ముస్లింల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా గల్ఫ్ దేశాల్లోని ప్రభుత్వాలు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా కార్మికుల పనివేళలను తగ్గించడం, వారికి ఎక్కువ వేతనం చెల్లించడం తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఖైదీలకు క్షమాభిక్ష కూడా అమలు చేస్తున్నాయి. గత సంవత్సరం ఖైదీలకు క్షమాభిక్షను గల్ఫ్‌లోని ఏ దేశమూ ప్రకటించలేదు.
వివిధ కారణాల వల్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన వారు సాధారణ జీవితం కొనసాగించడానికి అనుమతి లభించనుంది. తెలియక నేరారోపణలపై జైలు శిక్షకు గురైన వారిలో మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారికి క్షమాభిక్ష లభించనుంది. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడు, షార్జా రూలర్(పాలకుడు) వేర్వేరుగా ఖైదీల విడుదలకు ప్రకటనలు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ ఖలీఫా తమ దేశంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో 3,005 మందికి క్షమాభిక్షను ప్రసాదించనున్నట్లు వెల్లడించారు. అలాగే షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ కాసిమి కూడా షార్జాలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిలో మంచి నడవడిక కలిగిన 377 మందికి క్షమాభిక్షను ప్రసాదించారు.
అయితే షార్జా రాజ్యం యూఏఈలో ఒక భాగం కాబట్టి యూఏఈ అధ్యక్షుడు ప్రకటించిన 3,005 మంది ఖైదీల్లో షార్జా రూలర్ ప్రకటించిన ఖైదీలు 377 మంది ఉన్నారా.. లేక వేర్వేరుగా ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించనున్నారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈసారి క్షమాభిక్ష పొందిన వారి సంఖ్యను పరిశీలిస్తే గతంలో కంటే ఎక్కువ ఉందని గల్ఫ్ దేశాల వ్యవహారాల పరిశీలకులు పేర్కొంటున్నారు. క్షమాభిక్ష పొందనున్న ఖైదీల్లో మన దేశానికి చెందిన వారు, ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. ఉపాధి కోసం యూఏఈ పరిధిలోని వివిధ రాజ్యాలకు వలస వెళ్లిన కార్మికులు కొందరు వీసా వర్క్ పర్మిట్ లేకుండా చట్ట విరుద్ధంగా ఉంటూ పోలీసులకు పట్టుబడ్డారు.
సొంత ప్రాంతానికి వెళ్లడానికి జరిమానా కట్టే పరిస్థితి లేక పోవడంతో జైలు పాలుకావడం, గల్ఫ్ చట్టాలపై అవగాహన లేకుండా కేసుల్లో ఇరుక్కుని నేరారోపణలపై జైలు శిక్షకు గురైన వారూ ఉన్నారు. అలాగే యూఏఈలో నిషేధించిన మన మందులను రవాణా చేయడం లేదా తమ వద్ద కలిగి ఉండి పోలీసులకు పట్టుబడి జైలు పాలైన వారు కూడా ఉన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో చట్ట విరుద్ధంగా ఉంటూ జరిమానా చెల్లించలేని వారు తక్కువ మంది ఉండగా, నిషేధిత మందులతో పట్టుబడిన వారే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. రంజాన్ సందర్భంగా ఖైదీల విడుదలకు ప్రకటన చేసిన పాలకులు క్షమాభిక్షను అమలు చేసిన తరువాత.. ఏ తరహా నేరాలకు పాల్పడిన ఖైదీలు విడుదలయ్యారో వెల్లడయ్యే అవకాశం ఉంది.
పనివేళల్లో మార్పులు..
సాధారణ రోజుల్లో ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనివేళలు ఉంటాయి. ఇందులో ఎనిమిది గంటల పనికి బేసిక్ వేతనం చెల్లిస్తుండగా.. అదనపు నాలుగు గంటల పనికి ఓటీ(ఓవర్ టైం)ను వర్తింపచేసి అదనపు వేతనం చెల్లిస్తారు. రంజాన్ మాసంలో మాత్రం పనివేళలు ఆరు గంటలు ఉంటాయి. అదనపు వేళలు పనిచేస్తే ఓటీ వర్తింపజేస్తారు. తాజాగా ఖతార్ ప్రభుత్వం వెల్లడించిన సర్క్యులర్ ప్రకారం మినిస్ట్రీస్ గవర్నమెంట్ ఏజెన్సీస్, పబ్లిక్ రంగ కంపెనీలు, వివిధ రంగాల సంస్థలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఉంది. అన్ని రంగాల్లోని కార్మికులకు ఈ పని వేళలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. కంపెనీల తీరును బట్టి పనివేళల్లో మార్పులు చేశారు.
కొన్ని కంపెనీల్లో ఉదయం ఐదు గంటల నుంచి 11 గంటల వరకు, మరికొన్ని కంపెనీల్లో ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనివేళలను నిర్ణయించారు. ఇందులో ఆరు గంటలు మాత్రం సాధారణ పనివేళలుగా.. మిగిలిన సమయం ఓటీగా పరిగణిస్తున్నారు. ఖతార్‌లో పనివేళలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉండగా.. సౌదీ అరేబియాలో మాత్రం రాత్రిపూటనే కార్మికులకు పనులు కల్పిస్తున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉపవాస దీక్షలు పాటించే కార్మికులతో పాటు సాధారణ కార్మికులకు ఒకే విధమైన పని వేళలను సౌదీలో వర్తింపజేస్తున్నారు. కువైట్, యూఏఈ, ఒమాన్ తదితర దేశాల్లోనూ మార్పులు చేశారు.
పాఠశాలల వేళల్లోనూ మార్పు
రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఖతార్‌లో పాఠశాలల సమయాల్లో అక్కడి ప్రభుత్వం మార్పులు చేసింది. ఈమేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలకు పని వేళలను కుదించింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనివేళలు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇదే విధంగా పనివేళలు వర్తించనున్నాయి. సాధారణ రోజుల్లో ఒంటి గంట వరకు పాఠశాలలు నడుస్తాయి. కాగా, మిగతా గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి.
రంజాన్ మాసంలో కార్మికులకు ఎంతో ప్రయోజనం
గల్ఫ్‌లో సాధారణ రోజుల్లో కార్మికులకు పని భారం అధికంగానే ఉంటుంది. కానీ, రంజాన్ మాసంలో వెసులుబాటు కలుగుతుందని పలువురు కార్మికులు తెలిపారు.
సాధారణ పని వేళలు తగ్గిపోవడంతో పాటు ఓటీ ద్వారా ఎక్కువ వేతనం పొందడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కంపెనీల్లో ముస్లిం కార్మికులు సాధారణ పనివేళల్లో పనిచేసి వారి క్యాంపులకు వెళ్లిపోతుంటారు. దీంతో ఇతర మతాల కార్మికులకు ఓవర్ టైం పని చేయడానికి అవకాశం లభిస్తుంది. ఓటీ వర్తించడం వల్ల సాధారణ పనివేళల్లో లభించే వేతనం కంటే.. ఎక్కువ వేతనం లభిస్తుంది. గల్ఫ్ దేశాల్లోని కొందరు షేక్‌లు రంజాన్ మాసంలో కార్మికులకు బోనస్‌లను ప్రకటించడం, సాధారణ సమయంలో ఇచ్చే వేతనం కంటే ఎక్కువ వేతనం చెల్లించడం, బహుమతులు ఇవ్వడం కూడా సంప్రదాయంగా వస్తోంది. అందువల్ల రంజాన్ మాసంలో తెలుగు కార్మికులు సెలవులపై ఇంటికి రాకుండా కంపెనీల్లో, యజమానుల వద్ద పనిచేస్తూనే ఉంటారు.
సౌదీలో రాత్రిపూటనే పనిచేస్తున్నాం
సౌదీలో రాత్రిపూటనే పనిచేస్తున్నాం. ఉపవాస దీక్షలు పాటిస్తుండటం వల్ల కంపెనీ యాజమాన్యాలు అన్నీ రాత్రి పూటనే పనిచేయించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని కల్పిస్తున్నాయి. సాధారణ రోజులకు రంజాన్ మాసంలో పనికి ఎంతో తేడా ఉంది. – అజీమ్, రియాద్ (కమ్మర్‌పల్లి వాసి)
రంజాన్ మాసంలో కార్మికులకు లాభమే
రంజాన్ మాసంలో గల్ఫ్‌కు సంబంధించి ఏ దేశంలో పనిచేసినా కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. పనివేళలు కుదించినా బేసిక్ వేతనం చెల్లిస్తారు. అంతేకాక ఓవర్ టైం పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. అందువల్ల కార్మికులు రంజాన్ మాసంలో సెలవులు తీసుకోరు. – ముత్యాల గంగాధర్, ఖతార్ (వడ్యాట్ వాసి)
Comments
Please login to add a commentAdd a comment