అమెరికన్లకు ఎబోలా గురించి తెలియదు!!
అమెరికన్లలో చాలామందికి అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్ గురించి అసలు ఏమాత్రం తెలియదట. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెచ్ఎస్పీహెచ్) నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. అమెరికాలో కూడా ఎబోలా విపరీతంగా వ్యాపిస్తుందని 39 శాతం మంది అమెరికన్లు భావిస్తుంటే, తమ కుటుంబంలోనే ఎవరో ఒకరికి ఆ వ్యాధి వస్తుందని 26 శాతం మంది అనుకుంటున్నారు. చదువు తక్కువగా ఉన్నవాళ్లే ఎక్కువగా ఈ వ్యాధి అమెరికాలో వ్యాపిస్తుందని భయపడుతున్నారు. అంతేకాదు.. సర్వేలో పాల్గొన్నవాళ్లలో మూడోవంతు మంది అయితే.. ఎబోలా వ్యాధి వచ్చినవాళ్లకు దాన్ని నయం చేయడానికి అద్భుతమైన మందు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉందని అనుకుంటున్నారని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన గిలియన్ స్టీల్ఫిషర్ చెబుతున్నారు.
వాస్తవానికి ఎబోలా గాలిలో వ్యాపించే వ్యాధి కాదు. ఇది నేరుగా శరీర స్రావాల నుంచి, అది సోకిన వస్తువుల నుంచి, జంతువుల నుంచి మాత్రమే వ్యాపిస్తుంది. ఇప్పటివరకు ఈ వ్యాధిని నిరోధించడానికి గానీ, వచ్చిన తర్వాత అరికట్టడానికి గానీ ఎలాంటి మందు ఇంతవరకు కనుక్కోలేదు. అయితే వచ్చినవారికి ఆక్సిజన్ ఎప్పటికప్పుడు ఇవ్వడం, బీపీ లెవెల్ సరిగ్గా ఉండేలా చూడటం, ఫ్లూయిడ్స్ ఇవ్వడం లాంటివి చేసి జీవితకాలం పెంచుతున్నారు.