చిన్నతనం నుంచే చోరీల బాట
కారు, బైక్‌లు, వెండి వస్తువులు స్వాధీనం
సొత్తు విలువ రూ.2.50 లక్షలు
రావులపాలెం :
బోస్టన్ స్కూలుకు వెళ్లొచ్చినా.. అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. చోరీలనే వృత్తిగా ఎంచుకుని అనేకచోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి, కారు, బైక్‌లు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం సీఐ పీవీ రమణ బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో విలేకరులకు వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని లజపతిరాయ్ పేటకు చెందిన జక్కంపూడి రాధాకృష్ణ చిన్నతనం నుంచి దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. పోలీసులు బోస్టన్ స్కూల్‌కు పంపినా, అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. 2015 మార్చి 2న కొత్తపేటలోని కొప్పిశెట్టివారి వీధిలో ఉన్న ఓ ఇంట్లో వెండి వస్తువులు, కొంత నగదు చోరీ చేశాడు. 2016 ఫిబ్రవరి 24న రావులపాడులోని ఓ బైక్ షోరూంలో కొత్త మోటార్ సైకిల్‌ను, ఏప్రిల్ 4న ఊబలంకలో ఓ స్కూటర్‌ను, జూన్ 21న అమలాపురంలోని విద్యుత్ నగర్లో కారు, ఈ నెల ఒకటిన హెచ్‌బీ కాలనీలో స్కూటర్‌ను చోరీ చేశాడు. ఆయా పోలీసు స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం ఈతకోట సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్సై పీవీ త్రినాథ్‌కు అనుమానాస్పదంగా తచ్చాడుతున్న రాధాకృష్ణ తారసపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, ఆయా చోరీ కేసుల వివరాలు తెలిశాయి. ఆయా కేసుల్లో కారు, మూడు బైక్‌లు, 12 తులాల వెండి వస్తువులను పోలీసులు రికవరీ చేశారు. చోరీ సొత్తు విలువ రూ.2.50 లక్షలు ఉంటుంది. నిందితుడిపై పాలకొల్లు పోలీసు స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. నిందితుడిని కొత్తపేట జేఎఫ్సీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన ఎస్సై పీవీ త్రినాథ్, అడిషనల్ ఎస్సై పి.శోభన్‌కుమార్, పీఎస్సై జి.సురేంద్ర, ఏఎస్సైలు ఆర్వీ రెడ్డి, రామచంద్రరావు, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు.