శాంతించిన వంశధార
- ఒడిశాలోని క్యాచ్మెంట్ ఏరియాలో తగ్గిన వర్షాలు
- గొట్టా బ్యారేజీ నుంచి క్రమంగా తగ్గుతున్న నీటి విడుదల
- తేలుతున్న పంట నష్టాలు.. రైతుల గగ్గోలు
హిరమండలం: ఒడిశాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వంశధారకు వరద ముప్పు తప్పింది. ఎగువ నుంచి వచ్చే నీటి పరిమాణం తగ్గడంతో హిరమండలంలోని గొట్టా బ్యారేజీ నుంచి నీటి విడుదలను కూడా అధికారులు క్రమంగా తగ్గించారు. వరద నీరు తగ్గుతున్న కొద్దీ.. ఇప్పుటికే ముంపునకు గురైన పంటల నష్టాలు తేలుతున్నాయి. మూడు రోజులుగా నీటిలో నాని దెబ్బతిన్న పంటలను చూసుకొని రైతులు కుంగిపోతున్నారు.
జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి గొట్టా బ్యారేజీ నుంచి 79వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా.. సోమవారం ఉదయం నుంచి క్రమం గా దాన్ని తగ్గిస్తూ వచ్చారు. ఉదయం 6 గంటలకు 71,105 క్యూసెక్కులు, 10 గంటలకు 67,158 క్యూసెక్కులు, సాయంత్రం 5 గంటలకు 51,598 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. 19 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నట్లు వంశధార డీఈఈ ఎస్.జగదీష్ తెలిపారు.
ఆర్డీవో పరిశీలన
వంశధార వరద పరిస్థితిని గొట్టా బ్యారేజీ వద్ద పాలకొండ ఆర్డీవో ఎన్.తేజ్‌భరత్ సోమవారం పరిశీలించారు. ఒడిశాలోని క్యాచ్మెంట్ ఏరియా ల్లో వర్షపాతం, వరదల నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. ఆయనతో పాటు తహశీల్దారు డి.చంద్రశేఖరరావు, ఎంపీడీఓ బి.కుమారస్వామి, తదితరులు ఉన్నారు.