బిల్డర్‌పై చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి
హైదరాబాద్: నానక్‌రాం గూడలో భవన ప్రమాదానికి కారణమైన బిల్డర్ సత్యనారాయణ సింగ్ పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. భవనం వెనుక సెల్లార్ కోసం తవ్వకాలు జరిపినందునే ఈ ప్రమాదం జరిగినట్లు హోం మంత్రి తెలిపారు. మరో వైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.
రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని వెలికి తీసింది. ప్రాణాలతో బయటపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భవన శిథిలాల కింద 12 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. శిథిలాల నుంచి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివ అనే యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. శిథిలాల కింద నుంచి ఆర్తనాదాలు వినిపిస్తుండటంతో పైపుల ద్వారా ప్రాణవాయువును పంపిస్తూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తక్కువ స్థలంలో ఆరు అంతస్థులతోపాటు పెంట్‌హౌస్ నిర్మించిన సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తుసింగ్పై అధికారులను బెదిరించిన ఘటనలకు సంబంధించి పలు పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం.