుప్వారా ప్రాంతాల్లోనూ భద్రతా దళాలతో నిరసనకారులు ఘర్షణలకు దిగారనీ, అయితే కశ్మీర్ లోయ ప్రాంతంలో మాత్రం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ లేవని ఓ పోలీస్ అధికారి చెప్పారు. మిఠాయిల కార్యక్రమం రద్దు సాధారణంగా పండుగ రోజున భారత సైనికులు, పాకిస్తాన్ జవాన్లు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకునేవారు. అయితే కాల్పుల ఘటనల కారణంగా శనివారం భారత సైనికులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకపోయినప్పటికీ పండుగరోజున కూడా పాకిస్తానీ సైనికులు కాల్పులు జరపడం నీతిమాలిన చర్యని ఓ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు. పాక్ జవాన్లు రెచ్చగొట్టే చర్యలకు దిగినప్పటికీ భారత సైనికులు సంయమనం పాటించి విసిగిపోయిన అనంతరం ఎదురుకాల్పులకు దిగారన్నారు. బయటకొచ్చిన ఔరంగజేబు వీడియో ఆర్మీ జవాను ఔరంగజేబును గురువారం ఉదయం ఉగ్రవాదులు అపహరించి చంపివేయడం తెలిసిందే. ఔరంగజేబును చంపేందుకు కొద్దిసేపటి ముందు తీసినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి శనివారం బయటకు వచ్చింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఔరంగజేబును చంపడానికి ముందు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఔరంగజేబు విధులేంటి?, ఎక్కడెక్కడ పనిచేశాడు? తదితరాల గురించి ఉగ్రవాదులు ప్రశ్నించారు. -
రంజాన్ సుఖ సంతోషాలు నింపాలి
కురుపాం : సుఖ సంతోషాలతో ముస్లిం సోదరులంతా బాగుండాలని, రంజాన్ ముస్లిం కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అన్నారు. కురుపాంలోని శివ్వన్నపేటలో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో సహపంక్తిలో కూర్చొని ఫలాహారాన్ని స్వీకరించి రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులంతా రంజాన్ పండగ సరదాగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు ఐక్యంగా కలసిమెలసి ఉంటూ ఆనందాల నడుమ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింలు ఐక్యతను చాటడం ద్వారా మరింతగా ఎదగాలని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ నిషార్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికారి ప్రతినిధి శెట్టి నాగేశ్వరరావు, గోరిశెట్టి గిరిబాబు, జి.వి.శ్రీనువాసరావు, జియ్యమ్మవలస మండల కన్వీనర్ గౌరీశంకరరావుతో పాటు కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
‘రంజాన్’కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ) మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. పండుగ ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. రంజాన్ మాసం ప్రారంభం నుంచి పండుగ రోజు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. రహదారులు పరిశుభ్రంగా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. మసీదుల వద్ద విద్యుత్ అలంకరణలు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమైన ప్రాంతాల్లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా దుకాణాల సమయాలను పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నీటిసరఫరా పనులను జూలైలోగా పూర్తి చేస్తామని, మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేందుకు చర్యలు చేపడతామని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. సమావేశంలో మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, అహ్మద్ పాషాఖాద్రీ, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, మోజంఖాన్, కౌసర్ మొహినుద్దీన్, ఎమ్మెల్సీలు జాఫ్రీ, హైదర్ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో రగడ రంజాన్ ఏర్పాట్ల సమీక్షలో మజ్లిస్ ఎమ్మెల్యేలు రగడ సృష్టించారు. ఇటీవల ఈదురు గాలులతో పాతబస్తీలో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాల ప్రస్తావన తేవడంతో గందరగోళం చోటుచేసుకుంది. సమీక్ష అనంతరం ఇతర అంశాలపై చర్చిద్దామని మంత్రులు పేర్కొనగా, మజ్లీస్ ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఒక దశలో మజ్లిస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా మంత్రులు కలుగ జేసుకొని.. పాతబస్తీలో వెంటనే విద్యుత్, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించడంతో వారు శాంతించారు.