ప్రభుత్వ శిశు ప్రదానోత్సవం
‘‘సార్! మనమెటూ యిప్పుడు పెళ్లిళ్ల పేరున భారీ కానుకలు నవ వధువులకు సమర్పిస్తున్నాం. దానికి పొడిగింపుగా అయిదు రోజుల హనీమూన్ ప్యాకేజీని అందిస్తే మన పార్టీ, మన ప్రభుత్వం చిరస్మరణీయంగా జనహృదయాలలో పచ్చిగా పచ్చగా కలకాలం ఉంటాయ్ సార్. రైల్వే శాఖ, ఆర్టీసీ, పర్యాటక శాఖలు సహకరిస్తే హనీమూన్ దమ్మిడీ ఖర్చు లేకుండా ఆడుతూ పాడుతూ గడచిపోతుంది.’’
ముస్లిమ్ భక్తులు మక్కా మదీన దర్శించాలనుకుంటే హజ్ యాత్రకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ వస్తోం ది. స్తోమతు లేని వారు కూడా మక్కా యాత్ర చేసి వస్తుం టారు. క్రైస్తవ మిత్రులు జెరు సలెం వెళ్లడానికి మేము వెన్ను దన్నుగా ఉంటామని క్రిస్మస్ సందర్భంగా వాక్ కానుక ఇచ్చారు. అయితే మరి మా సంగతేమిటని హిందువుల మెదళ్లలో ప్రశ్నలు పుట్టాయి. మనది హిందూ దేశం, మన దేవుళ్లంతా స్థానికులు. అన్నీ యిక్కడిక్కడే కాబట్టి, విదేశీ మారకంతో పనిలేదు కాబట్టి, ఒక పొట్లం యాత్రని శ్రీసర్కార్ వారు సభక్తికంగా భరిస్తే తూకం సరిపోతుంది. హెచ్చుతగ్గులు లేక అంతా భాయి భాయి అనే నినాదంతో ముందుకు సాగుతాం. అప్పు డప్పుడు నన్నొక ధర్మ సందేహం దయ్యంలా పట్టి పీడిస్తూ ఉంటుంది. మన దేశం సెక్యులర్ దేశం కదా. అంటే మతాతీత లౌకిక రాజ్యం కదా. అప్పుడు అందరూ అన్ని మత కేంద్రాలను దర్శించడం ధర్మం కదా అనిపిస్తూ ఉంటుంది.
ఇక మళ్లీ హిందూ ప్యాకేజీ టూర్లోకి వస్తే అటు హరిద్వార్ నుంచి కన్యాకుమారి దాకా, అష్టదశ శక్తిపీఠాలను సేవించుకుంటూ, కాశీ విశ్వేశ్వరుణ్ణి అభి షేకించి, షిర్డీ సాయి కృపకి పాత్రులై, అయ్యప్ప శరణు కోరి, కలియుగ దైవంగా ఏడుకొండల మీద కొలువైన స్వామికి మొక్కి, పేరు లేకున్నా మహత్తులున్న యింకా కొందరు దేవుళ్లని కొలిచి అడంగుకి చేరేట్టుగా వుండాలి. అనాదిగా వస్తున్న హైందవ నమ్మకాలను గౌరవిస్తూ - వారి అస్థికల్ని త్రివేణి సంగమంలో శ్రద్ధగా కలుపుకో డానికి, నిమజ్జనం చేసుకోడానికి కూడా ప్రభుత్వం దన్నుగా నిలవాలి. వారి అస్థికలంటే వారివని కాదు. వారి యొక్క పెద్దలవని భావం. ఈ మధ్య మీడియా వక్రరేఖ మీద నడుస్తోంది. సరళరేఖ మీదికి రావాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
సారు ఆలోచనకి సెకట్రీ నివ్వెరపోయాడు. అప్రయ త్నంగా వచ్చిన ఆనంద బాష్పాలు తుడుచుకున్నాడు. తరువాత ప్రాధేయ పూర్వకంగా ఓ చూపు చూశాడు. ‘‘సరే, కానీ’’ అన్నట్టు చూశాడు అధినాయకుడు. ‘‘సార్! మనమెటూ యిప్పుడు పెళ్లిళ్ల పేరున భారీ కానుకలు నవ వధువులకు సమర్పిస్తున్నాం. దానికి పొడిగింపుగా అయిదు రోజుల హనీమూన్ ప్యాకేజీని అందిస్తే మన పార్టీ, మన ప్రభుత్వం చిరస్మరణీయంగా జనహృదయాలలో పచ్చిగా పచ్చగా కలకాలం ఉంటాయ్ సార్. రైల్వే శాఖ, ఆర్టీసీ, పర్యాటక శాఖలు సహకరిస్తే హనీమూన్ దమ్మిడీ ఖర్చు లేకుండా ఆడుతూ పాడుతూ గడచిపోతుంది. పగలూ రాత్రీ ఒక్క తీరున నడిచి పోతుంది’’.
‘‘సెకట్రీ! ఈ చలి దెబ్బకి నీ బుర్ర పాదరసంలా పరుగులు పెడుతోంది. ఇంకేమైనా వుంటే బయట పడెయ్. లోపలి చెత్తంతా వదిలి స్వచ్ఛ భారత్ అవు తుంది’’. సారు మాటలకి సెకట్రీ తెగ సిగ్గుపడ్డాడు. ‘‘పెళ్లి, ఆ తర్వాత హనీమూన్తో ముందుకు వెళ్లారు కదండీ. వెనక్కి తిరిగి వచ్చాక సంప్రదాయబద్ధంగా సీమంతం! ఇది ఆల్రెడీ మన ఎజెండాలో వున్నదే. కాబోయే తల్లులకు పాలు, గుడ్లు పౌష్టికాహారం అంది స్తూనే వున్నాం. వారు గుడ్డులో పచ్చసొన చూసినప్పుడల్లా మీరే కదండీ గుర్తొస్తారు. ఎటూ ఔషధ గుణాలున్నాయి కాబట్టి పాలల్లో కూడా చిటికెడు పసుపు కలిపితే వుభయ తారకంగా ఉంటుంది’’. అక్కడ ఆపి పాయింట్లోకి రమ్మని మందలించాడు. ‘‘అదే సార్, ఇంకా మనం సీమంతం చేసిన తల్లులు వున్నారు కదండీ, వాళ్లంతా పండంటి బిడ్డల్ని కంటారు. మనకి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుస్తూ ఉంటుందండీ.
దీనికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటాం. పిల్లల్ని ఎత్తుకుని ఆసుపత్రి నుంచి తల్లులు వెళ్లిపోకుండా దాన్నొక అధికారిక యీవెంట్గా, ఒక వేడుకగా జరుపుతాం. తల్లులందరూ తాము కన్న పిల్లల్ని ప్రేమాభిమానాలతో అందుకుం టారు. పది మంది మంత్రులు, పది మంది సామంతులు పచ్చ పూల పొత్తిళ్లలో పిల్లల్ని తల్లులకు హర్షధ్వానాల మధ్య అందిస్తారు. ‘ప్రభుత్వ శిశు ప్రదానోత్సవం’ పేరిట యిది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. పుట్టీపుట్టగానే బుల్లి తెరకెక్కినందుకు, తల్లులు ఆనందిస్తారు. ‘నాకేంటి మరి’ అని మీరనుకోవద్దు. కవలలు పుట్టినప్పుడు మీరే అందిస్తారు. తనివితీరా ప్రసంగిస్తారు.
- (వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత)
శ్రీరమణ