‘నాకంటూ ఒకటుందని చెప్పేందుకు హ్యాపీగా ఉంది’
లండన్: ఆత్మస్థైర్యంతో ముందుకెళితే సాధ్యంకానిదేది లేదంటారు. అవసాన దశలో ఉన్నా చరిత్ర సృష్టించడం పెద్ద కష్టమైన పనేం కాదు అని చెబుతుంటారు. సరిగ్గా కాంగోకు చెందిన ఓ యువతి విషయంలో ఇదే జరిగింది. హెచ్ఐవీ పాజిటివ్ బారిన పడిన హర్సిలీ సిందా వా బోంగో (22) అనే యువతి 2017 సంవత్సరానికిగాను బ్రిటన్లో మిస్ కాంగో కిరీటం దక్కించుకుంది. స్ట్రాట్ఫోర్డ్ టౌన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం లండన్లో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో చదువుతున్న డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన ఈ యువతి 11ఏళ్లప్పుడే హెచ్ఐవీకి గురైంది.
ఆ విషయం తెలిసి కూడా కుంగిపోకుండా మనోధైర్యంతో ముందుకెళ్లగా ఆమెను ఈ అదృష్టం వరించింది. ఆమె విజయాన్ని గురించి స్పందిస్తూ ‘నా జీవితంలో నాకంటూ కనీసం ఏదో ఒకటి ఉంది అని చెప్పుకునేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా కథ ఎంతోమంది హృదయాలను కదిలించింది. అది నాకు చాలా ముఖ్యమైనది. నేను తిరిగి కాంగోకు వెళ్లిపోవాలని అనుకుంటున్నాను. హెచ్ఐవీ గురించి అవగాహన కార్యక్రమాలు ప్రచారం చేస్తాను. కొంతమంది యువతీ యువకులను కూడగట్టుకొని వారితో కలిసి విస్తత ప్రచారం నిర్వహిస్తాను. ప్రపంచంలో హెచ్ఐవీ ఉండకూడదు’ అని చెప్పింది.