homeless woman
-
ఫుట్‌పాత్‌పై ప్రసవం
సాక్షి, న్యూఢిల్లీ: భర్త, ఇద్దరు పిల్లలతో రోడ్లపై నివసించే మహిళ దక్షిణ ఢిల్లీలో రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌పై ఆడపిల్లను ప్రసవించింది. బారాపులా ప్రాంతంలోనున్న నైట్‌షెల్టర్లలో చోటు లభించకపోవడం వల్ల లక్ష్మి, రోజు కూలీ పనిచేసే ఆమె భర్త బబ్లూ, ఇద్దరు పిల్లలు బుధవారం రాత్రి పుట్‌పాత్‌పై నిద్రపోయారు. ఆ రాత్రి ఆమెకు నొప్పులు వచ్చి బిడ్డను అక్కడే ప్రసవించింది. బిడ్డను ప్రసవించిన 18 గంటల తరువాత కూడా తల్లికి, బిడ్డకు మధ్య ఉండే పేగును కత్తిరించలేదని, దాని వల్ల తల్లికి, బిడ్డకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఎన్జీవోకు చెందిన సునీల్‌కుమార్ ఎలీడియా చెప్పారు. నైట్ రెçస్క్యూ టీమ్ అందించిన సమాచారంతో తాము అంబులెన్స్‌ను పిలిచి మహిళను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చించామని ఆయన చెప్పారు. గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ఢిల్లీ ప్రభుత్వం రెండు నైట్ షెల్టర్లు నడుపుతోందని అయితే అయితే వాటి వద్ద ఆపదలో, అవసరంలో ఉన్న వారిని ఆదుకునే, రక్షించే యంత్రాంగం లేదని సునీల్‌కుమార్ చెప్పారు. లక్ష్మి, ఆమె భర్త ఏడు సంవత్సరాలుగా ఢిల్లీ రోడ్లపై నివసిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని జార్ఖండ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మి, కొత్తగా పుట్టిన ఆమె కూతురు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని, వారికి సరైన ఆరోగ్య సంరక్షణ లభిస్తోందని సునీల్ కుమార్ చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతానికి తల్లీ బిడ్డలను షెల్టర్ హోమ్‌కు పంపి తరువాత పాలిచ్చే తల్లుల కోసం నడిపే కేంద్రానికి తరలిస్తామని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు సభ్యుడు బిపిన్ రాయ్ చెప్పారు. -
అవ్వకు బువ్వపెట్టి.. ఆశ్రమంలో చేర్పించాడు
సాక్షి, హైదరాబాద్: అది నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కూకట్పల్లి జేఎన్టీయూ సిగ్నల్.. జనం ఎవరి సోయిలో వాళ్లు.. రోడ్డు పక్కనే ఒక అవ్వ.. పెట్టే దిక్కులేక చాన్నాళ్ల నుంచి తిండి తిననట్లు బక్కచిక్కిన శరీరం.. ఎటు పోవాలో, ఏం చెయ్యాలో తెలియని బిత్తరచూపులు! అటుగా వచ్చిన హోంగార్డు ఒకరు ఆ అవ్వను చూసి చలించిపోయాడు. పక్కనున్న టిఫిన్ సెంటర్ నుంచి ఆహారం తీసుకొచ్చి ఓపికగా అవ్వకు తినిపించాడు. అంతేనా, అధికారుల సాయంతో అవ్వను ఆశ్రమంలో చేర్పించాడు. అతని పేరు బి.గోపాల్. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డు. ఉద్యోగరీత్యా అతని స్థాయి చిన్నదే అయినా, ఉన్నత వ్యక్తిత్వం అతని సొంతం. అందుకే ఉన్నతాధికారుల నుంచి సామాన్యపౌరుల దాకా అందరూ అతన్ని అభినందిస్తున్నారు. తెలంగాణ డీజీపీకి పీఆర్వో భార్గవి పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ వృద్ధురాలిని చర్లపల్లిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆనందాశ్రమానికి తరలించినట్లు భార్గవి తెలిపారు. -
సూపర్ స్టార్ కారుకు అడ్డంపడిన నిర్భాగ్యురాలు!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చుట్టూ నిత్యం అభిమానుల వరద పారుతూనే ఉంటుంది. తాజాగా ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య రెండుకోట్ల (20 మిలియన్ల)ను దాటింది. ఈ సందర్భంగా అభిమానులు తనపై చూపుతున్న ప్రేమాదరణలకు షారుఖ్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. కానీ షారుఖ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అత్యంత విలాసవంతమైన బీఎండబ్ల్యూ ఐ8లో ఆయన వెళుతుండగా ఓ నిర్భాగ్యురాలు ఆయన వాహనానికి అడ్డంపడింది. దీంతో ఆమెను షారుఖ్ బాడీగార్డులు పక్కకు ఈడ్చుకెళ్లారు. బాంద్రాలోని షారుఖ్ నివాసం ఎదుట ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో షారుఖ్ కారు నడుపుతున్నారా? లేక కారులో ఉన్నారా? అన్నది కచ్చితంగా తెలియదు. కానీ నిరాశ్రయురాలైన ఆ మహిళ పట్ల షారుక్ బాడీగార్డులు దురుసుగా ప్రవర్తించడం మాత్రం నెటిజన్లకు ఆగ్రహం కలిగిస్తున్నది. హర్యానా నంబర్ ప్లేట్ తో ఉన్న బీఎండబ్ల్యూ ఐ8ను గత వారమే గుర్గావ్ లో షారుఖ్ కొన్నట్టు తెలుస్తున్నది. ‘బీస్ట్’గా పిలిచే ఈ వాహనం ఆన్ రోడ్డు ప్రైస్ ముంబైలో రూ. 2.78 కోట్లుగా ఉంది.